Mokshagna: మోక్షజ్ఞ.. అరంగేట్రం ఆ నాడే! అంతా సిద్ధం
ABN , Publish Date - Oct 30 , 2026 | 01:20 PM
మొత్తానికి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ అరంగేట్రంపై మరో తేదీ జనం ముందుకు వచ్చింది. ఆ తేదీన కూడా ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారనీ వినికిడి. ఇంతకూ ఎప్పుడు మోక్షు మొదటి సినిమా ఓపెనింగ్ ఎప్పుడు? వారు ఫాలో అయ్యే సెంటిమెంట్ ఏంటి?
అదుగో ఇదుగో అంటూనే మోక్షజ్ఞ (Mokshagna) కు 32 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ వయసులో హీరోగా ఎంట్రీ ఇవ్వడమేంటి అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. అయినా అదీ ఓ రికార్డే అన్నది బాలకృష్ణ (Balakrishna) అభిమానుల మాట. ఎప్పటి నుంచో బాలయ్య నటవారసుడిగా మోక్షజ్ఞను తెరపై చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. బాలయ్య సినిమాల్లో బాల్యంలోనే మోక్షు నటిస్తాడని వినిపించింది.
బాలయ్య 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి టైమ్‌లోనూ అందులో మోక్షజ్ఞ నటిస్తున్నాడని ప్రచారం సాగింది. బాలయ్యకు అచ్చివచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షు తెరంగేట్రం ఉంటుందనీ ఓ వార్త గుప్పుమంది. చివరకు 'హనుమాన్' డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యాక షూటింగ్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మోక్షజ్ఞ హీరోగా వశిష్ఠ (Mallidi Vassishta) దర్శకత్వంలో సినిమా ఖచ్చితంగా మొదలవుతుందని వినిపిస్తోంది. అందుకు డిసెంబర్ 2వ తేదీని ఎంచుకున్నట్టూ సమాచారం.
నందమూరి నటవంశంలో ఓ సెంటిమెంట్ నెలకొందని సినీ ఫ్యాన్స్ లో టాక్.. నందమూరి కుటుంబం నుండి ఏ నటుడైనా సినిమా రంగంలో అడుగుపెట్టే సమయంలో హంగామా సాగితే అలాంటి వారు అంతగా అలరించలేదన్నది ఆ సెంటిమెంట్. నందమూరి నటవంశానికి మూలపురుషుడైన యన్టీఆర్ తొలిసారి తెరపై కనిపించిన 'మనదేశం'లో ఆయన ఓ కీలక పాత్ర ధరించారు. అంతే తప్ప ఏ లాంటి హంగామా సాగలేదు...అయితే ఆయన తనయుడు హరికృష్ణను 'శ్రీకృష్ణావతారం'లో బాలకృష్ణుని పాత్రలో నటింప చేయగానే పబ్లిసిటీ భలేగా సాగింది. ఇక యన్టీఆర్ నటవారసునిగా బాలయ్య కొన్ని చిత్రాల్లో కనిపించినా, సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయంలో ఏ హంగామా చోటు చేసుకోలేదు.
పైగా అప్పుడు యన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ ఉన్నారు. ఓ సూపర్ స్టార్ తనయుడు, ముఖ్యమంత్రి గారి అబ్బాయి అయినా బాలయ్య 'డిస్కో కింగ్' ఓపెనింగ్ కేవలం అభిమానుల సమక్షంలో జరిగింది. ఇక జూనియర్ యన్టీఆర్ తెరంగేట్రం కూడా సాదాసీదాగానే సాగింది. అయితే ఒకే రోజున తొమ్మిది సినిమాల ఓపెనింగ్స్ తో రికార్డ్ సృష్టిస్తూ కెమెరా ముందుకు వచ్చారు తారకరత్న. కళ్యాణ్ రామ్ కూడా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చారు. వీరందరినీ పరిశీలిస్తే నందమూరి కుటుంబం నుండి హీరోలుగా ఎంట్రీ ఇచ్చేవారికి హంగామా పనిచేయదు అని తేటతెల్లమవుతోంది. అందువల్లే మోక్షజ్ఞ తెరంగేట్రం ఈ సారి సాదాసీదాగానే ప్లాన్ చేశారట.
మోక్షజ్ఞ హీరోగా రూపొందే సినిమా డిసెంబర్ 2న షూటింగ్ ఆరంభిస్తుంది. రెండు షెడ్యూల్స్ అయిన తరువాత మోక్షజ్ఞ స్టిల్స్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అప్పుడే వీలయితే మీడియా ముందుకు కూడా మోక్షును తీసుకు వస్తారని సమాచారం. కాబట్టి మోక్షు మూవీ ఏ హంగామా లేకుండా సింపుల్ గా మొదలవుతుంది. తరువాతే ప్రచారం సాగుతుందని టాక్. మోక్షు తొలి సినిమాపై ఇంకా ఎన్ని విశేషాలు వెలుగులోకి వస్తాయో చూద్దాం.