Mokshagna: 'మోక్షజ్ఞ'.. ఇక అలా అయితేనే బెట‌ర్‌

ABN , Publish Date - Jan 24 , 2026 | 05:34 PM

బాలకృష్ణకు (BalaKrishna) తొలుత వరుసగా ఇద్దరమ్మాయిలు పుట్టగానే ఆయన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు... తమ హీరోకు నటవారసుడు లేడని వాపోయారు.

బాలకృష్ణకు (BalaKrishna) తొలుత వరుసగా ఇద్దరమ్మాయిలు పుట్టగానే ఆయన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు... తమ హీరోకు నటవారసుడు లేడని వాపోయారు. కొందరు బాలయ్యకు తప్పకుండా ఒక వారసుడు పుట్టాలని పూజలూ చేశారు. మొత్తానికి బాలయ్యకు 1994 సెప్టెంబర్ 6న పుత్రోదయం కలిగింది. ఆ బాబుకు నటరత్న యన్టీఆర్ స్వయంగా 'మోక్షజ్ఞ తారకరామ తేజ' అన్న పేరు పెట్టారు. తరువాత ఆ పేరు 'మోక్షజ్ఞ తేజ'గా, సన్నిహితులకు 'మోక్షజ్ఞ'గా (Mokshagna) మరింత దగ్గరివారికి 'మోక్షు'గా మారింది... మోక్షును తెరపై చూడాలని అభిమానులు రెండు దశాబ్దాలుగా ఆశిస్తున్నారు. అదుగో ఇదుగో అంటూ కాలం గడచిపోయింది... చివరకు గత సంవత్సరం మోక్షు హీరోగా 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా కూడా ఉందని ప్రకటించారు. తీరా షూటింగ్ మొదలవుతుందనగా ఆగిపోయింది. కారణాలు తెలియరాలేదు కానీ, ఇప్పటికీ తమ అభిమాన హీరో వారసుడు వస్తాడనే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు...


Mokshagna.jpg

ముందు నాన్నతో కలసి...

మోక్షజ్ఞ ఏ సినిమాతో ముందుగా ప్రేక్షకులను పలకరిస్తాడో అన్న ఆసక్తి ఈ నాటికీ అభిమానుల్లో ఉంది. ఆ మధ్య బాలకృష్ణ తాను నటించబోయే 'ఆదిత్య 999' మూవీలో మోక్షజ్ఞ కూడా నటిస్తాడని తెలిపారు. అప్పటి నుంచీ మళ్ళీ బాలయ్య ఫ్యాన్స్ మోక్షు తెరంగేట్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముందుగా బాలయ్య నటించే సినిమాల్లోనే మోక్షజ్ఞ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తారని వినిపిస్తోంది. ఆ తరువాతే మోక్షు సోలో హీరోగా ఎంట్రీ ఇస్తాడని టాక్.


నాన్న చూపిన బాట...


ఒకప్పుడు నటరత్న యన్టీఆర్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాకే బాలయ్య తరువాత సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అదే రీతిన బాలయ్య రాబోయే కొన్ని చిత్రాల్లో మోక్షు కనిపిస్తాడని అంటున్నారు. ఆ ముచ్చటేదో ఈ 2026లోనే జరగాలనీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇప్పటి దాకా ఓ నటవారసుని కోసం ఇంతలా ఫ్యాన్స్ ఎదురుచూడడం అన్నది మోక్షజ్ఞ విషయంలోనే జరుగుతోంది. మరి ఈ యేడాదయినా అభిమానుల కళ్ళలో ఆనందం నింపుతూ మోక్షు తెరంగేట్రం చేస్తాడేమో చూడాలి...

Updated Date - Jan 24 , 2026 | 10:01 PM