నటుడిగా సుధాకర్ తనయుడు బన్నీ ఎంట్రీ.. చిరు ఇచ్చిన సలహా ఇదే
ABN, Publish Date - Nov 29 , 2026 | 06:02 PM
ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కలిసిన కమెడియన్ సుధాకర్ తనయుడు మైఖేల్ బన్నీ, తన తాజా ఇంటర్వ్యూలో ఆయనతో తనకున్న అనుబంధాన్ని, అలాగే తండ్రి సుధాకర్ ఆరోగ్య పరిస్థితిని పంచుకున్నారు.
సీనియర్ కమెడియన్, నటుడు సుధాకర్ (Sudhakar) తనయుడు మైఖేల్ బన్నీ (Michael Bunny) హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. తాజాగా తన కొత్త సినిమా ట్రైలర్ లాంచ్ కోసం చిత్ర బృందంతో కలిసి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)ని కలిసిన మైఖేల్ బన్నీ, ఓ ఇంటర్వ్యూలో చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని, తండ్రి సుధాకర్ ఆరోగ్య పరిస్థితిని పంచుకున్నారు.
తండ్రి సుధాకర్ ఆరోగ్యం ఎలా ఉందంటే..
ప్రస్తుతం తన తండ్రి సుధాకర్ ఆరోగ్యం బాగానే ఉందని మైఖేల్ బన్నీ తెలిపారు. ఆయన పెద్దగా బయటకు రావడం లేదని, ఇంట్లో తన పనులు తాను చేసుకుంటున్నారని చెప్పారు. అయితే ఆయనకు తోడుగా ఇంట్లో ఎవరో ఒకరు కచ్చితంగా ఉండాలని, సర్వెంట్లు ఉంటానన్నా ఒప్పుకోరని.. అందుకే తాను కానీ, అమ్మ కానీ, తన భార్య కానీ ఎల్లప్పుడూ ఆయన వెంటే ఉంటామని బన్నీ వివరించారు.
‘కాకా’ షూట్ బిజీలోనూ గంటసేపు మాతో గడిపారు
తన సినిమా ట్రైలర్ లాంచ్ కోసం దర్శకుడు, ప్రసాద్ బాబు, నరసింహరాజు తదితరులతో కలిసి ‘కాకా’ షూటింగ్ లొకేషన్‌లో చిరంజీవిని కలిశామని మైఖేల్ బన్నీ గుర్తుచేసుకున్నారు. షూటింగ్ బిజీలో ఉండటంతో పది నిమిషాలు మాత్రమే సమయం ఇస్తారేమో అనుకున్నామని, కానీ చిరంజీవి అంకుల్ తమతో దాదాపు గంటసేపు ఆత్మీయంగా మాట్లాడారని తెలిపారు. ‘‘నీ క్యారెక్టర్‌తో నువ్వు శాటిస్ ఫై అయ్యావా?’’ అని తనను, దర్శకుడిని రెండుసార్లు అడిగి మరీ ప్రోత్సహించారని చెప్పారు. తన తండ్రి సుధాకర్‌తో పాటు ప్రసాద్ బాబు, హరిప్రసాద్, నారాయణరావు గారిని నిర్మాతలుగా మార్చి.. సినిమా చేసిన రోజుల నుంచి ఆ బ్యాచ్ అంటే ఆయనకు ఎంతో ఇష్టమని బన్నీ పేర్కొన్నారు.
చిన్నప్పుడు బాస్కెట్ బాల్ ఇచ్చారు
చిరంజీవితో తన చిన్ననాటి జ్ఞాపకాన్ని పంచుకుంటూ.. ‘‘చిన్నప్పటి నుంచి చిరంజీవి అంకుల్‌తో నాకు మంచి బాండింగ్ ఉంది. ఆయన్ను ఎప్పుడూ అంకుల్ అనే పిలుస్తుంటాను. నేను సెకండ్ లేదా థర్డ్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒకసారి ఆయన ఇంటికి వెళ్లాను. అప్పుడు నన్ను ఎత్తుకుని, ఎందుకో తెలియదు కానీ నాకు ఒక బాస్కెట్ బాల్ ఇచ్చారు. మొన్నటి వరకు చాలా ఏళ్ల పాటు ఆ బాస్కెట్ బాల్ మా ఇంట్లోనే భద్రంగా ఉంది’’ అని ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
అలాగే, రెండు మూడేళ్ల క్రితం తండ్రి సుధాకర్‌తో కలిసి చిరంజీవిని కలిసినప్పుడు, తాను యాక్టింగ్‌లోకి ఎంటర్ అవుతున్నానని చెబితే ఆయన విలువైన సలహాలు ఇచ్చారని మైఖేల్ బన్నీ తెలిపారు. ‘‘ముందుగా ఏదైనా యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి నటన నేర్చుకో. అలాగే సినిమాలు బాగా చూడు.. కేవలం నా సినిమాలే కాదు, మీ డాడీ సినిమాలు కూడా అన్నీ చూడు. మేము అప్పట్లో ఎలాంటి పాత్రలు చేశాం, నటన ఎలా ఉండేదనేది స్టడీ చెయ్.. ఆ తర్వాత మళ్లీ కలుద్దాం’’ అని చిరంజీవి దిశానిర్దేశం చేశారని బన్నీ వివరించారు.
ఇవి కూడా చదవండి:
‘అలియాస్ రుక్మిణీ’లో నితిన్‌ని చూసి నేనే ఆశ్చర్యపోయా: నాని
సమంత, త్రిష, స్నేహ, మృణాళినిలకు అతడి చీర కట్టు.. అదుర్స్
నాని కోసం గొడుగు పట్టిన నితిన్.. 20 ఏళ్ల నాటి ఆసక్తికర ఘటన