Sudhakar: ఎన్ కౌంటర్ కు గురైంది నటుడు కాకరాల అల్లుడని తెలుసా!?
ABN , Publish Date - Jun 09 , 2025 | 10:54 AM
సీనియర్ నటుడు కాకరాల కుమార్తెలిద్దరూ ఉద్యమం బాట పట్టారు. తాజాగా పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయిన సుధాకర్ కాకరాలకు అల్లుడే!
ఇటీవల బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన నర్సింహాచలం అలియాస్ సుధాకర్ (Sudhakar) కు సినిమా రంగంతోనూ పరోక్ష సంబంధం ఉంది. ప్రముఖ ఫిల్మ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, రంగస్థల నటుడిగా నంది అవార్డును అందుకున్న కాకరాల (Kakarala) అల్లుడే సుధాకర్! చిన్న వయసులోని కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో ఆ పార్టీకి సానుభూతి పరుడిగా ఉన్నారు కాకరాల. ప్రజానాట్య మండలి నిర్వాహకుల్లో ఒకరైన 'పుట్టిల్లు' (Puttillu) దర్శకుడు గరికపాటి రాజారావు శిష్యరికంలో కాకరాల అనేక నాటకాల్లో నటించారు. అలానే సినిమా నటుడిగా దాదాపు రెండు వందల చిత్రాలు చేశారు. 'సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి'తో కెరీర్ ప్రారంభించి, 'ముత్యాల ముగ్గు (Mutyala Muggu), తూర్పు వెళ్ళే రైలు, మా భూమి (Maa Bhoomi), కొత్తనీరు' తదితర చిత్రాలలో నటించారు. బుల్లితెరపైనా పలు సీరియల్స్ లో యాక్ట్ చేశారు.
కొన్నేళ్ళుగా వయసు రీత్యా నటనకు దూరంగా ఉన్న కాకరాల, సూర్యకాంతం దంపతులకు ఇద్దరు కుమార్తెలు. తండ్రి భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న కుమార్తెలు ఇద్దరూ యుక్త వయసులోనే అండర్ గ్రౌండ్ కు వెళ్ళిపోయారు. ఇటీవల కన్నుమూసిన మావోయిస్ట్ సుధాకర్... కాకరాల కుమార్తెను ఉద్యమంలో ఉన్న సమయంలోనే వివాహం చేసుకున్నారు. కాకరాల భార్య నాలుగేళ్ళ క్రితం వృద్ధాప్యపు సమస్యలతో కన్నుమూయగా, ఇప్పుడు 88 సంవత్సరాల వయసులో కాకరాల ఎన్ కౌంటర్ రూపంలో అల్లుడిని కోల్పోయారు. కొన్నేళ్ళ క్రితం చెన్నయ్ నుండి హైదరాబాద్ కు వచ్చిన కాకరాల కొంత కాలం వనస్థలిపురంలో ఉన్నారు. ఆ తర్వాత సి. ఆర్. ఫౌండేషన్ వయోధిక ఆశ్రమానికి మారారు. అక్కడే ఆయన శేషజీవితాన్ని గడుపుతున్నారు.
Also Read: Karthi: సర్దార్ 2 షూటింగ్ పూర్తి!
Also Read: LakshmanTekumudi: లక్ష్మణ్ టేకుముడి హీరోగా.. సినిమా స్టార్ట్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి