Kaaka: సంక్రాంతికి మరోసారి ఆటో జానీగా చిరంజీవి..

ABN , Publish Date - Nov 29 , 2026 | 12:16 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బాబీ దర్శకత్వ చిత్రం ‘కాకా’ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. మరోసారి ఆటో జానీ తరహా మాస్ అవతారంలో చిరు కనిపించనున్నారనే ఆసక్తి నెలకొంది.

మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) అభిమానులకు ఈ సంక్రాంతికి పాత జ్ఞాపకాలు మరోసారి గుర్తుకురానున్నాయి. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘కాకా’ (KAAKA) సినిమాలో చిరంజీవి సరికొత్త అవతారంలో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఆయన ‘కదిరి కాళిదాస్‌’గా కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం ‘‘ఆటో జానీ గుర్తున్నాడా? ఈ సంక్రాంతికి సరికొత్తగా #KAAKAలో మీ ముందుకు వస్తున్నాడు’’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దీంతో చిరంజీవి తన కెరీర్‌లో గుర్తుండిపోయిన ‘రౌడీ అల్లుడు’లోని ఆటో జానీ తరహా మాస్ లుక్‌లో మరోసారి సందడి చేయనున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

ఈ అప్‌డేట్‌పై మెగాస్టార్ చిరంజీవి కూడా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘ఆటో జానీ గుర్తున్నాడా? ఈ సంక్రాంతికి సరికొత్తగా ‘కాకా’లో మీ ముందుకు వస్తున్నాడు! ఈ సంక్రాంతికి ఆటో జానీగా సరికొత్త కోణంలో మీ అందరినీ అలరించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాను ఓ మరిచిపోలేని థియేట్రికల్ అనుభూతిగా మలిచేందుకు దర్శకుడు బాబీ, చిత్రబృందం మొత్తం ఎంతో మనసుపెట్టి పనిచేస్తున్నారు. జనవరి 13, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో కలుద్దాం. సంక్రాంతికి కలుద్దాం’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్, అనస్వర రాజన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రియమణి, నివేదా థామస్, సునీల్, మురళీ శర్మ, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ALSO READ:
Nithya Menen: యంత్రంలా ఆగకుండా పనిచేయలేను.. కృత్రిమంగా నటించలేను

Naga Chaitanya: ఆ సమయంలో అసలు నేనేం చేస్తున్నానో అర్థం కాలేదు..

‘బేబీ’ కథ వివాదం.. సాయి రాజేష్, SKNలకు హైకోర్టు నోటీసులు!



Updated Date - Nov 29 , 2026 | 12:39 PM