దేవి శ్రీ ప్రసాద్ 'ఎల్లమ్మ'.. జోడీగా లక్కీ హీరోయిన్?
ABN , Publish Date - May 28 , 2026 | 05:19 PM
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతుండటంతో ‘ఎల్లమ్మ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘బలగం’ (Balagam) వంటి సూపర్ హిట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి (venu yeldandi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’(Yellamma). రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (devi sri prasad) ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (dil raju) ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కథపై ఉన్న నమ్మకంతో ఎంత లేట్ అవుతున్నా సరే, పట్టు వదలకుండా వేణుని తన దగ్గరే అట్టిపెట్టుకుని ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. ఒకవేళ గతంలో ఈ కథకు నాని ఒప్పుకుని ఉంటే ఈపాటికి రిలీజైపోయి ‘దసరా’ను మించిన పేరు తెచ్చేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఈ పాత్ర దేవిశ్రీ ప్రసాద్‌ను వరించడంతో, కథాబలం రీత్యా ఆయనకు హీరోగా కూడా బ్లాక్ బస్టర్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల ‘ఎల్లమ్మ’కు సంబంధించి దేవి స్వంత ఊరి వీడియో ఒకటి బయటకు రావడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది.
ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత క్రేజీగా ఉండబోతుందో, హీరోయిన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉందని సమాచారం. కేవలం గ్లామర్ పాత్రగా కాకుండా, ఇంటెన్స్ యాక్షన్ డిమాండ్ చేసే ఎమోషనల్ రోల్ కావడంతో హీరోయిన్ ఎంపిక మేకర్స్‌కు పెద్ద టాస్క్‌గా మారింది. డబ్బింగ్ తో మేనేజ్ చేయడం కాకుండా స్వయంగా పర్ఫెక్ట్ ఎమోషన్స్ పలికించగల నటి కోసం అన్వేషణ సాగుతోంది. ఈ క్రమంలో గతంలో పలువురు ముద్దుగుమ్మల పేర్లు తెరపైకి వచ్చాయి. మహానటి కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని ప్రచారం జరగ్గా.. ఆ తర్వాత ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం ఈ ప్రెస్టెజీయస్ ప్రాజెక్ట్‌లో యంగ్ సెన్సేషన్ మమితా బైజు (Mamitha Baiju)పేరు వినిపిస్తోంది. ‘ప్రేమలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా దగ్గరైన ఈ యంగ్ బ్యూటీ.. వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతానికి మేకర్స్ ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే, డీఎస్‌పీ సరసన మమితా బైజు జోడీ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోవడంతో, ప్రస్తుతానికి ‘ఎల్లమ్మ’ పాత్రను ఎవరు పోషిస్తున్నారనేది సస్పెన్స్‌లోనే ఉంది.
మమితా బైజు కేవలం యూత్‌ఫుల్, లవ్ స్టోరీలకే పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో మెప్పిస్తోంది. ‘ప్రేమలు’ (Premalu) బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆమె కేవలం కమర్షియల్, గ్లామరస్ పాత్రలకే మొగ్గు చూపలేదు. ఇటీవల ధనుష్ కర సినిమాలో ఒక పల్లెటూరి యువతిగా చాలా సీరియస్ రోల్ చేసి ప్రశంసలు అందుకుంది. అలాగే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే చిత్రంలో నలభై ఏళ్ళ వయసున్న వ్యక్తిని ప్రేమించే టీనేజర్‌గా నటించి రిస్క్ తీసుకుంది. నటిగా ఆమె చూపిస్తున్న ఈ వేరియేషన్స్ కారణంగానే, ‘ఎల్లమ్మ’లోని పవర్‌ఫుల్ పాత్రకు మమితా బైజు ఒక అద్భుతమైన ఛాయిస్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి చివరికి ‘ఎల్లమ్మ’లో హీరోయిన్‌గా ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి!