వీడు మాములోడు కాదు.. మర్డర్ కేసులో నిందితుడు! పేర్లు మార్చి.. స్టార్లతో 12 ఏళ్లుగా సినిమాలు
ABN , Publish Date - May 28 , 2026 | 02:44 PM
స్పందన్ మోదీ.. స్పందన్ వ్యాస్.. స్పందన్ కుమార్.. స్పందన్ జోషి.. హేమంగ్ మోదీ. హేమంగ్ వ్యాస్, హేమంగ్ వైష్ణవ్.. ఇవన్నీ వేర్వేరు వ్యక్తుల పేర్లు అను కుంటున్నారేమో.. కానే కాదు. అన్ని పేర్లు ఒక్క డివే.
స్పందన్ మోదీ.. స్పందన్ వ్యాస్.. స్పందన్ కుమార్.. స్పందన్ జోషి.. హేమంగ్ మోదీ. హేమంగ్ వ్యాస్, హేమంగ్ వైష్ణవ్.. ఇవన్నీ వేర్వేరు వ్యక్తుల పేర్లు అను కుంటున్నారేమో.. కానే కాదు. అన్ని పేర్లు ఒక్క డివే. ఓ మర్డర్ కేసులో నిందితుడు పెరోల్ మీద బయటకు వచ్చి ఇలా పేర్లను మార్చుకుంటూ, వేషాలను మార్చుకుంటూ 12ఏళ్ల పాటు తప్పించుకుని తిరిగాడు. తప్పించుకొని తిరగడం అంటే ఎక్కడో ఎవరికీ కనపడకుండా దాక్కున్నాడనుకుంటున్నారేమో.. అది కూడా కాదు. రోజూ టీవీ సీరియళ్లలో కనిపించేవాడు. వెబ్ సిరీస్‌ల్లోనూ నటించాడు. అంతెందుకు ఆమీర్ ఖాన్ నటించిన థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ లాంటి భారీ సినిమాల్లో కూడా ఉన్నాడు ఈ పారిపోయిన ఖైదీ.
అమితాబ్ బచ్చన్, రణ్ వీర్ సింగ్ నటించిన సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్డిస్టుగా చేశాడు. అయినా పోలీసులు గుర్తించలేకపోయారు. ఈ ఘరానా మోసగాడి అసలు పేరు హేమంత్ నంగిన్దాస్ మోదీ (Hemant Nagindas Modi). స్వస్థలం అహ్మదాబాద్. అతనికి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉంది. 1998-2001 సమయంలో తన కాలేజీ రోజుల్లో స్పందన్ మోదీగా పేరు మార్చుకొని నాటకాలు వేసేవాడు. అయితే, తర్వాత కాలంలో నాటకాల్లో సంపాదన అంతగా లేకపోవడంతో లా చదివి లాయర్ అయ్యాడు. 2005లో నరోదాలో జరిగిన ఓ హత్య కేసులో హేమంత్ నిందితుడు. 2008 లో కోర్టు అతన్ని దోషిగా ప్రకటిస్తూ జీవిత ఖైదు విధించింది. 2014 జూలైలో 30రోజుల పెరోల్ మీద బయటకు వచ్చాడు. కానీ, మళ్లీ పోలీసుల ఎదుట లొంగిపోలేదు.

తనకు తెలిసిన నాటకాల కంపెనీల్లో చేరాడు. అక్కడి నుంచి ముంబైకి వెళ్లి సినిమాల్లో నటించాడు. ఈ క్రమంలో అతడు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల కులం, వారి ఆలోచనా విధానాలకు అనుగుణంగా పేర్లను మార్చి చెప్పుకునేవాడు. అలా సినిమాల్లో అవకాశాలు సంపాదిస్తూ క్రమంగా ఎదిగాడు. ప్రస్తుతం హేమంత్ వయస్సు 53 ఏళ్లు. పారిపోయిన 12 ఏళ్ల తర్వాత ఎవరూ గుర్తు పట్టరనుకున్నాడో.. ఏమో గానీ ఇటీవల అహ్మదాబాద్ వచ్చాడు. కానీ, అహ్మదాబాద్ లో అతన్ని చూసి గుర్తించిన ఎవరో పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు హేమంత్ను వెంటనే అరెస్టు చేశారు. కాగా, హేమంత్ తప్పించుకున్న తర్వాత కొన్ని నెలల పాటు ఫోన్ వాడకపోవడం, కుటుంబంతో సంబంధం లేకుండా ఉండటం వల అతన్ని పట్టుకోలేక పోయామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తంగా అతడు 12పేర్లను మార్చుకున్నట్లు వెల్లడించారు.