హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన వారణాసి.. ఐమాక్స్ ఛానల్లో నంబర్ వన్‌గా మహేష్ మూవీ!
ABN, Publish Date - Oct 15 , 2026 | 08:14 PM
రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి గ్లింప్స్ ఐమాక్స్ యూట్యూబ్ ఛానల్లో నంబర్ వన్ స్థానంలో నిలిచింది.
వరల్డ్ సినిమా హిస్టరీలో ఇండియన్ సినిమా మార్కెట్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన దర్శకుడు ఒకరు.. ఇక బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడంలో తిరుగులేని సూపర్ స్టార్ మరొకరు. ఈ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే మైండ్ బ్లాంక్ అవుతుంది కదూ. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ( SS Rajamouli,), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో వస్తున్న 'వారణాసి' (Varanasi) ప్రాజెక్ట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తోంది. స్క్రీన్‌పై ఇదివరకెన్నడూ చూడని విజువల్ వండర్‌గా రాజమౌళి ఈ చిత్రాన్ని చెక్కుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి లీకయ్యే చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాను ఊపేస్తోంది.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టాక్ చూస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ, ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఫ్రేమ్‌ను, ప్రతి సౌండ్‌ను పర్ఫెక్ట్గా తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో, పూర్తి ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందుతున్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది.
సినిమా రిలీజ్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, గ్లోబల్ లెవల్లో ఈ చిత్రానికి దక్కుతున్న ఆదరణ చూసి హాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. దాదాపు ఏడాది క్రితం వచ్చిన గ్లింప్స్ వీడియో ఇప్పటికీ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను షేక్ చేస్తూనే ఉంది. విశేషమేమిటంటే.. కేవలం మన ఇండియన్ యూట్యూబ్ ఛానల్స్‌లోనే కాదు, ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ దిగ్గజాలైన ఐమాక్స్, డాల్బీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్స్‌లోనూ ఈ గ్లింప్స్ అరుదైన రికార్డులను తిరగరాస్తోంది.
ఇక్కడ ఒక సెన్సేషనల్ రికార్డు గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. వరల్డ్ టాప్ స్క్రీనింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన 'ఐమాక్స్' అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో 'వారణాసి' గ్లింప్స్ కోటి 8 లక్షలకు పైగా వ్యూస్ సాధించి, ఆ ఛానల్ చరిత్రలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. హాలీవుడ్ విజువల్ వండర్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ లాంటి గ్లోబల్ ప్రాజెక్ట్‌లు, ప్రభాస్ 'సాహో' లాంటి భారీ చిత్రాల ట్రైలర్లు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయంటే, రాజమౌళి-మహేష్ కాంబో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఆడియో టెక్నాలజీ కింగ్ 'డాల్బీ' యూట్యూబ్ ఛానల్లో కూడా ఇదే విధమైన జోరు కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆ ఛానల్లో రిలీజైన సినిమా ట్రైలర్స్ లో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ముందు ప్లేస్ లో ఉంటే, ఆ తరువాత ప్లేస్ లో వారణాసి 73 లక్షలకు పైగా వ్యూస్‌ను రాబట్టి సరికొత్త మైలురాయిని అందుకుంది. దీన్నిబట్టి మన తెలుగు సినిమా సత్తా, 'వారణాసి'పై హాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్యూరియాసిటీ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో స్పష్టమవుతోంది. 'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో గ్లోబల్ ఆడియన్స్‌ను కట్టిపడేసిన జక్కన్న.. ఈసారి సూపర్ స్టార్‌తో కలిసి ఏ రేంజ్ మాయాజాలం సృష్టించబోతున్నారో చూడాలి. రిలీజ్‌కు ముందే ఒక చిన్న గ్లింప్స్‌తో గ్లోబల్ ప్లాట్ఫారమ్స్ను శాసిస్తున్న ఈ మూవీ, థియేటర్లలోకి అడుగుపెట్టాక ఇంకెన్ని వరల్డ్ రికార్డులను కొల్లగొడుతుందో వేచి చూడాల్సిందే.