వచ్చే సంక్రాంతికి ప్రశాంత్ వర్మ 'మహాకాళి'
ABN, Publish Date - Aug 15 , 2026 | 04:33 PM
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో రూపుదిద్దుకుంటున్న 'మహాకాళి' చిత్రాన్ని వచ్చే జనవరి 8న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రోల్‌ను భూమి శెట్టి పోషిస్తున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'మహాకాళి'. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ మైథాలజికల్ ఎపిక్‌కు ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా మేకర్స్ 'మహాకాళి'ని రూపొందిస్తున్నారు. మహాకాళిగా భూమిశెట్టి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది సంక్రాంతి బరిలో దిగబోతోంది. జనవరి 8న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
విశేషం ఏమంటే... ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొదటి సినిమా 'హను-మాన్' కూడా 2024లో సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సంవత్సరం సంక్రాంతికే 'హనుమాన్' రెండో భాగాన్ని విడుదల చేయాలని ప్రశాంత్ వర్మ భావించారు. కానీ అనివార్య కారణాలతో ఆ సినిమా అనుకున్న విధంగా సెట్స్ పైకి వెళ్ళలేదు, అలానే ఇంకా షూటింగ్ దశలోనే ఉండిపోయింది. ఆ లోటును తీర్చుతూ ఇప్పుడీ 'మహాకాళి' వచ్చే యేడాది సంక్రాంతి సీజన్‌లో రానుంది. ఈ చిత్రంలో రోహిత్ సరాఫ్ ముఖ్యపాత్రను పోషిస్తుండగా, అక్షయ్ ఖన్నా శుక్రాచార్యగా నటిస్తున్నారు. ఆధ్యాత్మిక వైభవాన్ని అత్యాధునిక సినీ సాంకేతికతతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మైథాలజికల్ చిత్రాల్లో ఒకటిగా 'మహాకాళి' రూపుదిద్దుకుంటోందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Sunday TV Movies: ఆదివారం.. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే
నా మాటలను వక్రీకరించారు: ట్రోలింగ్‌పై అనసూయ సంచలన పోస్ట్
‘జార్జ్ క్రిష్’.. శ్రీను వైట్లకు శర్వానంద్ అయినా హిట్ ఇస్తాడా