‘జార్జ్ క్రిష్’.. శ్రీను వైట్లకు శర్వానంద్ అయినా హిట్ ఇస్తాడా
ABN , Publish Date - Aug 14 , 2026 | 08:07 PM
దర్శకుడు శ్రీను వైట్ల.. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది నాన్‌స్టాప్ కామెడీ, అదిరిపోయే కమర్షియల్ ఎంటర్‌టైనర్లు. తెలుగు సినిమాలో కామెడీ టైమింగ్‌కి సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుల్లో ఆయన స్థానం ప్రత్యేకం.
దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla).. ఈ పేరు వినగానే టాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తొచ్చేది నాన్‌స్టాప్ కామెడీ, అదిరిపోయే కమర్షియల్ ఎంటర్‌టైనర్లు. తెలుగు సినిమాలో కామెడీ టైమింగ్‌కి సరికొత్త నిర్వచనం చెప్పిన దర్శకుల్లో ఆయన స్థానం ప్రత్యేకం. వేగవంతమైన స్క్రీన్‌ప్లే, ఊహించని ట్విస్టులు, పొట్టచెక్కలయ్యే కామెడీ ట్రాక్స్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించిన ఘనత ఆయన సొంతం. ‘ఆనందం’తో మొదలైన ఆయన విజయ ప్రస్థానం.. ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్‌షా’ లాంటి సినిమాలతో సాగింది. ఒకప్పుడు ఆయన సినిమా వస్తోందంటే చాలు.. థియేటర్లలో నవ్వుల పండగే అని సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయేవారు. ముఖ్యంగా స్టార్ హీరోలతో చేసిన సరికొత్త ప్రయోగాలు, బ్రహ్మానందం లాంటి హాస్య నటులకు రాసిన విలక్షణ పాత్రలు వెండితెరపై నవ్వుల పూలు పూయించాయి. తెలుగు కమర్షియల్ సినిమాకు ఒక సరికొత్త ఫార్ములాను సెట్ చేసిన ఘనత ఆయనది.
అయితే కాలక్రమంలో ఒకే తరహా ఫార్ములా రొటీన్ అవ్వడం, కథల్లో కొత్తదనం తగ్గడంతో ఆయనకు కొన్ని వరుస పరాజయాలు ఎదురయ్యాయి. అయినా సరే.. తన మార్క్ వినోదంతో పాటు నేటి ట్రెండ్‌కు తగ్గ కథనంతో బాక్సాఫీస్ వద్ద ఎలాగైనా అదిరిపోయే రీ-ఎంట్రీ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు శ్రీను వైట్ల. సరైన కథ కుదిరితే ఆయన కలం, కెమెరా ఎంతటి మ్యాజిక్ చేస్తాయో ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు చూశారు. ఈ క్రమంలోనే టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand)తో సరికొత్త సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ చిత్రం అత్యంత గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత అనిల్ సుంకర అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు మేకర్స్ ప్రకటించడంతోనే సినీ వర్గాల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇటీవల కాలంలో వరుసగా విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న శర్వానంద్.. ఈ ప్రాజెక్ట్‌తో మరో సరికొత్త జోనర్‌లో మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. శర్వానంద్‌కు ఉన్న క్లాస్, మాస్ ఇమేజ్‌కి శ్రీను వైట్ల మార్క్ పక్కా కామెడీ, వన్‌లైనర్ పంచ్‌లు తోడైతే థియేటర్లలో వినోదం నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ‘నారీ నారీ నడుమ మురారి’, ‘బైకర్’ వంటి చిత్రాలతో జోరుమీదున్న శర్వానంద్.. త్వరలోనే ‘భోగి’ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘జార్జ్ క్రిష్’ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలో నిలపాలని చిత్ర బృందం ప్రణాళికలు రచిస్తోంది. సినిమాలోని హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి. ఈ సినిమాతో దర్శకుడు శ్రీను వైట్ల తన పాత వైభవాన్ని అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తారా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి:
మహేష్ బాబు కాదా.. బుచ్చిబాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌తోనా?
డీపీ మార్చిన రెబల్ స్టార్.. ఇక అంతా ‘ఫౌజీ’ గురించే!
పోతురాజు ఆహార్యంలో శ్రీహరి తనయుడు.. పోస్టర్ అదిరింది!