ఏపీ ఫిలిం ఛాంబర్‌లో M4M హవా.. జో శర్మ, మోహన్ వడ్లపట్లకు అవార్డులు
ABN, Publish Date - Oct 11 , 2026 | 01:33 PM
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కి, విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకాదరణ పొందిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘M4M’ (మోటివ్ ఫర్ మర్డర్). జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు పురస్కారాలు దక్కించుకున్న ఈ చిత్రం ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది.
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కి, విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకాదరణ పొందిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘M4M’ (మోటివ్ ఫర్ మర్డర్). జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే పలు పురస్కారాలు దక్కించుకున్న ఈ చిత్రం ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన అవార్డుల (Andhra Pradesh Film Chamber Awards) ప్రదానోత్సవంలో ‘M4M’ చిత్రానికి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మోహన్ వడ్లపట్ల (Mohan Vadlapatla) ‘ఉత్తమ డెబ్యూ డైరెక్టర్’ అవార్డును అందుకోగా, నాయికగా అద్భుత నటన కనబరిచిన జో శర్మ (Jo Sharma) ‘ఉత్తమ డెబ్యూ హీరోయిన్’ పురస్కారాన్ని దక్కించుకున్నారు.
‘M4M’ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సైతం భారతదేశ ఖ్యాతిని చాటిచెప్పింది. 2025 ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్లోబల్ ప్రీమియర్ ప్రదర్శితమై, 25 దేశాల ప్రతినిధుల నుంచి స్టాండింగ్ ఒవేషన్ అందుకుంది. ఈ వేడుకలో జో శర్మ రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అంతేకాకుండా, గోవా ఐఎఫ్ఎఫ్ఐ (IFFI) ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘వేవ్స్’ (WAVES 2025) సదస్సులో అమెరికన్ డెలిగేట్‌గా ఆమె పాల్గొన్నారు. ఇప్పటివరకు న్యూయార్క్ మూవీ అవార్డ్స్, హాలీవుడ్ మూవీ అవార్డ్స్, శాంటా మోనికా ఫిల్మ్ అవార్డ్స్ వంటి అంతర్జాతీయ వేదికలతో సహా ఏకంగా 16 అంతర్జాతీయ అవార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. వీటిలో జో శర్మ నాలుగు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు సాధించడం విశేషం.
ఘనంగా ఏపీ ఫిలిం ఛాంబర్ దశాబ్ది ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 10 ఏళ్ల వేడుకల సందర్భంగా సినీ పరిశ్రమకు విశేష సేవలందించిన వారిని, ప్రతిభ కనబరిచిన చిత్ర బృందాలను ఘనంగా సత్కరించారు. ‘కమిటీ కుర్రోళ్ళు’, ‘35 చిన్న కథ కాదు’ వంటి జాతీయ గుర్తింపు పొందిన చిత్రాలతో పాటు ‘M4M’ బృందానికి, ‘కర్మాఖ్య’ డైరెక్టర్ అధిరే అభి, ‘23’ హీరో తేజ రాయపాటి, ‘కోర్ట్’ ఫేమ్ శుభోదయం సుబ్బారావు తదితరులకు ప్రత్యేక గుర్తింపునిచ్చారు. మిమిక్రీ రమేష్ ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
ఈ కార్యక్రమంలో ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు అందుకున్న సీనియర్ నటులు మాగంటి మురళీ మోహన్ మాట్లాడుతూ.. ‘M4M’ చిత్ర వైవిధ్యమైన కథనం, మేకింగ్‌ను ప్రత్యేకంగా కొనియాడారు. తొలి చిత్రమే అయినప్పటికీ, నిర్మాతగా తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని జోడించి మోహన్ వడ్లపట్ల సినిమాను ఆసక్తికరంగా మలిచారని అభినందించారు. అలాగే పరిణతితో కూడిన నటనను కనబరిచిన హీరోయిన్ జో శర్మకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. ‘‘మా 'M4M' చిత్రానికి దక్కిన ఆదరణ, ఈ గౌరవం ఎంతో సంతోషాన్నిచ్చాయి. ఒక కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకులు ఇంతలా ఆదరించడం మా బృందానికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. త్వరలోనే మరింత భారీ హంగులతో ‘M4M పార్ట్-2’ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని వెల్లడించారు. ఈ పురస్కారాన్ని అందుకోవడం కోసం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. ‘‘ఏపీ ఫిలిం ఛాంబర్ దశాబ్ది ఉత్సవాల వేళ, నన్ను తీర్చిదిద్దిన గురువు మోహన్ వడ్లపట్లతో కలిసి ఈ అవార్డు అందుకోవడం జీవితంలో మర్చిపోలేను. ఈ పురస్కారం నాకు సాక్షాత్తూ ‘నంది అవార్డు’తో సమానం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందడానికి నా వంతు తోడ్పాటును ఎల్లప్పుడూ అందిస్తాను’’ అని ఉద్వేగంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ నటులు మురళీ మోహన్, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సీనియర్ నిర్మాత ఏ.ఎం. రత్నం, నటీమణులు లయ, కొణిదెల నిహారిక, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, సీనియర్ దర్శకులు రేలంగి నరసింహారావు, అధిరే అభి, ఏపీ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు మధు మోహన్ కృష్ణ, సెక్రటరీ మోహన్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ పాకాలపాటి వెంకట సుబ్రమణ్య వర్మ తదితరులు పాల్గొని విజేతలకు అవార్డులను అందజేశారు.
ఇవి కూడా చదవండి:
ప్రసవం తర్వాత లుక్స్‌పై కామెంట్స్.. కత్రినా ఇచ్చిపడేసింది
తెలుగు వారిని పట్టించుకోని రజనీ.. రేట్లు పెంచడం అవసరమా?
దసరా టు డిసెంబర్.. బాక్సాఫీస్ బరిలో పొరుగు సినిమాలు