దసరా టు డిసెంబర్.. బాక్సాఫీస్ బరిలో పొరుగు సినిమాలు

ABN , Publish Date - Oct 10 , 2026 | 07:16 PM

సంక్రాంతి, సమ్మర్ సీజన్లు దాటుకుని ఇండస్ట్రీ ఇప్పుడు దసరాకు సిద్ధమవుతోంది. ఆ వెంటనే దీపావళి, ఆ తర్వాత ఇయర్ ఎండింగ్ మంత్ డిసెంబర్. ఈ మూడు నెలల్లో ప్రూవ్ చేసుకోవడానికి మన తెలుగు చిత్రాలతో పాటు పోటీ పడుతూ ముస్తాబవుతున్నాయి పొరుగు సినిమాలు.

Other Industry films in Tollywood

సినిమా సీజన్లన్నీ ఒక్కొక్కటిగా అయిపోతున్నాయి. సంక్రాంతి, సమ్మర్ సీజన్లు దాటుకుని ఇండస్ట్రీ ఇప్పుడు దసరా (Dasara)కు సిద్ధమవుతోంది. ఆ వెంటనే దీపావళి (Diwali), ఆ తర్వాత ఇయర్ ఎండింగ్ మంత్ డిసెంబర్. ఈ మూడు నెలల్లో ప్రూవ్ చేసుకోవడానికి మన తెలుగు చిత్రాలతో పాటు పోటీ పడుతూ ముస్తాబవుతున్నాయి పొరుగు సినిమాలు. పరభాషా చిత్రాల్లో సౌత్ నుంచి బరిలో నిలుస్తున్న క్రేజీ ప్రాజెక్టులెన్ని? ఉత్తరాది నుంచి ఊరిస్తున్నవెన్ని?

దక్షిణాదిన నాలుగు ఇండస్ట్రీలున్నా.. పాన్ ఇండియా కల్చర్ పెరిగాక అన్నీ మన సినిమాలే అనిపిస్తున్నా, తమిళ టాప్ స్టార్ల చిత్రాలు బరిలోకి దిగుతున్నప్పుడు మన దగ్గర కూడా ఆ ఊపు స్పెషల్ గానే ఉంటుంది. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఈ దసరాకు థియేటర్లలోకి దూసుకొస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth). ముత్తువేల్ పాండ్యన్‌గా ‘జైలర్’ చిత్రంలో ఆయన జారీ చేసిన హుకుం అభిమానుల గుండెల్లో ఆనందాన్ని నింపింది. ఇప్పుడు రెండోసారి (Jailer 2) కూడా ఆ మేజిక్ రిపీట్ చేస్తారా? అనే ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లోనూ గట్టిగా కనిపిస్తోంది. ఈ నెల 15న విడుదల అవుతుంది. 16న విజయ్ ఆంటోనీ ‘నాన్నకుట్టి’ ప్రేక్షకులను పలకరించనుంది. ‘బిచ్చగాడు’ తర్వాత తన ప్రతి సినిమాను తెలుగు ప్రేక్షకులతో పంచుకుంటూనే ఉన్నారు విజయ్ ఆంటోని.


కంటిన్యూ చేస్తారా?

ఈ ఏడాది ఫుల్ సక్సెస్ మీదున్నారు హీరో సూర్య. ఆల్రెడీ ‘కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్’ భారీ విజయాలను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ‘సీన్’ మీద ఉంది. నవంబర్ 6న రిలీజ్ కానున్న ఈ సినిమా సూర్యకి మాత్రమే కాదు, నజ్రియాకు కూడా చాలా స్పెషల్. ఈ సంక్రాంతికి ‘మన శంకరవరప్రసాద్’తో హిట్ అందుకున్నారు లేడీ సూపర్‌స్టార్ నయనతార. ఆమె నటిస్తోన్న ‘మూకుత్తి అమ్మన్’ (అమ్మోరుతల్లి) సీక్వెల్ ‘మహాశక్తి’ కూడా నవంబర్ 6న దీపావళి రేసులోనే విడుదలవుతోంది. ఫస్ట్ పార్ట్ సూపర్ సక్సెస్ ఫేమ్‌ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ‘మహాశక్తి’ మీదుంది.

ఉత్తరాది చిత్రాలు!

ఎప్పుడూ డిసెంబర్ బరిలో ఏదో ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్ మన తలుపులు తడుతూనే ఉంటుంది. ఈ ఏడాది ఆ ఛాన్స్ నాదే అంటున్నారు షారుఖ్ ఖాన్. ఆయన నటించిన ‘కింగ్’ (King) క్రిస్మస్ రేసులో ఉంది. పండక్కి ఒకరోజు ముందే పలకరిస్తానంటున్నారు షారుఖ్. ఆయన తనయ సుహానా ఈ సినిమా కోసం ఇష్టంగా వెయిట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ మూడు వెయ్యి కోట్ల సినిమాలతో బాలీవుడ్ బాద్‌షా అనే హోదాను కాపాడుకున్న షారుఖ్ ఈసారి ‘కింగ్’తో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారోననే క్యూరియాసిటీ సర్వత్రా కనిపిస్తోంది. డిసెంబర్ షారుఖ్ కౌంట్‌లో ఉంది కాబట్టి, మేం దీపావళి సీజన్‌ను కబ్జా చేస్తున్నామని అంటోంది ‘రామాయణ’ టీమ్, రణబీర్ కపూర్, సాయిపల్లవి, యష్ నటిస్తున్న ‘రామాయణ’ (Ramayana) ఫస్ట్ పార్ట్ నవంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.


జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!

ప్రొడక్ట్ క్రియేట్ చేయడంలో ఉన్న ఆసక్తి పబ్లిసిటీలోనూ ఉండాలనే అంశాన్ని ఈ మధ్య సక్సెస్ అయిన సినిమాలు చెప్పకనే చెబుతున్నాయి. జనాల్లో మౌత్‌టాక్ స్ప్రెడ్ అయ్యేవరకు, ఎంత పెద్ద స్టార్లయినా గ్రౌండ్‌లో నిలుచుని మరీ ప్రమోషన్ చేసుకోవాల్సిందే. జస్ట్ అలా వచ్చామా? ఇలా పలకరించామా? అన్నట్టు కాకుండా పర్ఫెక్ట్ కంటెంట్‌తో తెలుగు ప్రజల మనసులు గెలుచుకుని, జేబులు కొల్లగొట్టే సినిమాలేంటో తెలియాలంటే ఏడాది ఆఖరు వరకు ఆగాల్సిందే మరి.

ఇవి కూడా చదవండి:

సీమ పౌరుషం తర్వాత ఉత్తరాంధ్ర కళకు జై కొట్టిన నారా లోకేష్..

ట్రోలర్‌కు అదిరిపోయే కౌంటరిచ్చిన ఆది సాయికుమార్.. పోస్ట్ వైరల్

‘కరికాల’ చిత్రంలో కేథరిన్ థ్రెసా.. ఫస్ట్ లుక్ విడుదల

Updated Date - Oct 10 , 2026 | 07:16 PM