తెలుగు వారిని పట్టించుకోని రజనీ.. రేట్లు పెంచడం అవసరమా?
ABN , Publish Date - Oct 10 , 2026 | 08:27 PM
రజనీకాంత్ సినిమా వస్తుందంటే చాలు.. ఫలితాలతో సంబంధం లేకుండా మొదటి రోజే వెండితెరపై తలైవాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు థియేటర్ల ముందు బారులు తీరుతుంటారు.
బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) మేనియా గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. ఫలితాలతో సంబంధం లేకుండా మొదటి రోజే వెండితెరపై తలైవాను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు థియేటర్ల ముందు బారులు తీరుతుంటారు. అయితే, గత కొన్నేళ్లుగా రజనీ చిత్రాల ఫలితాలు అభిమానులను కాస్త నిరాశపరుస్తూనే ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘రోబో’ (Robo) తర్వాత ఆ స్థాయి మ్యాజిక్‌ను ఆయన చిత్రాలు రిపీట్ చేయలేకపోయాయి. మధ్యలో నెల్సన్ దిలీప్‌కుమార్ అందించిన ‘జైలర్’ (Jailer) ఒక్కటే ఇండస్ట్రీ హిట్‌గా నిలవగా.. భారీ అంచనాల మధ్య లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘కూలీ’ కూడా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. సినిమాల జయాపజయాలను పక్కన పెడితే.. ప్రమోషన్ల విషయంలో మాత్రం రజనీకాంత్ తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా డిజప్పాయింట్ చేస్తున్నారనే చర్చ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
కోలీవుడ్ కంటే ఎక్కువే.. అయినా ఎందుకీ నిర్లక్ష్యం?
ఈ మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే.. రజనీకాంత్ చిత్రాలకు కోలీవుడ్ (తమిళనాడు) కంటే తెలుగులోనే విపరీతమైన ఆదరణ, వసూళ్లు దక్కుతుంటాయి. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ, మన స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు ప్రేక్షకులు ఆయన చిత్రాలను ఆదరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో రజనీకాంత్ చిత్రాలకు టికెట్ ధరలను భారీగా పెంచుకునే వెసులుబాటును అక్కడి ప్రభుత్వం కల్పిస్తూ వస్తోంది. తాజాగా దసరా కానుకగా రాబోతున్న ‘జైలర్ 2’ (Jailer 2) చిత్రానికి కూడా ఏపీ ప్రభుత్వం (AP Government) సింగిల్ స్క్రీన్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌లలో రూ. 75 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. అంటే, తమిళ ప్రేక్షకుల కంటే కూడా ఎక్కువ మొత్తం వెచ్చించి మరీ తెలుగు ఆడియన్స్ రజనీ సినిమాను చూడటానికి సిద్ధపడుతున్నారు. కానీ, ఇంతటి అభిమానాన్ని చూపిస్తున్న తెలుగు గడ్డపై రజనీకాంత్ అడుగుపెట్టి ఎంత కాలమైందో ఒక్కసారి గుర్తుచేసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు! ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘తెలుగు వారిని పట్టించుకోని రజనీకాంత్ సినిమాకు టికెట్ల ధరలు పెంచడం అవసరమా?’ అనేలా నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.
‘రోబో’ తర్వాత మళ్లీ కనిపించలేదే!
రజనీకాంత్ కొంతకాలంగా తన చిత్రాల ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారు. కోలీవుడ్‌లో మాత్రం ఒక భారీ ఆడియో లాంచ్ లేదా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి, అక్కడి అభిమానులను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారు తప్పితే.. ఇతర భాషలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. గతంలో ఎప్పుడో ‘రోబో’ విడుదల సమయంలో హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ తర్వాత ఆయన చిత్రాలకు తెలుగులో అసలు అడుగు పెట్టిందే లేదు. మరీ ముఖ్యంగా, టికెట్ రేట్ల పెంపుతో భారీ రెవెన్యూ ఇచ్చే ఏపీలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ప్రమోషనల్ ఈవెంట్‌కు కూడా రజనీకాంత్ హాజరు కాలేదు. తెలుగు నిర్మాతలే స్వయంగా చెన్నై వెళ్లి ఇంటర్వ్యూలు తీసుకోవడం లేదా లోకల్ డిస్ట్రిబ్యూటర్లే ప్రెస్ మీట్లు నిర్వహించి నెట్టుకొస్తున్నారు తప్ప.. తలైవా స్వయంగా వచ్చి ప్రమోట్ చేసిన దాఖలాలు లేవు.
వయసు కారణమే అయినా.. తెలుగు ప్రేక్షకుల కోరిక తీరేనా?
వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన ప్రయాణాలు తగ్గించి ఉండవచ్చన్నది అర్థం చేసుకోదగ్గ విషయమే. కానీ, ఒక్క హైదరాబాద్‌లోనే కాస్త సమయం కేటాయించి ఓ ప్రెస్ మీట్ లేదా ప్రీ-రిలీజ్ ఈవెంట్ పెట్టినా ఇక్కడి మార్కెట్‌కు కొండంత బలం చేకూరుతుంది. తన సొంత పరిశ్రమలోని ప్రేక్షకుల కంటే ఎక్కువ టికెట్ రేట్లు చెల్లించి, గుండెల్లో పెట్టుకుని చూసే తెలుగు అభిమానులను (Telugu Fans) రజనీకాంత్ ఒక్కసారైనా పలకరిస్తే బాగుంటుందనేది అభిమానుల ఆవేదన. ఇప్పటికే ‘జైలర్ 2’పై తెలుగులో సాలిడ్ బజ్ ఉంది. మరి ఈసారైనా చిత్ర యూనిట్ రజనీకాంత్‌ను హైదరాబాద్ తీసుకొచ్చి ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తుందా? లేక ఎప్పటిలాగే కేవలం చెన్నై ఈవెంట్‌తోనే సరిపెట్టి తెలుగు ప్రేక్షకులను నిరాశపరుస్తారా? అనేది చూడాలి!
ఇవి కూడా చదవండి:
దసరా టు డిసెంబర్.. బాక్సాఫీస్ బరిలో పొరుగు సినిమాలు
సీమ పౌరుషం తర్వాత ఉత్తరాంధ్ర కళకు జై కొట్టిన నారా లోకేష్..
ట్రోలర్‌కు అదిరిపోయే కౌంటరిచ్చిన ఆది సాయికుమార్.. పోస్ట్ వైరల్