ప్రసవం తర్వాత లుక్స్‌పై కామెంట్స్.. కత్రినా ఇచ్చిపడేసింది

ABN , Publish Date - Oct 10 , 2026 | 08:45 PM

ప్రసవం తర్వాత ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్న కత్రినా కైఫ్‌ లుక్స్‌పై కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌ చేశారు. తాజాగా లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కత్రినా.. ఈ ట్రోల్స్‌పై హుందాగా స్పందిస్తూ ఒక్కొక్కరికి ఇచ్చిపడేశారు.

Katrina Kaif

సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి రూపంపై నిరంతరం ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటోంది. ప్రశంసలు ఎంత వేగంగా వస్తాయో.. అకారణంగా విమర్శలు, బాడీ షేమింగ్ కూడా అంతే దారుణంగా ఎదురవుతుంటాయి. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ (Katrina Kaif).. ప్రసవం తర్వాత ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొనగా, ఆమె లుక్స్‌పై కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్‌కు దిగారు. తాజాగా లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కత్రినా.. ఈ ట్రోల్స్‌పై హుందాగా స్పందిస్తూ ఒక్కొక్కరికి ఇచ్చిపడేశారు.

వాటిని పట్టించుకుంటే మన విలువ తగ్గుతుంది

‘‘సోషల్ మీడియాలో వచ్చే అభిప్రాయాలు, కామెంట్లు మన ఆత్మవిశ్వాసాన్ని, మన వ్యక్తిగత విలువను దెబ్బతీయకుండా జాగ్రత్తపడాలి. నెట్టింట రకరకాల వ్యక్తులు రకరకాల అభిప్రాయాలు చెబుతుంటారు. వాటన్నింటినీ సంతృప్తి పరుస్తూ కూర్చుంటే.. జీవితంలో మనం మన స్వంత నిర్ణయాలు తీసుకోలేం. విమర్శలు అనేవి మనం ముందుకు సాగకుండా అడ్డుకట్ట వేయకూడదు’’ అని కత్రినా స్పష్టం చేశారు.


భయపడితే అక్కడే ఆగిపోతాం..

విమర్శలను ఎదుర్కొనే విధానం గురించి చెబుతూ.. ‘‘వ్యక్తిగతంగా నా వరకు వస్తే.. నన్ను విమర్శించిన ప్రతిసారీ, నాపై వచ్చిన కామెంట్లను బట్టి నా నిర్ణయాలను మార్చుకుంటూ పోతే.. భయంతో నేను అక్కడే స్తంభించిపోయేదాన్ని. జీవితంలో గానీ, కెరీర్‌లో గానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయేదాన్ని. లోకం మనల్ని ఆకాశానికెత్తే రోజులు కొన్ని ఉంటాయి.. కానీ మరికొన్ని సందర్భాల్లో మనల్ని మనమే ప్రోత్సహించుకుంటూ, మనమే మనకు అతిపెద్ద ‘చీర్‌లీడర్’గా నిలబడాలి’’ అంటూ ఆత్మవిశ్వాసంతో మాట్లాడారు.


ఎలా ఉన్నా నిన్ను నువ్వు ప్రేమించుకో!

తన బ్యూటీ బ్రాండ్ ఆలోచనను పంచుకుంటూ.. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనల్ని మనం స్వీకరించాలి. జీవితంలోని ప్రతి దశలోనూ మార్పులు సహజం. కొన్నిసార్లు మనం చేసే ప్రతి పనీ అద్భుతంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది.. మరికొన్ని సమయాల్లో ఏదీ సరిగ్గా జరగడం లేదనే భావన కలుగుతుంది. ఒకరోజు మనలో ఉత్తమ రూపాన్ని చూసుకుంటాం.. మరోరోజు ఆ స్థాయికి చేరుకునే ప్రయాణంలో ఉంటాం. అందుకే ఇతరుల మాటలను ఎక్కువగా తలకెక్కించుకోకుండా, అన్నింటినీ తేలిగ్గా తీసుకుంటూ జీవితాన్ని ఆస్వాదించాలి’’ అని కత్రినా పేర్కొన్నారు. తల్లిగా మారిన తర్వాత తన లుక్స్‌పై వచ్చిన ట్రోల్స్‌కు కృంగిపోకుండా, తనదైన స్పష్టమైన ఆలోచనలతో స్ఫూర్తినింపేలా కత్రినా ఇచ్చిన సమాధానం ప్రస్తుతం అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

తెలుగు వారిని పట్టించుకోని రజనీ.. రేట్లు పెంచడం అవసరమా?

దసరా టు డిసెంబర్.. బాక్సాఫీస్ బరిలో పొరుగు సినిమాలు

సీమ పౌరుషం తర్వాత ఉత్తరాంధ్ర కళకు జై కొట్టిన నారా లోకేష్..

Updated Date - Oct 10 , 2026 | 09:04 PM