మంచి పాత్రలు రాకే.. మానేసి ఆ పని చేస్తున్నా: ఎల్.బి. శ్రీరామ్
ABN, Publish Date - Oct 07 , 2026 | 09:58 PM
తాను వెండితెరకు ఎందుకు దూరంగా ఉంటున్నారో చెబుతూ నటుడు ఎల్.బి. శ్రీరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆయన నటించిన ‘గరివిడి లక్ష్మి’ మూవీ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సమర్పణలో.. ఉత్తరాంధ్రకు చెందిన లెజెండరీ బుర్రకథ, జానపద గాయని గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘గరివిడి లక్ష్మి’ (Garividi Lakshmi). ప్రముఖ నటి ఆనంది టైటిల్ రోల్ పోషిస్తుండగా, గౌరి నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. టి.జి. విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో నిర్వహించిన చిత్ర వేడుకలో సీనియర్ నటుడు, రచయిత ఎల్బీ శ్రీరామ్ (L.B. Sriram) పాల్గొని చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తాను వెండితెరకు ఎందుకు దూరంగా ఉంటున్నారో చెబుతూ ఆయన వేదికపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీలో తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎల్బీ శ్రీరామ్ మాట్లాడారు.. ‘‘నేను చాలా కాలంగా సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్నాను. ఇప్పటికే 500 సినిమాలకు పైగా నటించేశాను. ‘హలో బ్రదర్’, ‘హిట్లర్’ లాంటి దాదాపు 40 హిట్ చిత్రాలకు మాటలు రాశాను. 10–15 ఏళ్లు నాటకరంగంలో స్టేజ్ ఆర్టిస్ట్‌గా చేశాను. నాతో పాటు నటించిన తోటి కమెడియన్లంతా పైకి వెళ్లిపోయారు. మా గురువు ఇ.వి.వి. సత్యనారాయణ గారి లాంటి దర్శకులు లేరు. ఇక నాకు సరిపడా మంచి పాత్రలు రావడం లేదు. దాంతో సినిమాలు వద్దులే అనుకొని, యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్స్ చేయడం మొదలుపెట్టాను. వాటికి ‘హార్ట్ ఫిల్మ్స్’ అని పేరు పెట్టుకుని దాదాపు 60 షార్ట్ ఫిల్మ్స్ చేశాను’’ అన్నారు.
సినిమాలకు దూరంగా ఉంటూ అప్పుడప్పుడు మాత్రమే మంచి పాత్రలు వస్తే చేస్తున్నానని తెలిపిన ఆయన, ‘గరివిడి లక్ష్మి’ చిత్రంలో భాగం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ‘‘సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ నాతో కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ చేయించాడు. ‘లగ్గం’ లాంటి సినిమాల్లోనూ కలిసి పనిచేశాం. ఈ సినిమాలో బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మికి గురువు పాత్ర ఉందని, అది మీరే చేయాలని చరణ్ అర్జున్ చెప్పాడు. దర్శకుడు గౌరి నాయుడు వచ్చి నాకు కథ చెప్పిన తీరు, ఆయనకు స్క్రిప్ట్‌పై ఉన్న కమాండ్ చూసి ఆశ్చర్యపోయాను. చిన్న పాత్ర అయినా సరే, ఇంత మంచి క్యారెక్టర్‌ను అస్సలు వదులుకోకూడదని ఒప్పుకున్నాను’’ అని తెలిపారు.
బయోపిక్‌ల ప్రాధాన్యతను వివరిస్తూ.. ‘‘గతంలో నేను సొంత ఖర్చులతో తెలుగు తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారిపై ‘కవి సామ్రాట్’ పేరుతో బయోపిక్ తీసి ప్రధాన పాత్ర పోషించాను. ఇలాంటి బయోపిక్‌లు, పీరియాడికల్ సినిమాల్లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ప్రతిభను నిరూపించుకోవడానికి ఎంతో స్కోప్ ఉంటుంది. ‘గరివిడి లక్ష్మి’లో ఏకంగా 16 పాటలు ఉన్నాయి.. ఇదొక సంగీత విందు. చిన్నప్పుడు దసరా పందిళ్లలో రాత్రంతా మేల్కొని బుర్రకథలు చూసిన రోజులు గుర్తొచ్చాయి. నిర్మాత విశ్వప్రసాద్ గారి కుమార్తె కృతి తొలి అడుగులోనే ఒక మహిళా కళాకారిణి జీవిత కథను ఎంచుకుని నిర్మించడం నిజంగా గొప్ప విషయం’’ అని ఎల్బీ శ్రీరామ్ చిత్ర బృందాన్ని అభినందించారు.
ఇవి కూడా చదవండి:
Fauzi: ప్రభాస్ బర్త్‌డే ట్రీట్.. మూడు నిమిషాల అరాచకం
మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్ అప్పుడేనా?.. అయితే ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా
సంయమనం పాటిస్తున్నా.. బండ్ల గణేష్ సంచలన ప్రకటన