సంక్రాంతి పరీక్ష.. కృతి కెరీర్ మలుపు తిరుగుతుందా..
ABN, Publish Date - Nov 22 , 2026 | 10:23 PM
తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టడం అంత ఈజీ పని ఏమీ కాదు. కానీ అలాంటి అరుదైన ఫీట్‌ను సాధించిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఇప్పుడామె కెరీర్ ఎలా నడుస్తుందో తెలియంది కాదు.
తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టడం అంత ఈజీ పని ఏమీ కాదు. కానీ అలాంటి అరుదైన ఫీట్‌ను సాధించిన ముద్దుగుమ్మ కృతి శెట్టి (Krithi Shetty). ‘ఉప్పెన’ (Uppena) చిత్రంలో బేబమ్మగా ఆమె చూపించిన అందం, అమాయకత్వం, నటన.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సినిమాతోనే టాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రంలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ రోల్, ‘బంగార్రాజు’లో పక్కా పల్లెటూరి పిల్లగా కనిపించి హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మూడు వరుస విజయాలతో కృతి శెట్టి స్టార్ హీరోయిన్ల లీగ్‌లోకి చేరడం ఖాయం అనుకున్నారు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు సైతం ఆమె డేట్స్ కోసం క్యూ కట్టారు.
సక్సెస్ ఎంత వేగంగా వచ్చిందో.. అంతే వేగంగా కెరీర్‌లో స్పీడ్ బ్రేకర్లు ఎదురయ్యాయి. హ్యాట్రిక్ తర్వాత కృతి ఎంచుకున్న కథలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా కొట్టాయి. ‘ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ..’ ఇలా వరుస ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయి. ఈ వరుస ఫ్లాపులు కృతి శెట్టి మార్కెట్‌ను దెబ్బతీశాయి. దీంతో తెలుగులో కొత్త ప్రాజెక్టులు తగ్గడంతో కాస్త గ్యాప్ ఇచ్చి, ఇతర ఇండస్ట్రీలపై దృష్టి పెట్టింది. మలయాళంలో టొవినో థామస్ సరసన చేసిన ‘ఏఆర్ఎం’ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నా, ఆమెకు అక్కడ పెద్దగా కలిసొచ్చిందేమీ లేదు. తమిళంలో చేసిన స్ట్రెయిట్ ప్రాజెక్ట్‌లు కూడా నిరాశనే మిగిల్చాయి. ఒకానొక దశలో కెరీర్ పూర్తిగా కష్టాల్లో పడిందనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బేబమ్మ మళ్లీ తన సొంతగూడు టాలీవుడ్‌పైనే దృష్టి సారించింది. కరెక్ట్‌గా ఆమె కెరీర్‌కు ఊపునిచ్చే సరైన అవకాశం కోసం చూస్తున్న సమయంలో.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.
ఈ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, కళ్యాణ్ రామ్‌కు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) చిత్రాల్లో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆయన గత చిత్రాల్లో కథానాయికల పాత్రలు ఎంత పాపులర్ అయ్యాయో.. తెలియంది కాదు. అలాంటి దర్శకుడి చేతుల్లో పడటం కృతికి నిజంగా ఓ గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి (Sankranthi) బరిలో భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అవుతోంది. పండుగ సీజన్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడంలో అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ అద్భుతం.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద క్లిక్ అయితే.. కృతి శెట్టి మార్కెట్ తెలుగులో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఖాయం. ప్రస్తుతం తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తూనే.. మరోవైపు హిందీ రంగ ప్రవేశానికి కూడా సన్నాహాలు చేసుకుంటోంది. ఈ కీలక దశలో టాలీవుడ్‌లో వచ్చే ఒక్క విజయం ఆమె పాన్ ఇండియా ప్రాజెక్టులకు సైతం పెద్ద బూస్ట్‌గా మారుతుంది. సంక్రాంతి రేసులో రాబోతున్న ఈ సినిమాతో బేబమ్మ మళ్లీ విజయాల ట్రాక్‌పైకి వచ్చి టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారుతుందా? బాక్సాఫీస్ ఆమెకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది..? అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీనే..: రకుల్
‘భోగి’ ట్రైలర్.. ఘడియలు దగ్గర పడ్డాయ్.. గంగా గాడి కోత మొదలు
ఎవరిపైనైనా క్రష్ ఉందా? అంటే.. మీనూ పాప షాకింగ్ ఆన్సర్