Krithi Shetty: ఉంచుతాయో.. ముంచుతాయో! డిసెంబ‌ర్ అంతా.. బేబ‌మ్మ‌దే

ABN , Publish Date - Oct 09 , 2025 | 03:41 PM

అందాల చిన్నది కృతి శెట్టి నటించిన మూడు సినిమాలు ఈ డిసెంబర్ మాసంలో విడుదల కాబోతున్నాయి. డిసెంబర్ 5న 'వా వాతియర్' వస్తుంటే, అదే నెల 18న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' విడుదల కానుంది. ఇక డిసెంబర్ లోనే 'జీనీ' చిత్రం సైతం విడుదల అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Krithi Shetty

ఐదేళ్ళ క్రితం 'ఉప్పెన' (Uppena) తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల సుందరి కృతిశెట్టి (Krithi Shetty) ఇంతవరకూ చేసింది కేవలం పన్నెండు చిత్రాలే. తొలి చిత్రం 'ఉప్పెన'తోనే అమ్మడు వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఆ తర్వాత వచ్చిన 'శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు' చిత్రాలూ మంచి విజయాన్ని అందుకుని అమ్మడిని హ్యాట్రిక్ స్టార్ ను చేశాయి. కానీ ఆ తర్వాత నుండే కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కృతిశెట్టికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ అవేవీ ఆమెను సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. దాంతో 2023, 2024లో ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసింది.


చిత్రం ఏమంటే... ఈ యేడాది ఇంతవరకూ కృతిశెట్టి నటించిన సినిమా ఏదీ విడుదల కాలేదు. కానీ ఇప్పుడు ఒకేసారి, ఒకే నెలలో బ్యాక్ టు బ్యాక్ కృతిశెట్టి నటించిన మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే... ఇవన్నీ ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమాలు. ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganadhan) హీరోగా విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'లో కృతిశెట్టి హీరోయిన్. ఈ సినిమా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడింది. దీపావళికి పక్కాగా వచ్చేస్తోందని ఆ మధ్య ప్రకటన కూడా చేశారు. కానీ అదే సమయంలో ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్' (Dude) సినిమా ఉండటంతో ఇప్పుడు దీనిని డిసెంబర్ 18కి వాయిదా వేశారు.


కార్తీ (Karthi) సరసన కృతిశెట్టి నటించిన 'వా వాతియార్' సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తయిపోయింది. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 5న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు. ఇక రవి మోహన్ (Ravi Mohan) హీరోగా రూపుదిద్దుకుంటున్న 'జీనీ' సినిమా కూడా డిసెంబర్ లోనే జనం ముందుకు వస్తుందని తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలోని 'అబ్ది... అబ్ది' అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇందులో కృతిశెట్టి, కళ్యాణీ ప్రియదర్శన్ బెల్లీ డాన్స్ పోటీలు పడి చేశారు. దాంతో ఒక్కసారిగా అందరి ఫోకస్ కృతిశెట్టి మీదకు మళ్ళింది. మరి కొంతకాలంగా సక్సెస్ కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తున్న కృతిశెట్టి... ఈ మూడు సినిమాలతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి.

Also Read: Theater Movies: శుక్ర‌వారం, ఆక్టోబ‌ర్ 10.. ఇండియా వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో రిలీజయ్యే సినిమాలివే

Also Read: Akshay Kumar: సరికొత్త థ్రిల్లర్ గా 'హైవాన్'

Updated Date - Oct 09 , 2025 | 04:31 PM