నవంబర్ 14న మళ్లీ థియేటర్లలోకి ‘కొబ్బరిమట్ట’
ABN, Publish Date - Oct 24 , 2026 | 12:24 PM
సంపూర్ణేశ్ బాబు మూడు పాత్రల్లో నటించిన కామెడీ చిత్రం ‘కొబ్బరిమట్ట’ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. మూడు నిమిషాల సింగిల్ టేక్ డైలాగ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన సంపూ మూవీ మళ్లీ తెరపైకి రానుంది.
సంపూర్ణేశ్ బాబు హీరోగా నటించిన రెండో సినిమా 'కొబ్బరిమట్ట'. స్టీవెన్ శంకర్ (సాయి రాజేశ్) స్వీయ దర్శకత్వంలో సంపూర్ణేశ్ బాబు హీరోగా నటించిన 'హృదయకాలేయం' తర్వాత వచ్చిన సినిమా ఇది. ఇందులో బర్నింగ్ స్టార్ సంపూ పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయుడు అనే మూడు పాత్రలను చేశాడు. ఈ సినిమాలో మూడు నిమిషాల డైలాగ్ ను సింగిల్ టేక్‌లో చెప్పి, సంపూ అందరినీ ఆశ్చర్యపర్చాడు. సయ్యద్ కమ్రాన్ సంగీతం అందించిన 'కొబ్బరిమట్ట' సినిమాలోని పాటలు శ్రోతల ఆదరణ పొందాయి. ఇషికా సింగ్, గీతాంజలి, కత్తి మహేశ్, గాయత్రి గుప్తా, షకీలా తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ మీద స్టీవెన్ శంకర్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు రీ-రిలీజ్ కాబోతోంది. బాలల దినోత్సవం సందర్భంగా దీనిని నవంబర్ 14న జనం ముందుకు తీసుకొస్తున్నారు.
'కొబ్బరిమట్ట' సినిమా తర్వాత సంపూర్ణేశ్ బాబు సోలో హీరోగా మరికొన్ని చిత్రాలలో నటించారు. అయితే అవేవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సంపూ కొనసాగుతూ వస్తున్నారు. తాజాగా వచ్చిన నాని మూవీ 'ది ప్యారడైజ్'లో సంపూర్ణేశ్ బాబు బిర్యానీ పాత్రను చేసి మెప్పించాడు. ఇదిలా ఉంటే దర్శకుడు స్టీఫెన్ శంకర్ ఉరఫ్ నీలం సాయిరాజేశ్ ఆ తర్వాత 'కలర్ ఫోటో' సినిమాను నిర్మించారు. 'బేబీ' చిత్రానికి దర్శకత్వం వహించారు. అది ఘన విజయం సాధించింది. ఈ యేడాది ఆయన రచన చేసి, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన 'చెన్నయ్ లవ్ స్టోరీ' సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ ‘ఫౌజీ’లో నేతాజీగా చేసింది ఎవరో తెలుసా?
ఈసారి ఊహించినట్లుగా ఉండదు.. వేరే కోణంలో ఉంటుంది.. ఏం చేశావ్ గురూజీ?
Sunday TV Movies: అక్టోబర్ 25, ఆదివారం.. స్మాల్ స్క్రీన్‌పై వచ్చే సినిమాలు