‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్ ఏమైందో తెలుసా?.. నెట్టింట విమర్శల వెల్లువ
ABN , Publish Date - Nov 08 , 2026 | 08:00 PM
సినిమా ప్రమోషన్ల కోసం ఈ మధ్యకాలంలో సరికొత్త పబ్లిసిటీ స్టంట్లను ఎంచుకోవడం సర్వసాధారణమైపోయింది. అందులో భాగంగా ఇటీవల విడుదలైన ‘కిల్లర్’ చిత్ర బృందం ప్రకటించిన కోటి రూపాయల కాంటెస్ట్ సోషల్ మీడియాలో భారీ సంచలనమే సృష్టించింది.
సినిమా ప్రమోషన్ల కోసం ఈ మధ్యకాలంలో సరికొత్త పబ్లిసిటీ స్టంట్లను ఎంచుకోవడం సర్వసాధారణమైపోయింది. అందులో భాగంగా ఇటీవల విడుదలైన ‘కిల్లర్’ (Killer) చిత్ర బృందం ప్రకటించిన కోటి రూపాయల కాంటెస్ట్ సోషల్ మీడియాలో భారీ సంచలనమే సృష్టించింది. సినిమా చూస్తూ ఇంటర్వెల్ సమయానికి సెకండాఫ్ ట్విస్ట్‌ను ఒక్క లైన్లో సరిగ్గా ఊహించి చెబితే ఏకంగా కోటి రూపాయల నగదు బహుమతి ఇస్తామంటూ మేకర్స్ చేసిన ప్రకటన ప్రేక్షకుల్లో భారీగా క్యూరియాసిటీని పెంచింది. అయితే థియేటర్లలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ కోటి రూపాయల కాంటెస్ట్ ఫలితాలను చిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వాజ్ (Jyoti Poorvaj) ప్రెస్‌మీట్ పెట్టి అధికారికంగా వెల్లడించారు.
ఈ కాంటెస్ట్ కోసం దాదాపు 5 వేల మంది ప్రేక్షకులు తమ సమాధానాలను స్క్రీన్షాట్ల రూపంలో పంపించారని, అయితే తాము అనుకున్న ఖచ్చితమైన సమాధానాన్ని ఎవరూ సరిగ్గా చెప్పలేకపోయారని పూర్వాజ్ (Director Poorvaaj) తెలిపారు. షోల సమయాల్లో తేడాలు రావడంతో స్క్రీన్‌షాట్ పంపే గడువును 5 నిమిషాల నుంచి అరగంటకు పెంచామని వివరించారు. ఎవరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోయినా.. సమాధానానికి కాస్త దగ్గరగా వచ్చిన 10 మందిని ఎంపిక చేసి, ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ. 10 లక్షల నగదు బహుమతి అందజేస్తున్నట్లు ప్రకటించారు. నాగేంద్ర, కేశవశర్మ, మురళి, సాగర్, గోపి, హరి, కళ, ధృవ్, వెంకట్ నాయుడు, భానులను విజేతలుగా ప్రకటించి, వారితో కలిసి లంచ్ కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఫలితాలు బయటకు రావడంతో నెటిజన్ల నుంచి, సినీ ప్రియుల నుంచి భారీ స్థాయిలో ట్రోలింగ్, విమర్శలు మొదలయ్యాయి. సినిమాకు బజ్ తీసుకురావడానికి ‘కోటి రూపాయలు’ అంటూ ఆశ చూపి, తీరా చూస్తే ఎవరూ గెలవలేదనే సాకుతో రూ. 10 లక్షలతో కథ ముగించేశారని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. ఇలాంటి కాంటెస్టుల్లో ఎవరికీ కోటి రూపాయలు ఇవ్వరని ముందే తెలుసంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు సినిమా థియేట్రికల్ రెస్పాన్స్ ఆశించినంతగా లేదని స్వయంగా అంగీకరించిన పూర్వాజ్.. రూ. 2 కోట్ల థియేట్రికల్ గ్రాస్, ఓటీటీ, ఇతర రైట్స్ ద్వారా రూ. 8 కోట్ల రిటర్న్స్ వచ్చాయని, పెట్టిన రూ. 5 కోట్ల పెట్టుబడికి లాభాల్లోనే ఉన్నామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా త్వరలోనే ‘కిల్లర్ 2’ కూడా ఉంటుందని ప్రకటించినప్పటికీ, ఈ కోటి రూపాయల కాంటెస్ట్ వ్యవహారం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
‘కింగ్ 100’లో కర్ణగా వెర్సటైల్ యాక్టర్.. ఫస్ట్ లుక్ అదిరింది
‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’.. ఫ్యాన్స్‌లో గందరగోళం
ఫ్లాప్ సినిమాను వందరోజులు ఆడించారు.. ఘట్టమనేని ఫ్యాన్స్ ప్రేమిస్తే ఇంతే..