తెలుగులో ‘ప్రతిరూపం’గా కన్నడ హిట్ ‘ఇనియన్ ఆత్మ’
ABN, Publish Date - Oct 24 , 2026 | 01:29 PM
కన్నడలో విజయం సాధించిన ‘ఇనియన్ ఆత్మ’ చిత్రం ‘ప్రతిరూపం’ పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమైంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు నటి దివ్యవాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిర్మాత బి. కళావతి, దర్శకుడు ఎస్. నరేష్ సహా చిత్రబృందం తెలుగు ప్రేక్షకుల ఆదరణపై ఆశాభావం వ్యక్తం చేసింది.
శ్రీ వినాయక వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై ఎస్. నరేష్ దర్శకత్వంలో బి. కళావతి కన్నడలో నిర్మించిన చిత్రం 'ఇనియన్ ఆత్మ'. కన్నడలో మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రతిరూపం' పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రీ-రిలీజ్ వేడుకకు ప్రముఖ నటీమణి కె. దివ్యవాణి చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గిడుగు కాంతికృష్ణ, ప్రముఖ బిజినెస్ కో-ఆర్డినేటర్ నారాయణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు చిత్రబృందం మొత్తం బెంగుళూరు నుంచి తరలివచ్చింది.
చిత్ర నిర్మాత శ్రీమతి బి. కళావతి, చిత్ర దర్శకుడు నరేష్, ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన బి. సుస్మిత, "రేణుక-ఎల్లమ్మ" సీరియల్ ఫేమ్ అనన్య వి.ఎస్., నయన, మధుశ్రీ, మంత్రవాది ఆది, రవి కిరణ్, కిట్టు ఈ వేడుకలో పాల్గొని, తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం వ్యక్తం చేశారు. కన్నడ సినిమా రంగంతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ఆత్మీయంగా నెమరువేసుకుని, చిత్రబృందంతో కన్నడలో అనర్గళంగా మాట్లాడిన దివ్యవాణి... 'ప్రతిరూపం' చిత్రం తెలుగులో పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ, గిడుగు కాంతి కృష్ణ మాట్లాడుతూ, 'తెలుగు ప్రేక్షకులకు భాషాభేదం ఉండదని, కంటెంట్ బాగుంటే బ్రహ్మరథం పడతార'ని పేర్కొన్నారు. అతిథులకు, చిత్రబృందానికి నిర్మాత బి. కళావతి కృతజ్ఞత తెలిపారు. త్వరలో తెలుగులో స్ట్రెయిట్ సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ ‘ఫౌజీ’లో నేతాజీగా చేసింది ఎవరో తెలుసా?
ఈసారి ఊహించినట్లుగా ఉండదు.. వేరే కోణంలో ఉంటుంది.. ఏం చేశావ్ గురూజీ?
Sunday TV Movies: అక్టోబర్ 25, ఆదివారం.. స్మాల్ స్క్రీన్‌పై వచ్చే సినిమాలు