సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘ఇరుముడి’.. స్కూల్ సీన్స్ కాంట్రవర్సీపై శివ నిర్వాణ క్లారిటీ

ABN, Publish Date - Sep 02 , 2026 | 08:09 PM

‘ఇరుముడి’ సినిమాలో చూపించిన గవర్నమెంట్ స్కూల్ సన్నివేశాలు, యూనిఫామ్‌పై సోషల్ మీడియాలో కొంత చర్చ, అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ వేదికపై పూర్తి స్పష్టతనిచ్చారు.

Shiva Nirvana

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) హీరోగా దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) రూపొందించిన ‘ఇరుముడి’ (Irumudi) చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును దాటి సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం బుధవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. అయితే, ఈ సినిమాలో చూపించిన గవర్నమెంట్ స్కూల్ సన్నివేశాలు, యూనిఫామ్‌పై సోషల్ మీడియాలో కొంత చర్చ, అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ వేదికపై పూర్తి స్పష్టతనిచ్చారు.

ఇటీవల తిరుపతి పర్యటనలో తనకు ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను ఈ సందర్భంగా శివ నిర్వాణ గుర్తుచేసుకున్నారు. ‘‘రెండు రోజుల క్రితం నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాను. అక్కడ ఓ మహిళ పరుగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చారు. ‘సార్.. నేను గవర్నమెంట్ టీచర్‌ని.. మీరు సినిమా అంతా చాలా బాగా తీశారు కానీ, ప్రభుత్వ పాఠశాల సీన్లు నన్ను కాస్త ఇబ్బంది పెట్టాయి. సేమ్ యూనిఫామ్‌లు, సేమ్ టీచర్లను అలా ఎందుకు చూపించారు?’ అని అడిగారు. అప్పుడు నేను ఆమెకు సినిమా ప్రారంభ సన్నివేశాలను గుర్తుచేశాను’’ అని తెలిపారు.


‘‘సినిమా ప్రారంభంలోనే హీరో ఊరైన పొల్లూరులో ఎలిమెంటరీ స్కూల్‌లో ఎంతో అంకితభావం కలిగిన ఒక మంచి ప్రభుత్వ ఉపాధ్యాయుడిని చూపించాం. ఆయన పిల్లలను ఎంత బాగా చూసుకుంటారో, ఎంత చక్కగా మాట్లాడతారో అందరూ చూశారు. సినిమా క్లైమాక్స్ ఎండ్ సీన్‌లో కూడా పాపను తిరిగి ఆయనే తీసుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలు, టీచర్లపై ఎలాంటి తప్పుడు అభిప్రాయం లేదా ప్రతికూల భావన రాకూడదనే ఉద్దేశంతోనే ఆ మంచి టీచర్ పాత్రను మొదటి నుంచే బలంగా డిజైన్ చేశాను. ఆ విషయం చెప్పగానే.. ‘అవును కదండీ.. అది నాకు గుర్తుకు రాలేదు’ అని ఆమె గ్రహించారు’’ అని శివ నిర్వాణ వివరించారు.


కొందరు ప్రేక్షకులు సినిమా చూసే క్రమంలో కొన్ని కీలక అంశాలను మిస్ అయి ఉండవచ్చని, అందుకే వారిని తాను తప్పుపట్టడం లేదని శివ నిర్వాణ స్పష్టం చేశారు. గవర్నమెంట్ పాఠశాలలను కించపరచాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని, వ్యవస్థలోని మంచిని కూడా సినిమాలో సమానంగా ఆవిష్కరించామని మీడియా ద్వారా ఆయన ప్రేక్షకులకు వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదానికి పూర్తిగా తెరపడినట్లయింది.

ఇవి కూడా చదవండి:

పవన్ కళ్యాణ్ బర్త్‌డే.. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షల వెల్లువ

పవన్ కళ్యాణ్‌పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్

200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్

Updated Date - Sep 02 , 2026 | 08:09 PM