పవన్ కళ్యాణ్‌పై ‘ఓజీ’ నటి శ్రియా రెడ్డి ఎమోషనల్ పోస్ట్
ABN , Publish Date - Sep 02 , 2026 | 03:25 PM
పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఆయనకున్న అశేష ప్రజాదరణ, స్టార్‌డమ్, పవర్ ప్యాక్డ్ వ్యక్తిత్వం గురించే అందరూ చర్చిస్తుంటారు. అయితే, తెరవెనుక ఆయనలో ఉన్న అరుదైన మానవతా దృక్పథాన్ని, ఆపన్నుల పట్ల ఆయన చూపించే ప్రేమను ఆవిష్కరిస్తూ ‘ఓజీ’ (OG) చిత్రంలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Sriya Reddy) సోషల్ మీడియా వేదికగా చేసిన భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.
పవన్ కళ్యాణ్‌లోని సేవా గుణాన్ని శ్రియా రెడ్డి వివరిస్తూ.. ‘‘హ్యాపీ బర్త్‌డే పీకే సర్! మీ గురించి మాట్లాడేటప్పుడు ప్రజలు చాలా గొప్ప విషయాలు చెబుతుంటారు. కానీ నా మనసులో బలంగా ముద్రపడిపోయినవి మాత్రం.. సైలెంట్‌గా మీరు చేసే మంచి పనులే. ఎదుటివారి మాటలను మీరు వినే విధానం, వారి కష్టాలను గుర్తుపెట్టుకునే తీరు.. అన్నింటికంటే ముఖ్యంగా వారి సమస్యను పరిష్కరించడానికి మీరు రంగంలోకి దిగి కార్యాచరణ చేసే పద్ధతి ఎవరికీ సాధ్యం కాదు. మీరు కేవలం వినడం మాత్రమే కాదు, దాన్ని గుర్తుపెట్టుకుని వెంటనే చేసి చూపిస్తారు’’ అంటూ పవన్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు.
పవన్ కళ్యాణ్ సైలెంట్‌గా చేసిన పలు సంఘటనలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. ‘‘భారత మహిళా అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన గ్రామానికి రోడ్డు సౌకర్యం గురించి మీతో ప్రస్తావించినప్పుడు.. మీరు శ్రద్ధగా విన్నారు, ఆ సమస్యను పరిష్కరించి చూపించారు. ఓ వృద్ధురాలు తన ఇంటికి మళ్లీ రమ్మని మిమ్మల్ని కోరితే.. ఎన్నో ఏళ్ల తర్వాత కూడా ఆ మాటను గుర్తుపెట్టుకుని ఆమె ఇంటికి వెళ్లారు. అలాగే శ్రమజీవులైన మహిళలకు కేవలం చదువుకునే కళ్లజోళ్లు అవసరమైనప్పుడు కూడా, వారు అడగకుండానే ఆ అవసరాన్ని తీర్చి వారి ముఖాల్లో నవ్వులు నింపారు. ఇవన్నీ కేవలం ప్రచారం కోసమో, చప్పట్ల కోసమో చేసేవి కావని.. మీ హృదయం లోతుల్లో నుంచి వచ్చే నిజమైన సానుభూతి, బాధ్యత అని స్వయంగా చూసిన వ్యక్తిగా నేను చెప్పగలను’’ అని శ్రియా రెడ్డి పేర్కొన్నారు.
నిజమైన కరుణ అంటే ఆర్భాటపు ప్రకటనలు కాదని, సహాయం అవసరమైనప్పుడు నిశ్శబ్దంగా ముందుకు కదలడమేనని ఆమె కొనియాడారు. ‘‘ఎలాంటి ప్రచారం లేకుండా మీరు ఇతరులకు పంచుతున్న ఆ నిస్వార్థమైన దయ, ప్రేమ ఎల్లప్పుడూ రెట్టింపుగా మీకే తిరిగి చేరాలని కోరుకుంటున్నాను. మీకు ఈ ఏడాది అద్భుతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందిన భారీ చిత్రం ‘ఓజీ’లో నటించిన శ్రియా రెడ్డి.. పవన్ కళ్యాణ్‌లోని ఈ సున్నితమైన కోణాన్ని సమాజానికి తెలియజేయడంతో అభిమానులు, నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
200 కోట్ల క్లబ్‌లోకి ‘ఇరుముడి’.. మణికంఠుడి పోస్టర్ వైరల్
ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా.. బండ్లన్న మళ్లీ స్టార్ట్ చేశాడ్రోయ్
పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటేనే పండగ.. ఈసారి మునుపటి కంటే మిన్నగా