ఇండస్ట్రీ హిట్స్ వర్సెస్ బ్లాక్ బస్టర్స్.. ఎందుకీ చాటింపు?

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:17 PM

ఇప్పుడు వస్తున్న సినిమాల ప్రకటనలు శ్రుతిమించి పోతున్నాయి.. కాసింత బిగ్ హిట్ వస్తే చాలు ఏకంగా ‘ఇండస్ట్రీ హిట్’ అనేస్తున్నారు. సాధారణ హిట్ మూవీని సైతం ‘ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్’ అని చాటింపేస్తున్నారు.

Industry Hit vs Blockbuster

ఇప్పుడు వస్తున్న సినిమాల ప్రకటనలు శ్రుతిమించి పోతున్నాయి.. కాసింత బిగ్ హిట్ వస్తే చాలు ఏకంగా ‘ఇండస్ట్రీ హిట్’ అనేస్తున్నారు. సాధారణ హిట్ మూవీని సైతం ‘ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్’ అని చాటింపేస్తున్నారు. ఈ తరం ప్రేక్షకులు వీటిని నమ్మకుండా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే.. అది పబ్లిసిటీ స్టంట్ అని అందరికీ తెలుసు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి ‘ఇండస్ట్రీ హిట్’ అనీ ప్రకటించేస్తున్నారు. చివరకు లెక్కలు చూశాక అసలు లెక్కలు తేలుతున్నాయి. మరి ఇంతలా ప్రచారం చేసుకొనేది ఎందుకు? అంటే, ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే అంటున్నారు సినీజనం. అయితే జనం అంత తెలివి తక్కువగా లేరు అన్న సత్యాన్ని వారు గ్రహించాలి. ఎందుకంటే ఓ కొత్త సినిమా, అందునా ఎవరైనా బిగ్ స్టార్ మూవీ వస్తోందంటే చాలు ప్రేక్షకులు అదేపనిగా సోషల్ మీడియాలో రివ్యూస్ చూస్తున్నారు. ఓ పది రివ్యూస్ చూశాక ప్రేక్షకుడు తనకు తానే ఆ సినిమా అసలైన సత్తా ఏంటో నిర్ణయించేసుకుంటున్నాడు. దాంతో సినీజనం తమ చిత్రాల గురించి ఎంత డబ్బా కొట్టుకున్నా, జనం మాత్రం అబ్బో అనడం లేదు. ఇది కేవలం తెలుగు చిత్రసీమకే పరిమితం కాలేదు. భారతదేశంలోని అన్ని ప్రధాన సినిమారంగాల్లోనూ ఈ ఫేక్ పబ్లిసిటీ సాగుతోంది.


ఫేక్ పబ్లిసిటీ విషయానికి వస్తే.. టాప్ స్టార్స్ చేసే హంగామా మరింత వింతగా ఉంటోంది. తమ హీరోకి నిజంగానే ‘బ్లాక్ బస్టర్ హిట్’ వచ్చినా, ‘ఇండస్ట్రీ హిట్’ తగిలినా అంతకుముందు హిట్స్‌ను కూడా ‘ఇండస్ట్రీ హిట్స్’గా పేర్కొనడం విచిత్రంగా ఉంటోంది. ఈ మధ్య రజనీకాంత్ ‘జైలర్-2’ సినిమా నిజంగానే గుడ్ టాక్ సంపాదించి వసూళ్ళ వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ సినిమా కోలీవుడ్‌లో నంబర్ వన్ గ్రాసర్‌గా నిలచిందని రజనీకాంత్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అంతకు ముందు కూడా తమిళ చిత్రసీమలో రజనీకాంత్ నటించిన ‘2.0’ సినిమా టాప్ గ్రాసర్‌గా ఉండేది. దానిని ‘జైలర్-2’ అధిగమించిందని అభిమానుల మాట. కొందరు తమిళ సినీఫ్యాన్స్ మాత్రం ఇప్పటికీ ‘2.0’నే నంబర్ వన్ అని అంటున్నారు. వాస్తవానికి ‘2.0’ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే గత ఎనిమిది సంవత్సరాలుగా ‘2.0’ కలెక్షన్స్‌ను అధిగమించిన సినిమా ఏదీ రాకపోవడంతో అదే ‘ఇండస్ట్రీ హిట్’గా ఉండేది.

Robo-2-point-O.jpg

తమిళ బాక్సాఫీస్ లెక్కల ప్రకారం రజనీకాంత్, శంకర్ కాంబోలో వచ్చిన ‘2.0’ సినిమా బాక్సాఫీస్ వద్ద టోటల్ రన్‌లో రూ. 700 కోట్ల వరకు రాబట్టిందని ఇప్పటికీ చెబుతుంటారు. ఇప్పుడు వచ్చిన రజనీకాంత్ ‘జైలర్-2’ చిత్రం రూ. 765 కోట్లు వసూలు చేసి దానిని అధిగమించిందని ఫ్యాన్స్ మాట. ఇతర తమిళ సినీ ఫ్యాన్స్ మాత్రం ‘2.0’ సినిమా రూ. 800 కోట్ల వరకు వసూలు చేసిందని, దానిని ‘జైలర్-2’ ఇంకా అధిగమించలేదనీ అంటున్నారు. ఈ తంతు ఇలా ఉంటే ‘జైలర్-2’తో కలిపి రజనీకాంత్ నటించిన 16 చిత్రాలు ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయని మరో వార్త హల్ చల్ చేస్తోంది. అసలు ఫ్యాన్స్‌కు ఏది ఇండస్ట్రీ హిట్, ఏది బ్లాక్ బస్టర్ అన్న తేడా కూడా తెలియకుండా పోయిందని సినీ పండిట్స్ ఆవేదన చెందుతున్నారు.


రజనీకాంత్ 16 ఇండస్ట్రీ హిట్స్‌లో కమల్ హాసన్ హీరోగా, రజనీకాంత్ విలన్‌గా నటించిన ‘16 వయదినిలే’ సినిమాను కూడా పేర్కొనడంతోనే కథ అడ్డం తిరిగింది. ఇదంతా రజనీని గ్రేట్ అని నిరూపించడానికి చేస్తున్న ప్రచారం లాగే ఉందని అంటున్నారు. అంతకు ముందు చిత్రసీమలో టాప్ గ్రాసర్‌గా ఉన్న సినిమాను అధిగమించిన దానినే ఇండస్ట్రీ హిట్ అంటారు. దానిని మరో మూవీ దాటేస్తే అది కూడా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఇలా ‘ఇండస్ట్రీ హిట్’ను లెక్కించవచ్చు.. కానీ, రజనీకాంత్ 16 ఇండస్ట్రీ హిట్స్ చూశారని, అది ఇండియాలో ఎవరికీ లేదని చాటింపు వేయడాన్ని ఇతరులు తప్పు పడుతున్నారు.

sr-NTR.jpg

తమిళనాట ఎవరికి వారు తమ హీరో ఇండస్ట్రీ హిట్ సాధించాడని ఆనందిస్తున్నారు. అయితే ఏ హిట్టయినా, అది సదరు హీరో సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ అయి ఉంటుందే తప్ప.. నిజంగా టోటల్ ఇండస్ట్రీలోనే టాప్ గ్రాసర్ కాదని తేలుతోంది. తమిళనాట మాత్రం రజనీకాంత్ నటించిన కనీసం ఆరు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్‌గా ఉంటాయని కోలీవుడ్ ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ఇక తెలుగు చిత్రసీమ విషయానికి వస్తే నటరత్న యన్టీఆర్ అత్యధిక సంవత్సరాలు బ్లాక్ బస్టర్స్ చూసిన స్టార్‌గా ఉన్నారు. అలాగే తన రికార్డులను తానే అధిగమిస్తూ యన్టీఆర్ పలు ‘ఇండస్ట్రీ హిట్స్’ చూశారు. ఇప్పుడు ఆ రికార్డును ప్రభాస్ కలిగి ఉన్నాడని సినీ పండిట్స్ అంటున్నారు. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి- ద కంక్లూజన్’ మూవీ రూ. 1800 కోట్లకు పైగా రాబట్టి ఆల్ ఇండియాలో నంబర్ త్రీగానూ, టాలీవుడ్‌లో నంబర్ వన్ గానూ వెలుగుతోంది. ఆ మాటకొస్తే ఇండియాలోనే వెయ్యి కోట్లు సాధించిన తొలి చిత్రంగానూ ‘బాహుబలి-2’ నిలవడం గమనార్హం.


గత తొమ్మిది సంవత్సరాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి-2’ నంబర్ వన్ గ్రాసర్‌గా సాగుతోంది. దాని తరువాతి స్థానంలో రూ. 1600 కోట్లతో ‘పుష్ప-ద రూల్’ నిలచింది. 1300 కోట్లతో ‘ట్రిపుల్ ఆర్’ మూడో స్థానం దక్కించుకుంది. వెయ్యి కోట్లకు పైగా రాబట్టి ‘కల్కి 2898 ఏడి’ నాలుగో స్థానంలో ఉంది.. ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్సే కానీ, ‘ఇండస్ట్రీ హిట్స్’ అనలేము. ఎందుకంటే ప్రస్తుతానికి ఇండస్ట్రీ హిట్‌గా ‘బాహుబలి-2’ ఉంది. దానిని అధిగమించిన చిత్రాన్నే ‘ఇండస్ట్రీ హిట్’గా పరిగణిస్తారు. అప్పటి వరకు వేయికోట్లకు పైగా వసూళ్ళు చూసిన చిత్రాలను కూడా ‘ఇండస్ట్రీ హిట్’ అని పిలవలేము. ఈ సత్యాన్ని తెలుగు సినీ ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారనే ట్రేడ్ పండిట్స్ కూడా చెబుతున్నారు. అయినా కొందరు మాత్రం తమ సినిమా ‘ఇండస్ట్రీ హిట్’గా నిలచిందని ప్రచారం చేసుకోవడమే వింతగా ఉంటోంది.

Baahubali-2.jpg

ఈ మధ్య కొన్ని చిత్రాలు తెలుగునాట బంపర్ హిట్స్‌గా నిలిచాయి. వాస్తవానికి సదరు చిత్రాలు ఆ యా హీరోలకు బిగ్ హిట్స్ కావచ్చు. కానీ, ‘ఇండస్ట్రీ హిట్స్’ కావు కదా. ఓ సంవత్సరంలో అత్యధిక వసూళ్ళు చూసిన చిత్రాన్ని కానీ, లాంగ్ రన్ సాగిన సినిమాను కానీ ‘బ్లాక్ బస్టర్’ అంటారనీ తెలియని అమాయక అభిమానులు ఉన్నారు. వారు మాత్రం తమ హీరో బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ పట్టేశారని ఆనందిస్తూ ఉంటారు. తెలుగునాట మాత్రం సినిమా ఫ్యాన్స్ తమ అభిమాన హీరోల వసూళ్ళను పక్కాగా లెక్కలు వేసుకుంటూనే ఉన్నారు. అందువల్ల తమిళ తంబీల లాగా ‘ఇండస్ట్రీ హిట్’ అనే మాటను తరచూ ఉపయోగించడం లేదు. ఇక్కడ ఎవరు అవునన్నా, కాదన్నా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఆరు చిత్రాలు ఉన్న హీరోగా ప్రభాస్ సాగుతున్నారు. వెయ్యి కోట్లకు పైగా చూసిన నాలుగు తెలుగు చిత్రాల్లో రెండు ప్రభాస్‌వే ఉండడం గమనార్హం.. వాటిని అధిగమించే దిశగా ఇతర స్టార్స్ ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు.


ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి, ఇండస్ట్రీ హిట్‌గా నిలవడానికి ట్రిక్స్ అంటూ ఏమీ ఉండవు. జనాన్ని రంజింప చేసే కథ, కథనం చిత్రాల్లో ఉన్నప్పుడు సదరు చిత్రాలు ఆదరణ పొందుతాయి. అప్పటి పరిస్థితులను బట్టి హిట్ టాక్ సంపాదించిన చిత్రం బంపర్ హిట్ కావచ్చు. ఆ యేడాది దానిని అధిగమించే సినిమా లేకపోతే అదే ఆ ఇయర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఒకవేళ సదరు చిత్రమే అప్పటి వరకు నంబర్ వన్ గ్రాసర్‌గా ఉన్న సినిమాను అధిగమిస్తే ‘ఇండస్ట్రీ హిట్’గా నిలుస్తుంది. అంతేకానీ, సినిమా రిలీజయిన మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ అంటూ చాటింపు వేసుకోవడం వెర్రితనమే అవుతుంది. మరి ఈ సత్యాన్ని ఎంతమంది సినీ ఫ్యాన్స్ గ్రహిస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి:

నెల గ్యాప్ లోనే.. మెగా మేనల్లుడి ఎంగేజ్‌మెంట్, పెళ్లి.. డేట్స్ ఫిక్స్

RC17: పోస్టర్ చూసి.. ఆ సినిమాతో పోల్చుతున్నారేంటి? రీమేక్ కాదు కదా..

‘రణబాలి’ ఓటీటీ రిలీజ్ డేట్.. లీక్ చేసిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్

Updated Date - Nov 02 , 2026 | 06:21 PM

Prabhas : అప్పుడు ఫేస్‌బుక్‌.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్

Prabhas : అభ్యంతరాల మేరకే.. ఆ నిర్ణయం!

Prabhas : ఒంటరిగా నిలబడే బెటాలియన్.. ఫౌజీ పోస్టర్ అదిరిపోయింది

Jailer 2 Trailer: ఈ కాలపు స్టైల్.. అక్కడే బాంబు పెట్టడం 

Baahubali: మాహిష్మతి వెనుక కథలు, రహస్యాలతో.. ‘బాహుబలి’ సిరీస్‌తో వ‌స్తున్నాం