Tollywood: ఈ వారం ఓ డబ్బింగ్, నాలుగు స్ట్రెయిట్ మూవీస్!
ABN, Publish Date - May 20 , 2026 | 03:50 PM
'శుక్రవారం- సినిమా వారం' అన్న మాట ఏ నాటి నుంచో వినిపిస్తోంది. ఆ ఫార్ములా ప్రకారం ఈ ఫ్రై డే కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు కాస్త ముందుగా సందడి చేయడం మొదలెట్టాయి.
శుక్రవారం రాకముందే ఈ వారం సినీ సందడి మొదలయింది. మే 20వ తేదీన యంగ్ టైగర్ యన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన 'ఆంధ్రావాలా, ఊసరవెల్లి' చిత్రాలు రీ-రిలీజ్ అయ్యాయి. ఇక గురువారమే ప్రేక్షకులను పలకరిస్తోంది మళయాళం డబ్బింగ్ మూవీ 'దృశ్యం-3'. మోహన్ లాల్, మీనా జంటగా రూపొందిన 'దృశ్యం' సిరీస్ లోని రెండు భాగాలు ఇంతకు ముందు వెంకటేశ్ హీరోగా తెలుగులో రీమేక్ అయి అలరించాయి. ప్రస్తుతం వెంకటేశ్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల ఆయన 'దృశ్యం-3' రీమేక్ లో నటించే వీలు లేకపోయింది. దాంతో ఒరిజినల్ 'దృశ్యం-3'నే అనువాద రూపంలో గురువారం అంటే మే 21వ తేదీ రిలీజ్ చేస్తున్నారు. 'దృశ్యం-2'లోనే కథ పూర్తయింది అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ మూడో భాగంలో ఇంకా ఏమి మిగిలి ఉందో అన్న ఆసక్తి రేకెత్తిస్తోంది ఈ చిత్రం.
శుక్రవారం మే 22వ తేదీన నాలుగు స్ట్రెయిట్ తెలుగు మూవీస్ జనం ముందుకు వస్తున్నాయి. వాటిలో 'రమణి కళ్యాణం', 'అగ్లీ స్టోరీ', 'పురుషః', 'ఫస్ట్ టైమ్' చిత్రాలు ఉన్నాయి. దీప్సిక, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో విజయ్ ఆదిరెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'రమణి కళ్యాణం'. 'కోర్ట్' లాంటి జనరంజకమైన చిత్రానికి దర్శకత్వం వహించిన రామ్ జగదీశ్ ఈ 'రమణి కళ్యాణం'కు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూర్చడం విశేషం. అందువల్ల 'రమణి కళ్యాణం'పై జనాల్లో కాసింత ఆసక్తి నెలకొంది.
శుక్రవారం వస్తోన్న మిగిలిన మూడు స్ట్రెయిట్ సినిమాల్లో నందు, అవికాగోర్ నటించిన 'అగ్లీ స్టోరీ' టైటిల్ కు తగ్గట్టుగానే ఇష్టపడని అమ్మాయిని వేధించే ఓ వ్యక్తి కథతో తెరకెక్కింది. ప్రణవ స్వరూప్ దర్శకత్వంలో ఈ 'అగ్లీ స్టోరీ' రూపొందింది. హేమంత్ ఇప్పలపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ఫస్ట్ టైమ్'. ఇందులో సౌరభ్ ధింగ్ర, అనిక్క విక్రమన్ జంటగా నటించారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఈ సినిమా అద్దం పడుతుందని మేకర్స్ అంటున్నారు. ఇక 'పురుషః'లో బ్రహ్మచారి భర్తగా మారాలని భావించగానే అతని జీవితం యుద్ధభూమిగా మారుతుందనేది ప్రధానాంశం. వీరు ఉలవల దర్శకత్వంలో రూపొందిన 'పురుషః'లో పవన్ కళ్యాణ్ అనే కొత్త కుర్రాడు హీరోగా పరిచయం అవుతున్నారు. మరి ఈ శుక్రవారం రిలీజయ్యే మూవీస్ లో ఏ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
చిరుకి కాదు.. బాలయ్యకు విలన్‌గా మనోజ్!
Peddi Movie: 24 గంటల్లో ‘పెద్ది’ ట్రైలర్ బీభత్సం.. హిస్టారికల్ రికార్డ్!
యంగ్ టైగర్‌కు పవర్ స్టార్ బర్త్‌డే విషెస్.. ట్వీట్ వైరల్!
నాకు కాబోయే భర్త ఇండస్ట్రీ వ్యక్తి కాకూడదు: అనన్య నాగళ్ల