హీరోయిజం కాదు.. ఇప్పుడు దర్శకులదే హవా
ABN, Publish Date - Sep 03 , 2026 | 04:38 PM
హీరోల వెంట పడుతూ.. వారు చెప్పినట్టూ వింటూ.. సరైన కథలను దర్శకులు రూపొందించడం లేదని ఎన్నో దశాబ్దాలుగా వినిపిస్తోంది. అందుకే తెలుగు సినిమా సక్సెస్ రేటు తగ్గిందనీ పరిశీలకులు అంటారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి.
హీరోల వెంట పడుతూ.. వారు చెప్పినట్టూ వింటూ.. సరైన కథలను దర్శకులు రూపొందించడం లేదని ఎన్నో దశాబ్దాలుగా వినిపిస్తోంది. అందుకే తెలుగు సినిమా సక్సెస్ రేటు తగ్గిందనీ పరిశీలకులు అంటారు. మళ్ళీ ‘డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్’ (Director Is The Captain) అనే రోజులు రావాలని ఎందరో సీనియర్ డైరెక్టర్స్ భావించేవారు. రాజమౌళి మళ్ళీ పాత రోజులు గుర్తుకు తెస్తూ తానే స్టార్స్‌ను తయారు చేయడం మొదలు పెట్టారు. ఆయన సినిమాలతోనే పలువురు టాలీవుడ్ టాప్ స్టార్స్‌గా మారిన సంగతి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆరంభంలో రాజమౌళి టాలీవుడ్ ఫక్తు ఫార్ములాతోనే సాగినా, తరువాత మెల్లగా తనదైన బాణీ పలికిస్తూ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ పయనిస్తున్నారు. విజయాలు కూడా అదే స్థాయిలో రాజమౌళి (SS Rajamouli)ని వరించాయి. దాంతో ఇతర దర్శకులు సైతం తమదైన స్టైల్ చూపించాలని తపించారు. అలా సక్సెస్ అయిన డైరెక్టర్స్ మాట వింటూ స్టార్స్ కూడా తమ విజయాలను పదిలం చేసుకుంటున్నారు.
రాజమౌళి తరువాత తనకంటూ ఓ స్పెషల్ యూనివర్స్‌ను క్రియేట్ చేసుకున్నవారున్నారు. ‘రంగస్థలం’ తరువాత నుంచీ సుకుమార్ (Sukumar) కూడా తీరు మార్చారు. పల్లెవాతావరణం నేపథ్యంలో మొరటుగా ఉండే హీరో కథలతో సాగి గ్రాండ్ సక్సెస్ చూశారు సుకుమార్. ఇక కన్నడనాట ‘కెజియఫ్’ సిరీస్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించారు ప్రశాంత్ నీల్. ఆ తరువాత ప్రశాంత్ రూపొందించిన ‘సలార్’, ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న ‘డ్రాగన్’లో కలర్ కాంబినేషన్ మొదలు హీరోస్ బాడీ లాంగ్వేజ్‌ను కూడా తాను అనుకున్న తీరునే తీర్చిదిద్దుతున్నారు. నీల్‌తో పనిచేసే హీరోలు సైతం ఆయన పంథాలో పయనించడానికే ఇష్టపడుతున్నారు.
రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్ పంథాలోనే పయనిస్తూ డైరెక్టర్‌గా తనకంటూ ఓ కమాండ్ సంపాదించారు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). తన తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తోనే యూత్‌ను ఆకట్టుకున్న సందీప్, ‘యానిమల్’ మూవీతో మరో మెట్టు పైకెక్కారు. రణబీర్ కపూర్ లాంటి హీరోని సైతం ‘యానిమల్’తో విలక్షణంగా తెరపై ఆవిష్కరించారు. దాంతో సందీప్‌తో సైతం పనిచేయడానికి హీరోలు ఉత్సాహంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ను తెరకెక్కిస్తున్నారు సందీప్. ఈ నలుగురు దర్శకుల చిత్రాల్లో నటించాలని పలువురు స్టార్స్ తపిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ పరభాషా దర్శకుల్లో తమదైన బాణీ పలికిస్తున్న అట్లీ, లోకేశ్ కనగరాజ్ లాంటి వారితో పనిచేయడానికి పూనుకున్నారు. యన్టీఆర్ సైతం తమిళ డైరెక్టర్ వెట్రిమారన్‌తో కలసి పనిచేయాలని ఉందని అన్నారు. ఇలా డైరెక్టర్స్ వెంటే స్టార్స్ పడుతున్న రోజులు వచ్చాయి. ఈ దర్శకుల తాజా చిత్రాలన్నీ విడుదలయ్యాక వాటి ఫలితాలను బట్టి మరింత మంది స్టార్స్ వారి వెంటపడేలా కనిపిస్తోంది. రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, సందీప్ తరువాత వారిలాగా ఎంతమంది టాలీవుడ్ డైరెక్టర్స్ తమకంటూ ఓ బాణీ ఏర్పరచుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ డేట్ ఫిక్స్.. వర్కవుట్ అవుతుందా
Pakeezah: అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో రీస్టోర్డ్ వెర్షన్ ప్రీమియర్
Romanchakam Review: సందీప్ రెడ్డి వంగా.. ‘రోమాంచకం’ మూవీ రివ్యూ