‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ డేట్ ఫిక్స్.. వర్కవుట్ అవుతుందా
ABN , Publish Date - Sep 03 , 2026 | 03:58 PM
భారీ అంచనాల నడుమ ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలోని యాక్షన్ డ్రామా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ మేకర్స్ పెద్ద ప్లానే వేశారు.
భారీ అంచనాల నడుమ ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలోని యాక్షన్ డ్రామా ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ (Toxic: A Fairy Tale for Grown-Ups) మేకర్స్‌కు తీవ్ర నిరాశనే మిగిల్చింది. రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) హీరోగా తెలుగు, కన్నడ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి ఆట నుంచే నెగిటివ్ టాక్ మొదలైంది. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో నిర్మించినప్పటికీ.. కథనంలో పట్టు లేకపోవడం, సాగదీసిన సన్నివేశాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. దీంతో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలోనూ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేక బోల్తా కొట్టిన ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ సాగింది.
ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు అనూహ్యమైన సరికొత్త నిర్ణయంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘టాక్సిక్’ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ‘ఇంగ్లీష్’ వెర్షన్‌లో థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాను రూపొందించే క్రమంలో వాస్తవానికి ఇంగ్లీష్‌లోనే కథను రాయడంతో పాటు పలు కీలక సన్నివేశాలను కూడా ఇంగ్లీష్‌లోనే షూట్ చేశామని మేకర్స్ వెల్లడించారు. అంతేకాకుండా, భారతీయ భాషల్లో విడుదలైన లెంగ్తీ వెర్షన్‌లా కాకుండా, అంతర్జాతీయ అభిరుచులకు తగినట్లుగా చాలా క్రిస్పీగా, షార్ట్ కట్‌తో ఎడిట్ చేసి ఈ సరికొత్త ఇంగ్లీష్ వెర్షన్‌ను సిద్ధం చేశారు. ఇంగ్లీష్ వెర్షన్ సెప్టెంబర్ 4 నుంచి వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి అందుబాటులోకి రానుందని తెలుపుతూ, మేకర్స్ అధికారికంగా ఓ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ‘A Shorter cut of the story you know from the Indian language version.. In cinemas from 4th September, 2026’ అంటూ విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ భాషల్లో భారీ ఎదురుదెబ్బ తిన్న తర్వాత, ఇలా ప్రత్యేకంగా ఇంగ్లీష్‌లో షార్ట్ రన్‌టైమ్‌తో తీసుకురావడం నిజంగా మేకర్స్ చేస్తోన్న పెద్ద ప్రయోగమనే చెప్పాలి. కనీసం ఈ ట్రిమ్ చేసిన ఇంగ్లీష్ కట్‌తోనైనా గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించి నష్టాలను కొంతవరకైనా భర్తీ చేసుకుంటుందా లేదా ఇక్కడా అదే ఫలితం పునరావృతమవుతుందా అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
Pakeezah: అక్టోబర్‌లో ఫ్రాన్స్‌లో రీస్టోర్డ్ వెర్షన్ ప్రీమియర్
Romanchakam Review: సందీప్ రెడ్డి వంగా.. ‘రోమాంచకం’ మూవీ రివ్యూ
యశ్‌ని ‘రామాయణ’ ఏం చేస్తుందో..