తెలుగు సినిమాల్లో డార్క్ హీరోయిజం.. ట్రెండ్ ఇదే కానీ..?
ABN, Publish Date - Nov 28 , 2026 | 10:58 AM
ఏ సినిమాలోనైనా హీరో మంచి వైపే నిల్చుని పోరాడతాడు.. అయితే ఆ పోరాడే తీరులోనే తేడాలు ఉంటాయి. ఆ డిఫరెన్స్ కారణంగానే గ్రే షేడ్స్, డార్క్ షేడ్స్‌తో హీరోల కేరెక్టర్స్ రూపొందుతున్నాయి.
ఏ సినిమాలోనైనా హీరో మంచి వైపే నిల్చుని పోరాడతాడు.. అయితే ఆ పోరాడే తీరులోనే తేడాలు ఉంటాయి. ఆ డిఫరెన్స్ కారణంగానే గ్రే షేడ్స్, డార్క్ షేడ్స్‌తో హీరోల కేరెక్టర్స్ రూపొందుతున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ డార్క్ హీరోయిజం (Dark Heroism) వైపే అడుగులు వేస్తోంది.. ఎందుకో ఆ పయనం? రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తోన్న ‘స్పిరిట్’ (Prabhas Spirit) లో హీరో పోలీసాఫీసర్గానే కనిపించినా, డార్క్ షేడ్స్ ఉంటాయట. యంగ్ టైగర్ యన్టీఆర్ ‘డ్రాగన్’ (NTR Dragon) ట్రైలర్ చూస్తోంటేనే అందులో డార్క్ హీరోయిజమ్ చోటు చేసుకుందని తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘రాకా’ (Allu Arjun Raaka)లో హీరో మూడు పాత్రలు పోషిస్తున్నారు. అందులో ఒకటి పూర్తిగా డార్క్ షేడ్స్‌తో నిండి ఉంటుందట. ఇలా ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నిటా డార్క్ హీరోయిజమ్ కనిపించడానికి కారణమేంటి?. నవతరం ప్రేక్షకుల్లో అత్యధికులు హింసతో కూడుకున్న అంశాలను లైక్ చేస్తున్నారు. హీరో న్యాయం కోసం పోరాడి, చివరకు విజయం సాధించడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఫార్ములానే. అయితే ఆ పోరాటంలో ప్రత్యర్థులను నిర్దాక్షిణ్యంగా చిత్తు చిత్తు చేస్తూ రక్తపు మడుగులు కనిపించేలా సాగితే న్యూ జనరేషన్ భలేగా ఎంజాయ్ చేస్తోంది. సందీప్ తెరకెక్కించిన ‘యానిమల్’, ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ సిరీస్ చిత్రాలు రక్తసిక్తమైన సన్నివేశాలను చూపించే జనాన్ని ఆకట్టుకున్నాయి. అదే తీరున పలు తెలుగు చిత్రాలూ తెరకెక్కాయి.
పాత రోజుల్లో హీరో పాత్ర రాముడు మంచి బాలుడు అన్న రీతిలో ఉండేది.. తరువాత అమాయకుల పక్షాన నిలచి వారిని రక్షించడానికి చట్టాన్ని సైతం అతిక్రమిస్తూ సాగేలా హీరో పాత్రలు రూపొందాయి. ఇప్పుడు అదే కథలను సైతం రక్తం ఏరులై పారేలా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. కేవలం చట్టాన్ని అతిక్రమించి వయలెన్స్ తక్కువగా కనిపించే కథలను ‘గ్రే షేడ్స్’ ఉన్నవి అంటున్నారు. జనానికి కీడు చేసేవారిని హింసించి మరీ చంపుతున్న హీరోని చూసి జనం పులకించిపోతున్నారు. ఇలాంటి ‘డార్క్ హీరోయిజమ్’తోనే కథకులు, దర్శకులు చిత్రాలు రూపొందిస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో హింస అధికంగా ఉండరాదనే నిబంధన ఉండేది.. కానీ, ఇప్పుడు ‘ఏ’ సర్టిఫికెట్ ఇస్తూ ఎంతటి దారుణమైన హింస ఉన్నా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది సెన్సార్ బోర్డ్. ఏదో కొన్ని సందర్భాల్లోనే సెన్సార్ ‘డార్క్ హీరోయిజమ్’ను వ్యతిరేకిస్తూ కట్స్ ప్రతిపాదిస్తోంది.. మిగిలిన సందర్భాల్లో ఆ తీరున సాగిన చిత్రాలే బాక్సాఫీస్‌ను షేక్ చేసేస్తూ ఉండడం గమనార్హం!
సెన్సార్ నియమనిబంధనలకు అనువుగా ఒకప్పుడు హింసను కూడా తెరపై ఆవిష్కరించేవారు మూవీమేకర్స్. ఇప్పుడు మన సినిమాల్లో శ్రుతిమించిన హింస చోటు చేసుకోవడంతోనే ‘డార్క్ హీరోయిజమ్’ మూవీస్ వైపు సినీజనం మనసు పారేసుకుంటున్నారు. స్టార్ హీరోస్ కూడా ప్రేక్షకులు కోరేదే మనం చేయాలన్న ఉద్దేశంతో ఈ తరహా చిత్రాల్లో నటించేస్తున్నారు. కొందరు కథానాయకులు ఇలాంటి పాత్రలు పోషిస్తేనే తమకు స్టార్డమ్ పెరుగుతుందనీ ఆశిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం తెలుగు సినిమాల్లో టాప్ స్టార్స్ అందరి చిత్రాల్లోనూ ఏదో ఒక రూపేణా అతిహింస చోటు చేసుకుంటోంది. ఇది మితిమీరితే జనం వేరేవైపు చూసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఎంతమంది దర్శకనిర్మాతలు గుర్తుంచుకుంటారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
ఎన్టీఆర్, మహేష్, బన్నీ కాదు.. ‘స్పిరిట్’ తర్వాత సందీప్ ప్రాజెక్ట్ ఇదే
‘కాకా’ వర్సెస్ ‘విశ్వంభర’.. కోన వెంకట్, బాబీ పోస్టులతో ఫుల్ క్లారిటీ
హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ సీజన్ 2.. డిటైల్స్ ఇవే