‘రౌడీ అల్లుడు’కు 35 ఏళ్ళు.. గీతా ఆర్ట్స్‌లో సంబరాలు
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:31 PM
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ చిత్రాల గ్రామర్‌ను మార్చేసిన టైమ్‌లెస్ క్లాసిక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రౌడీ అల్లుడు’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమా 35 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతా ఆర్ట్స్‌లో వేడుకలు నిర్వహించారు.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కమర్షియల్ చిత్రాల గ్రామర్‌ను మార్చేసిన టైమ్‌లెస్ క్లాసిక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘రౌడీ అల్లుడు’ (Rowdy Alludu) చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts) పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ కల్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రం విడుదలై 35 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. మూడున్నర దశాబ్దాల మైలురాయిని చేరుకున్న వేళ సంస్థ సభ్యులు, మెగా అభిమానులు నాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.
1991 అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రౌడీ అల్లుడు’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ ‘జానీ’, ఇండస్ట్రియలిస్ట్ ‘కళ్యాణ్’గా చిరంజీవి ప్రదర్శించిన ద్విపాత్రాభినయం సినీ ప్రియులను కట్టిపడేసింది. ఆయన అదిరిపోయే కామెడీ టైమింగ్, స్టైల్, మేనరిజమ్స్, గ్రేస్ అండ్ డ్యాన్స్‌లకు ఈ చిత్రం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాస్ టేకింగ్, ప్రముఖ రచయిత సత్యానంద్ పదునైన సంభాషణలు, కథనం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అందాల భామలు శోభన, దివ్యభారతి హీరోయిన్లుగా మెగాస్టార్‌తో పోటీపడి నటించగా.. డిస్కో కింగ్ బప్పిలహిరి అందించిన పాటలు, నేపథ్య సంగీతం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసి నేటికీ శ్రోతలను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి.
తెలుగు సినీ యవనికపై ఎన్నో మరపురాని దృశ్యకావ్యాలు, ఇండస్ట్రీ హిట్స్ అందించడంలో గీతా ఆర్ట్స్ ఎప్పుడూ అగ్రగామిగానే ఉంటుందనే విషయం తెలియంది కాదు. నాణ్యమైన నిర్మాణ విలువలతో కాలాతీత చిత్రాలను నిర్మించడంలో ఆ సంస్థకున్న తిరుగులేని పట్టుకు ‘రౌడీ అల్లుడు’ 35 ఏళ్ల ప్రయాణమే ప్రత్యక్ష నిదర్శనం. మూడున్నర దశాబ్దాలు గడిచినా టీవీల్లో, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికీ అదే ఫ్రెష్‌నెస్‌తో ప్రేక్షకులను నవ్విస్తూ, అలరిస్తున్న ఈ చిత్రం.. మెగాస్టార్ చిరంజీవికున్న స్టార్డమ్కు, తెలుగు సినిమా మాయాజాలానికి చిరునామాగా నిలిచింది. ప్రస్తుతం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెగా ఫ్యాన్స్.. ఈ సినిమా సన్నివేశాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్ మేకర్స్‌పై రాహుల్ రామకృష్ణ సెటైరికల్ పోస్ట్
తలైవర్ మ్యాజిక్కే వేరు: ‘జైలర్ 2’ సక్సెస్‌పై నెల్సన్
ప్రభుత్వ లాంఛనాలతో.. ముగిసిన దేవా అంత్యక్రియలు