సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నిర్మాత మేలు కోరి షూటింగ్‌కు వస్తానంటున్న బాలయ్య

ABN, Publish Date - Aug 18 , 2026 | 03:33 PM

నందమూరి బాలకృష్ణకు ఇటీవలే మోకాలికి శస్త్ర చికిత్స జరిగింది. డాక్టర్లు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. అయినా నిర్మాత మేలు కోరి బాలకృష్ణ త్వరలోనే షూటింగ్‌ కు సిద్థమౌతున్నారట.

Nandamuri Balakrishna

పలు విషయాల్లో 'తండ్రికి తగ్గ తనయుడు' అనిపించుకున్న బాలకృష్ణ మరోమారు అదే తీరున సాగనున్నారు. మోకాలు ఆపరేషన్ జరిగినా త్వరలోనే షూటింగ్ కు రెడీ అంటున్నారు. అంతేకాదు సినిమాను అనుకున్న రీతిలో పూర్తి చేయాలనీ ఆశిస్తున్నారు. ఆ విశేషమేంటో చూద్దాం.

నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం తగిలింది. డాక్టర్లు శస్త్ర చికిత్స అవసరం అన్నారు. నీ ఆపరేషన్ చేయించుకున్న బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాలుపంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్ లో తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని బాలయ్య ఆశిస్తున్నారు. అలా చిత్రీకరణ పూర్తి కాగానే అక్టోబర్ లో ప్యాచ్ వర్క్, నవంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేయాలని ప్లాన్. డిసెంబర్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను జనం ముందు నిలపాలన్నది బాలయ్య యోచన. అందుకు దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీశ్ కిలారు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.


తండ్రి అడుగుజాడల్లో...

బాలకృష్ణకు ప్రమాదాలు కొత్తకాదు. కెరీర్ ఆరంభంలోనే 'బాబాయ్-అబ్బాయ్' షూటింగ్ లో, ఆ తరువాత 'భార్యాభర్తల బంధం' చిత్రీకరణలో వరుసగా గాయాల పాలయ్యారు.అయినా డెడికేషన్ తో అప్పట్లో ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ సాగారు. ఆ పై 'విజయేంద్రవర్మ' షూటింగ్ లో మోకాలుకే గాయమయింది. అప్పట్లో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ మోకాలుకే ప్రమాదం జరగడంతో డాక్టర్స్ రెండు నెలలు రెస్ట్ తీసుకోమని సూచించారు. అయినా బాలయ్య తనకు బాగయిందని, నిర్మాతకు ఇబ్బంది కలగరాదని షూటింగ్ లో త్వరలోనే పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. నటరత్న యన్టీఆర్ కెరీర్ లోనూ 'పల్లెటూరి పిల్ల' మొదలు, పలుమార్లు చేతికి యాక్సిడెంట్స్ జరిగాయి. దాంతో యన్టీఆర్ కుడిచేతి వేళ్ళకు పట్టు పోయింది. 'సర్దార్ పాపారాయుడు' షూటింగ్ లో మరోమారు అదే చేయికి గాయమయింది. వైద్యులు సూచించినా తన నిర్మాతలకు నష్టం వాటిల్లరాదని యన్టీఆర్ కట్టుతోనే కొన్ని చిత్రాల్లో నటించారు. అదీ యన్టీఆర్ డెడికేషన్. ఆ అంకితభావమే బాలయ్యకూ అబ్బిందని అంటున్నారు సినీజనం.


సరైన తేదీ కావాలి...

బాలయ్యకు డిసెంబర్ మాసం బాగానే కలసి వచ్చింది. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైమ్ భారీ ఓపెనింగ్స్ చూసిన 'పట్టాభిషేకం', అనూహ్య విజయం సాధించిన 'లారీ డ్రైవర్', ప్యాండమిక్ తరువాత జనాన్ని థియేటర్స్ కు రప్పించిన 'అఖండ' చిత్రాలు డిసెంబర్ లోనే రిలీజయ్యాయి. అందువల్లే తాను గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో నటిస్తోన్న రెండో సినిమాను డిసెంబర్ లోనే విడుదల చేయాలని బాలయ్య భావిస్తున్నారు. కాసింత ఆలస్యం చేసి జనవరిలో పొంగల్ బరిలోనే దూకితే మంచిదని కొందరు సూచిస్తున్నారు. అయితే ఈ సారి సంక్రాంతికి పలు చిత్రాలు విడుదలవుతున్నాయి.. ఈ నేపథ్యంలో వారికి దారి ఇచ్చి తన సినిమాను ముందే రిలీజ్ చేస్తే మేలని బాలయ్య అభిలాష. డిసెంబర్ నెలలోనూ భారీ చిత్రాలే వస్తున్నాయి. డిసెంబర్ 3న ప్రభాస్ 'ఫౌజీ' వస్తోంది. ఇక డిసెంబర్ 18న హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ 'అవెంజర్స్ - డూమ్స్ డే, డ్యూన్-3' వస్తున్నాయి. డిసెంబర్ 24న షారుఖ్ ఖాన్ 'కింగ్' రిలీజ్ కానుంది. కాబట్టి సరైన తేదీని చూసుకొని బాలయ్య తన సినిమాను జనం ముందు నిలిపితే మంచిదనీ కొందరి మాట. మరి బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీ ఎప్పుడు ఎలా ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి:

కన్నీళ్లను జయించిన రాజకుమారి.. ‘అగ్నిపరీక్ష’ నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌ వరకు!

వంటగదికే వెళ్లని సమంత మాస్టర్‌చెఫ్‌కి జడ్జ్ ఏంటి!?

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి డేట్ వచ్చేసిందిరోయ్..

Updated Date - Aug 18 , 2026 | 03:35 PM