సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అనిల్ రావిపూడి రూటే సపరేట్.. అందుకేనా అంత సక్సెస్ రేట్!

ABN, Publish Date - Jun 06 , 2026 | 08:55 PM

టాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ రేట్ ఉన్న స్టార్ దర్శకులలో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన సక్సెస్ రేట్‌కు కారణం ఇదేనంటూ సినీ విశ్లేషకులు కొందరు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Anil Ravipudi

టాలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్ రేట్ ఉన్న స్టార్ దర్శకులలో రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi) పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. భారీ బడ్జెట్లు, పాన్ ఇండియా హంగులు, ఏళ్ల తరబడి సాగే షూటింగులతో నిర్మాతల పై భారం మోపడం అతనికి అస్సలు అలవాటు లేదు. కేవలం పెద్ద హీరోల కోసమే ఎదురుచూడకుండా, అందుబాటులో ఉన్న కథానాయకులతో తన పరిధిలో అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను రూపొందించడం అతని శైలి. పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్ల లాభాలను తెచ్చిపెడుతూ, మినిమం గ్యారెంటీ దర్శకుడిగా పరిశ్రమలో నమ్మకమైన బ్రాండ్‌ను సంపాదించుకున్నారు.

గత సంక్రాంతి సీజన్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) చిత్రంతో ఘన విజయం సాధించగా, ఈ ఏడాది ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu)తో మరో సూపర్ హిట్ అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించాడు. వరుసగా మూడో ఏడాది కూడా సంక్రాంతి బరిలోనే నిలవాలనే గట్టి పట్టుదలతో.. విక్టరీ వెంకటేశ్‌ (Victory Venkatesh), నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram)ల కలయికలో ఒక క్రేజీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన కీర్తిసురేశ్, కల్యాణ్‌రామ్‌కు జోడీగా కృతిశెట్టి నటించనున్నట్లు సమాచారం. వచ్చే నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెట్స్ మీదికి వెళ్లనుంది.


ఒక సంక్రాంతికి సినిమాను విడుదల చేసి, వెంటనే తర్వాతి సంక్రాంతికే మరో కొత్త చిత్రాన్ని సిద్ధం చేయడం అనేది ఏ దర్శకుడికైనా ఒత్తిడితో కూడుకున్న వ్యవహారం. ఇంతటి డెడ్‌లైన్ల మధ్య మూవీ స్క్రిప్ట్‌ను పూర్తి చేసినప్పటికీ, అనిల్ ఎంతో తాపీగా టీవీ షోలలో సందడి చేస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా స్టార్ దర్శకులు బుల్లితెర కార్యక్రమాలను అంతగా ఇష్టపడరు, కనీసం తమ సినిమాల ప్రమోషన్ల కోసం కూడా రావడానికి సంకోచిస్తారు. కానీ, అనిల్ మాత్రం ఏకంగా ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ అనే టీవీ షోకు రెండు నెలల పాటు జడ్జిగా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించారు.


ఈ స్థాయిలో డిమాండ్ ఉన్న సమయంలో ఒక రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరించడం సామాన్యమైన విషయం కాదు. ఈ షో ముగిసిన వెంటనే మరో ప్రముఖ టీవీ కార్యక్రమానికి కూడా ఆయన గెస్ట్‌గా హాజరయ్యారు. ఇంత బిజీ షెడ్యూల్‌లో ఇదంతా అవసరమా అనే సందేహాలు రావచ్చు. కానీ, తన ప్రధాన బలమైన కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి, వారి అభిరుచులను క్షుణ్ణంగా అర్థం చేసుకుని తన సినిమాలకు అవసరమైన వినోదాన్ని రాబట్టుకోవడానికే అనిల్ ఈ వేదికలను చక్కగా ఉపయోగించుకుంటున్నాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు అపజయమెరుగని అనిల్.. తన నెక్స్ట్ మల్టీస్టారర్ మూవీతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి మరి.

ఇవి కూడా చదవండి:

నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!

ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!

సినిమా రివ్యూ: హీమాన్ అండ్‌ మాస్టర్స్ ఆఫ్ ది యూనివ‌ర్స్

‘పెద్ది’ పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!

Updated Date - Jun 06 , 2026 | 08:55 PM