సినిమా రివ్యూ: హీమాన్ అండ్‌ మాస్టర్స్ ఆఫ్ ది యూనివ‌ర్స్

ABN , Publish Date - Jun 06 , 2026 | 06:53 PM

‘అవ‌తార్ 3’ త‌ర్వాత అంత‌టి హైప్‌తో హాలీవుడ్ నుంచి వ‌చ్చిన చిత్రం ‘హీమాన్ అండ్‌ మాస్టర్స్ ఆఫ్ ది యూనివ‌ర్స్’. ట్రావిస్ నైట్ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

He Man and the Masters of the Universe

‘అవ‌తార్ 3’ త‌ర్వాత అంత‌టి హైప్‌తో హాలీవుడ్ నుంచి వ‌చ్చిన చిత్రం ‘హీమాన్ అండ్‌ మాస్టర్స్ ఆఫ్ ది యూనివ‌ర్స్ (He-Man And the Masters of the Universe)’. ట్రావిస్ నైట్ (Travis Knight) దర్శకత్వం వ‌హించారు. 1980, 90ల‌లో పిల్లలను, పెద్ద వారిని విశేషంగా అల‌రించిన కార్టూన్స్‌, యానిమేష‌న్స్, వీడియో గేమ్స్ వంటి వాటిని నేటి అధునిక సాంకేతిక‌త‌ను జోడించి ఇటీవ‌ల లైవ్ యాక్షన్‌ రూపంలో తీసుకురావ‌డం ప‌రిపాటి అయ్యింది. ఈ క్రమంలో ఇప్పటికే ‘హౌ టూ ట్రెయిన్ యువ‌ర్ డ్రాగ‌న్‌, డోరా, మోగ్లీ’ వంటి సినిమాలు రిలీజై, మంచి విజ‌యం సాధించాయి. ఈ కోవ‌లోనే ఇప్పుడు నాటి పిల్లల ఫేవరెట్ క్యారెక్టర్ హీమాన్ సైతం లైవ్ యాక్షన్‌ రూపంలో సినిమాగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.


క‌థ:

విశ్వాన్ని శాసించాల‌ని విప‌రీత‌మైన కోరిక‌లు ఉన్న స్కెలిటార్ అనే క్రూర రాక్షసుడు అపార‌ శ‌క్తులు ఉన్న ఓ ఆయుధం కోసం ఎటర్నియా గ్రహంపై దాడి చేస్తాడు. దీంతో అప్పటి వరకూ ప్రశాంతంగా ఉన్న ఆ సామ్రాజ్యం చెల్లా చెదర‌వుతుంది. అయితే రాజు, రాణి ఆ ఆయుధాన్ని చిన్న పిల్లవాడైన త‌మ కుమారుడు యువరాజు ప్రిన్స్ ఆడమ్ చేతికి ఇచ్చి శ‌త్రువులకు ఆచూకీ తెలియ‌కుండా ర‌హాస్యంగా భూమికి పంపించేస్తారు. కానీ త‌న వెంట తెచ్చుకున్న ఆయుధం భూమిపై మిస్ అవుతుంది. కాలక్రమంలో భూమిపై పెరిగి పెద్దవాడైన ఆడ‌మ్.. నిత్యం త‌న చిన్ననాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ ఎలాగైనా తిరిగి త‌న గ్రహానికి వెళ్లాల‌ని ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడ ప్రత్యేక శ‌క్తులు ఉన్న మ‌న‌ుషులు, మాట్లాడే జంతువులు త‌దిత‌ర వింతల గురించి త‌న స‌హ‌చ‌రుల‌కు చెబుతూ ఉంటాడు. కానీ వాటిని ఎవ‌రు నమ్మక, ఆడ‌మ్‌ను తెలివి త‌క్కువ వాడిగా భావిస్తారు. అదే స‌మ‌యంలో, ఓ రోజు మిస్ అయిన త‌న ఆయుధం ఆచూకీ ల‌భించ‌డంతో దానిని తిరిగి తీసుకు వ‌చ్చే క్రమంలో అనుకోని విధంగా ఓ వింత‌ జంతువు దాడి చేస్తుంది. దాని నుంచి త‌ప్పించుకుని, స‌డ‌న్‌గా కనిపించిన త‌న చిన్ననాటి స్నేహితురాలు, సేనాధిప‌తి కూతురు తీలా సాయంతో తిరిగి త‌న గ్రహానికి చేరుకుంటాడు. కానీ అప్పటికే ఆ గ్రహం స‌ర్వనాశ‌నమై ఉంటుంది. అంతేగాక, త‌న త‌ల్లిదండ్రుల‌తో పాటు మ‌రి కొంత‌మంది స్కెలిటార్ చెర‌లో బందీగా ఉండ‌డంతో వారిని ర‌క్షించేందుకు రంగంలోకి దిగుతాడు. ఈ నేప‌థ్యంలో త‌ను శ‌క్తిని తిరిగి ఎలా పొందాడు? హీమాన్‌గా ఎలా మారాడు? శ‌త్రువుల‌ను, స్కెలిటార్‌ను ఏవిధంగా ఎదిరించాడ‌నేది? తెలియాలంటే, థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా చూడాల్సిందే.


విశ్లేష‌ణ‌, న‌టీన‌టుల ప‌ని తీరు:

ఇప్పటికే అంద‌రికీ తెలిసిన క‌థ కావ‌డంతో.. డైరెక్టర్ కొత్త ప్రయోగాల జోలికి వెళ్లకుండా డైరెక్ట్‌గా క‌థ‌లోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. ఎట‌ర్నియా గ్రహాన్ని సైతం అద్భుతంగా క‌ల‌ర్‌ఫుల్‌గా చూపించారు. యాక్షన్‌ స‌న్నివేశాలు సైతం ఆక‌ట్టుకునేలా చిత్రీక‌రించారు. ముఖ్యంగా సైన్యాధిప‌తి డంక‌న్ పాత్ర, విల‌న్ స్కెలిటార్ పాత్రలు సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. హీరో తిరిగి గ్రహానికి వ‌చ్చిన త‌ర్వాత చాలా సంద‌ర్భాల‌లో హీరో, డంక‌న్, ఆయ‌న కూత‌రుల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు న‌వ్వులు పూయిస్తాయి. అయితే.. హీరో భూమిపై పెరిగిన కాలాన్ని ఒక్క ఫ్రేమ్ కూడా చూపించ‌కుండా డైరెక్ట్‌గా పెద్దవాడైనట్లుగా చూపించ‌డం అంత‌గా క‌నెక్ట్ అవ‌దు. అంతేగాక హీరో మిస్ అయినటువంటి త‌న‌ ఆయుధం గురించి ప్రకటన ఇవ్వడం, ఇదిగో ఇక్కడే ఉందంటూ రిప్లై రావ‌డం, హీరో దానిని వెంటనే ఎలాంటి అనుమానాల లేకుండా క్యారీ చేయ‌డం న‌మ్మేలా ఉండ‌దు. అది ఫేక్ ఆయుధం కావ‌చ్చు క‌దా? అనే అనుమానం చూసే ప్రతి ఒక్కరికీ రాక మాన‌దు. ఇక అక్కడక్కడా సెట్స్‌, గ్రాఫిక్స్ మ‌న తెలుగు సినిమాల‌ను గుర్తు చేస్తాయి. ఇక ఇలాంటి క‌థ‌లతో మ‌న చిన్నతనంలోనే ఎన్టీఆర్, కాంతారావు న‌టించిన‌ సినిమాలు అనేకం చూసి ఉండ‌డంతో ఆ సినిమాల‌ స్టోరీనే కాపీ కొట్టారా? అని కూడా అనిస్తుంది. హీరో హీమాన్‌గా నికోలస్ గాలిట్జెన్ (Nicholas Galitzine), డంక‌న్‌గా ఇద్రిస్ ఎల్బా, విల‌న్ స్కెలిటార్‌గా జారెడ్ లెటోలు ఫ‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. హీరోకు తెలుగు హీరో నిఖిల్ సిద్ధార్థ్ అందించిన వాయిస్ కూడా అంత‌గా యాప్ట్‌‌గా లేదు. కానీ డంక‌న్‌కు రావు ర‌మేశ్‌, విల‌న్ పాత్రకు ఆదిత్య మీన‌న్ అందించిన గాత్రాలు బాగా సెట్ అయ్యాయి. వీరి వాయిస్ వ‌ల్ల ఇది తెలుగు సినిమా అనే ఫీల్‌ కొంత కలిగింది. పిల్లలు మాత్రం సినిమాను తెగ ఎంజాయ్ చేస్తారు. చివ‌రిగా.. హీమాన్‌కు సోద‌రి షీ ఉమెన్ కూడా ఉందనే ట్విస్ట్ రివీల్ చేసి ఆడియ‌న్స్‌ను ఆశ్చర్యానికి లోను చేశారు మేకర్స్!

ట్యాగ్‌లైన్: పిల్లలకు పండగే!

రేటింగ్: 2.75/5


ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!

పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!

మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

Updated Date - Jun 06 , 2026 | 06:53 PM