ఫలించిన న్యాయ పోరాటం!
ABN, Publish Date - Apr 17 , 2026 | 05:37 PM
ఐకాన్ స్టార్ మరోసారి న్యాయస్థానం మెట్లెక్కాడు. న్యాయం చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశాడు. అదేంటి.. ఉన్నట్టుండి ఆయనకు అంత అవసరం ఏమొచ్చింది అని అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదివితే మీకే విషయం అర్థమవుతుంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి హెడ్ లైన్స్‌లోకి ఎక్కారు. తన ఇమేజ్‌ను కాపాడుకోవడానికి ఆయన కోర్టు తలుపు తట్టారు. తన అనుమతి లేకుండా ఎవరూ తన పేరు, ఫోటోలు, గొంతు లేదా వీడియోలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇటీవలి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వాయిస్ క్లోనింగ్, ఫోటోల మార్ఫింగ్, డీప్‌ఫేక్ వీడియోలు వంటివి ఎక్కువైపోయాయి. ముఖ్యంగా ఒక సెలబ్రిటీ ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాణిజ్యపరంగా ఉపయోగించడం, ఎ.ఐ. సాయంతో ఫేక్ కంటెంట్ సృష్టించడం వంటివి ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి. ఇలాంటి దుర్వినియోగం వల్ల నటుల బ్రాండ్ విలువ దెబ్బతినడంతో పాటు, తప్పుడు ప్రచారాలు, స్కాములకు కూడా దారి తీస్తోంది. దీంతో ఆ సమస్య తనకు రాకుండా అల్లు అర్జున్ ముందు జాగ్రత్తగా కోర్టును ఆశ్రయించారు.
గతంలో చాలా మంది హీరోలు ఈ తరహా రక్షణ పొందారు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అనిల్ కపూర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ వంటి దిగ్గజ నటులు కూడా ఇప్పటికే పర్సనాలిటీ రైట్స్ రక్షణను పొందారు. ఇక ఇప్పుడు అదే బాటలో అల్లు అర్జున్ కూడా కోర్ట్ తలుపు తట్టారు. తెలంగాణాకు చెందిన అల్లు అర్జున్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంపై న్యాయమూర్తి ప్రశ్నించగా, అల్లు అర్జున్ పేరును ఉపయోగిస్తూ పలు రాష్ట్రాలలో ఫేక్ వాయిస్, ఫోటోలు, మార్ఫింగ్ వీడియోస్ చేస్తున్నారని న్యాయవాది తెలిపారు. అనంతరం జస్టిస్ తుషార్ రావు గెడెల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి, ఆయన వ్యక్తిగత హక్కులను పరిరక్షిస్తూ కీలక తీర్పును ఇచ్చింది. అల్లు అర్జున్ అనుమతి లేకుండా ఆయన పేరు, వాయిస్, ఫోటోలు, సంతకాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడకూడదని తెలిపింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Read Also: Dhurandhar 2: దావూద్‌పై వర్మ సంచలన వ్యాఖ్యలు!
Read Also: దర్శన్ మేనేజర్ ఏడేళ్ల తర్వాత అజ్ఞాతం నుంచి బయటకు