Dhurandhar 2: దావూద్‌పై వర్మ సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:47 PM
ధురంధర్ మూవీలో దావూద్ ఇబ్రహీం పాత్ర పట్ల తనకు భిన్నాభిప్రాయం ఉందని రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దావూద్ ఇబ్రహీం గురించి తనకు తెలిసిన మేరకు ఆయన అలా ప్రవర్తించని వర్మ అభిప్రాయపడ్డారు.
హిందీ సినిమా 'ధురంధర్' (Dhurandhar) విడుదల కాగానే దాన్ని ఆకాశానికి ఎత్తేసిన వ్యక్తులలో ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ (Ramgopal Varma) కూడా ఒకరు. ఆదిత్య ధర్ (Aditya Dhar) మాదిరి తాను సినిమాను తీయలేనని, హిందీ సినిమా గతిని 'ధురంధర్' మార్చేసిందని వర్మ కీర్తించారు. అయితే అంతా బాగానే ఉంది కానీ... 'ధురంధర్ 2'లో దావూద్ ఇబ్రహీం పాత్రను మలిచిన తీరు పట్ల మాత్రం వర్మ ఏకీభవించడంలేదు. ఇటీవల ముంబైకి చెందిన సీనియర్ జర్నలిస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ... దావూద్ ఇబ్రహీం గురించి తన మనసులోని భావాలను వెల్లడించారు.
దాదాపు 70 నిమిషాల నిడివి ఉన్న ఈ ఇంటర్వ్యూలో వర్మ ముంబై అండర్ వరల్డ్‌లోని అనేకానేక అంశాలను విపులంగా విశదీకరించారు. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో వర్మ పలు చిత్రాలు తెరకెక్కించారు. అందులో 'సత్య, కంపెనీ' చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. ముంబై అండర్ వరల్డ్‌కు, సినిమా రంగానికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాలను కూడా వర్మ ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. దావూద్, అతని మనుషులు, డి కంపెనీకి చెందిన వారమని చెప్పుకునే వ్యక్తులు మూడున్నర దశాబ్దాల క్రితం ఎలా బాలీవుడ్‌ను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారో వర్మ విడమర్చి చెప్పారు. వర్మకు సైతం అండర్ వరల్డ్ నుండి బెదిరింపులు వచ్చాయని, దానిని తట్టుకోలేకే ఆయన ముంబై వదిలి హైదరాబాద్ వచ్చేశారని అప్పట్లో అనుకునేవారు. నిజానికి తనకు అలాంటి బెదిరింపులేమీ రాలేదని, కానీ కొందరు గ్యాంగ్‌స్టర్స్ ప్రైవేట్ సంభాషణల్లో తన ప్రస్తావన రావడంతో పోలీస్ అధికారులు తనకు గన్ మ్యాన్ ను ఏర్పాటు చేశారని వర్మ తెలిపారు. తనకేమైనా అవుతుందేమోననే భయంతో తన తల్లి ముంబై వదలి వచ్చేయమని చెబుతుండేదని వర్మ తెలిపారు.
ఈ ఇంటర్వ్యూలో వర్మ అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్స్ చేతుల్లో చనిపోయిన సినిమావాళ్ళ తెర వెనుక కథను వివరించారు. అయితే ఈ మొత్తం ఇంటర్వ్యూలో వర్మ దావూద్ ఇబ్రహీంను వెనుకేసుకు రావడం స్పష్టంగా కనిపించింది. ముంబై బాంబ్ బ్లాస్ట్స్‌తో దావూద్‌కు సంబంధం ఉందని తాను అనుకోవడం లేదని వర్మ చెప్పారు. ఆయన మీద పలు ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే అయినా... అవేవీ నిరూపణ కాలేదని అన్నారు. దావూద్ పేరు చెప్పి చాలా ఘోరాలకు ఆయన అనుయాయులు పాల్పడ్డారని చెబుతూనే, వాటన్నింటిని దావూద్ ఖాతాలో వేయడం సరికాదని తాను భావిస్తున్నట్టు చెప్పారు. పోలీసులతోనూ, నిర్మాతలతోనూ, అండర్ వరల్డ్ క్రిమినల్స్‌తోనూ జరిపిన సంభాషణలను వర్మ ఆసక్తికరంగా వివరించారు.
అదే క్రమంలో 'ధురంధర్ 2' మూవీ గురించి చెబుతూ, 'స్క్రీన్ ప్లే, ఎగ్జిక్యూషన్ పరంగా 'ధురంధర్' ఎక్స్ టార్డినరీ ఫిల్మ్. నాకు పాకిస్తాన్‌లోని అండర్ వరల్డ్ వ్యవహారం గురించి తెలియదు. ఆ సినిమాకు సంబంధించి నేను అంగీకరించలేనిది దావూద్ ఇబ్రహీంను చూపించిన విధానం. ఎందుకంటే నాకు ఆయన గురించి ఓ అవగాహన ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేయదని నేను భావిస్తున్నాను' అని అన్నారు. దాదాపు ఇరవై సంవత్సరాలుగా దావూద్ ఇన్ యాక్టివ్‌గా ఉన్నారని, కాబట్టి ఈ సినిమాలో చూపించిన దాన్ని తాను విశ్వసించలేనని వర్మ చెప్పారు. దావూద్ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది? అలా ఉండటానికి కారణం ఏమిటీ? ఎవరు దానికి కారకులు? అనేవి వేర్వేరు అంశాలని వర్మ చెప్పారు. దావూద్ ఆరోగ్యం బాగోవడం లేదని, ఆయన ఇన్ యాక్టివ్‌గా ఉన్నారని చాలా యేళ్ళుగా తాను వింటున్నానని, తనకు తెలిసినంతలో దావూద్ ఈ సినిమాలో మాదిరిగా ప్రవర్తించరని వర్మ అన్నారు. 'ధురంధర్' సినిమాలో చూపించింది అబద్ధం అని తాను కానీ, అదే నిజమని ఆదిత్య ధర్ గానీ నిరూపించలేమని వర్మ చెప్పారు. ఎవరి సోర్సెస్ వారికి ఉన్నప్పుడు దానికి అనుగుణంగానే అభిప్రాయాలను వెల్లడించగలమని వర్మ అన్నారు. ముంబై అండర్ వరల్డ్ పట్ల లోతైన అవగాహన ఉన్న వర్మ... ఇలా దావూద్‌ను వెనకేసుకుని రావడం ఎంత వరకూ సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు.