దర్శన్‌ మేనేజర్‌ ఏడేళ్ల తర్వాత అజ్ఞాతం నుంచి బయటకు

ABN , Publish Date - Apr 17 , 2026 | 05:11 PM

నటుడు దర్శన్‌ వద్ద ఎన్నో సంవత్సరాలుగా మేనేజర్‌గా పనిచేసిన మల్లికార్జున్‌ కొన్నేళ్ల క్రితం కనిపించకుండా పోయాడు. నిత్యం దర్శన్‌ వెంట ఉండే మల్లికార్జున్‌ అకస్మికంగా ప్రత్యక్షం కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది

నటుడు దర్శన్‌ (Darshan) వద్ద ఎన్నో సంవత్సరాలుగా మేనేజర్‌గా పనిచేసిన మల్లికార్జున్‌ (Mallikarjun)కొన్నేళ్ల క్రితం కనిపించకుండా పోయాడు. నిత్యం దర్శన్‌ వెంట ఉండే మల్లికార్జున్‌ అకస్మికంగా ప్రత్యక్షం కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య అనంతరం దర్శన్‌ మేనేజర్‌ అంశం కూడా కుతూహలమైంది. అతను కూడా హత్యకు గురై ఉండవచ్చుననే కథనాలు వినిపించాయి. మిస్సింగ్‌ అయిన మల్లికార్జున్‌ను వెతకాలనే డిమాండ్‌ వచ్చింది. అయితే ఎలాంటి స్పష్టత లేదు. చివరకు ఆయన గురువారం ఒక్కసారిగా మీడియా ముందుకొచ్చారు. తాను కనిపించకుండా పోయినందుకు గల కారణాలను వివరించారు. వ్యక్తిగత అంశాలు, సినిమాలలో ఆర్థిక వ్యవహారాలతో నష్టపోవడంతో బెంగళూరును వీడి దూరంగా ఉన్నానన్నారు. 18ఏళ్లపాటు సినీరంగంలో సహాయక డైరెక్టర్‌, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసిన ఆయన అనివార్య పరిస్థితుల్లో కొన్నేళ్లుగా ఎవరికి అందుబాటులో ఉండక బతకాల్సి వచ్చిందన్నారు. సుమారు 8 కోట్ల రూపాయల అప్పు చేయగా వాపసు ఇవ్వడం సాధ్యం కాక, కుటుంబంతో సహా బెంగళూరును వీడానన్నారు.

 

పరిస్థితుల కారణంగా ఓడిపోయానని చనిపోలేదన్నారు. రూ.8 కోట్ల అప్పును 20 మందికి పైగా ఇవ్వాల్సి ఉందన్నారు. మీడియాతో కలవడానికి ముందు వారందరినీ కలిశానని, అప్పు మొత్తం వాపసు చేస్తానన్న హామీ ఇచ్చానన్నారు. వారందరినీ క్షమించాలని వేడుకున్నట్టు పేర్కొంటూ రాఘవేంద్రస్వామి ఆశీర్వాదం వల్ల అందరూ సానుకూలంగా స్పందించారన్నారు. హోటల్‌ తదితర వ్యాపారాలు చేసి నష్టపోయానని, అప్పు ఎక్కువైందన్నారు. 8 కోట్ల రూపాయలు వెంటనే ఇచ్చే పరిస్థితి లేదు. విషయం భార్యకు తెలియడంతో చనిపోవాలని పట్టుబట్టారని, మూడు రోజుల పాటు ఇదే విషయం సాగిందన్నారు. అయితే చిన్న బిడ్డ ఉండడంతో అదే యోచనతో ధైర్యం చేయలేదన్నారు. అదే సమయంలో భార్య తమ్ముడికి పెళ్లి నిశ్చయమైందని, ఇలాంటి సందర్భంలో ఆత్మహత్యకు పాల్పడితే అతడి పెళ్లికి ఇబ్బంది కలుగుతుందని వాయిదా వేసుకున్నామన్నారు.

 
2018 జులై 1న బావమరిది పెళ్లి కోసం బయల్దేరామని, అన్నీ వదిలేసి భార్య, బిడ్డతో సిద్ధమయ్యానన్నారు. పెళ్లి ముగిసే సమయానికి తమ కుటుంబంలోని ఒక పెద్దాయనకు తమ విషయం తెలిసిందన్నారు. అయితే ఆయన తమతో ఒట్టు వేయించుకుని చావు ఒక్కటే పరిష్కారం కాదని హితవు పలికారన్నారు.పెళ్లి ముగిశాక జులై 7న తాను ఊరి నుంచి బయల్దేరేవేళ భార్యకు కూడా ఎక్కడికి వెళ్తున్నామనేది తెలియదన్నారు. తాను ఎవరికైతే డబ్బు ఇవ్వాలో వారందరికీ అర్ధరాత్రి 1న మెసేజ్‌ పెట్టి మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేశానని, సిమ్‌ను కుందాపుర వద్ద ఒక నదిలో పడేశానన్నారు. అనంతరం సవదత్తి ఎల్లమ్మను దర్శించుకుని ప్రయాణం ప్రారంభించానన్నారు. 

 
నేపాల్‌లో...

తన స్నేహితుడుని అడగగా రూ.50వేలు ఇచ్చాడని, ప్రస్తుతం అతను లేడని, చనిపోయాడన్నారు. సొల్లాపుర, కొల్హాపుర, కాశీ, నాందేడ్‌, ఇలా పలు ప్రాంతాలలో తిరిగానన్నారు. టూరిస్ట్‌, హోటల్‌, రియల్‌ ఎస్టేట్‌, రిసార్టు ఇలా పలు రకాల పనులు చేశానన్నారు. తనకు హిందీ, ఇంగ్లిష్‌ రావడంతో భాష సమస్య కాలేదన్నారు. చివరకు నేపాల్‌ జనక్‌పురలోని ఒక స్నేహితుడి రిసార్టుకు చేరుకున్నానన్నారు. ఏడేళ్లపాటు అజ్ఞాతవాసం అనుభవించానన్నారు. బంధువు, ఆత్మీయులు, స్నేహితులు లేక ఒంటరిగా జీవించడం కష్టమైందన్నారు. ఇటీవల తన అవ్వ, తల్లిదండ్రులు కన్నుమూసినా రాలేకపోయానన్నారు. తనకు డబ్బు ఇచ్చిన స్నేహితుడు ప్రవీణ్‌కూడా మృతి చెందాడన్నారు. దీంతో తీరని వేదన అనుభవించి వాపసు రావాలని నిర్ణయించుకున్నా అన్నారు. 2025లో వాపసు వచ్చినా, టీబీ, కిడ్నీ స్టోన్‌, స్ట్రోక్‌ కూడా వచ్చిందన్నారు. వీటన్నింటినీ అధిగమించానన్నారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించానన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 05:16 PM