ఫేవరెట్ హీరోతోనే పోటీకి శ్రీవిష్ణు.. ఆ వేవ్‌ను తట్టుకోగలడా?
ABN, Publish Date - Oct 01 , 2026 | 10:05 PM
తన ఫేవరెట్ హీరో అయిన వెంకటేష్‌తో శ్రీవిష్ణు డైరెక్ట్ క్లాష్‌కి దిగడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి సినిమాలు ఒకే రోజున విడుదల కాబోతున్నాయి.
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47’ (Aadarsha Kutumbam House No: 47). గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్స్‌కి రచయితగా పనిచేసిన త్రివిక్రమ్.. తొలిసారి వెంకటేష్‌ను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. నివేధా పేతురాజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, అలాగే ‘నారాయణమ్మ’ పాట సినిమాపై విపరీతమైన క్రేజ్‌ను పెంచేశాయి. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే, ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ నెలకొంది. వెంకటేష్ సినిమా వస్తున్న అదే రోజున, యంగ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) నటిస్తున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan) కూడా పోటీకి దిగుతోంది. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రం 1990ల కాలంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో సాగే కథతో రాబోతోంది. ఇందులో శ్రీవిష్ణు ఒక థియేటర్ ఓనర్‌గా కనిపిస్తుండగా, ఈ కంటెంట్ ఆధారిత సినిమాపై కూడా ఇండస్ట్రీలో మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. తన ఫేవరెట్ హీరో అయిన వెంకటేష్‌తో శ్రీవిష్ణు ఇలా డైరెక్ట్ క్లాష్‌కి దిగడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. విక్టరీ వెంకటేష్‌కి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలియంది కాదు. అలాంటి వెంకీ మామతో అక్టోబర్ 9న పోటీ పడటం అంటే సాధారణ విషయం కాదు. కానీ, ఈ నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు.. ఈ దసరా రేసులో ‘జైలర్ 2, రణబాలి’ లాంటి భారీ పాన్-ఇండియా యాక్షన్ సినిమాలు కూడా లైన్‌లో ఉన్నాయి. ఆ రెండు భారీ సినిమాలతో తలపడటం కన్నా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఒక ‘ఆదర్శ కుటుంబం’తో ఫైట్ చేయడమే కాస్త సేఫ్ ఆప్షన్ అని కామ్రేడ్ కళ్యాణ్ టీమ్ భావించి ఉండవచ్చు. పైగా, పండగ సెలవుల అడ్వాంటేజ్ ఉండటం వల్ల సరిపడా థియేటర్లు, స్పేస్ లభిస్తాయని వారి నమ్మకం. అయితే, శ్రీవిష్ణుకి ఇది కేవలం ఒక పోటీ మాత్రమే కాదు.. అంతకుమించి ఒక సవాల్ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ ఏడాది ఇప్పటికే ‘మృత్యుంజయ్, విష్ణు విన్యాసం’ రూపంలో రెండు ప్లాప్‌లు చూసిన శ్రీవిష్ణుకి, బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోవడానికి ‘కామ్రేడ్ కళ్యాణ్’ విజయం చాలా కీలకం. శ్రీవిష్ణు సినిమాల్లో కామెడీ, ఎమోషన్ కరెక్ట్‌గా కనెక్ట్ అయితే బడ్జెట్ రికవరీ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ వెంకీ మామ మాస్ అండ్ ఫ్యామిలీ వేవ్‌ని తట్టుకుని నిలబడటమే అసలైన టాస్క్. మరి ఈ దసరా పోరులో వెంకీ మామ తన మార్క్ వినోదంతో గెలుస్తాడా? లేక కామ్రేడ్ కళ్యాణ్‌గా శ్రీవిష్ణు సర్‌ప్రైజ్ హిట్ కొట్టి నిలుస్తాడా? అనేది వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
‘కుకూన్స్’కు అనిల్ రావిపూడి సపోర్ట్.. ఏం చేశారంటే
ఫిల్మ్ ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్ వైఫ్.. ఈ వివాదానికి అంతమెప్పుడు?
Jangaa: ‘జంగా’లో మధునందన్ క్యారెక్టర్ పోస్టర్ వైరల్