ఫిల్మ్ ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్ వైఫ్.. ఈ వివాదానికి అంతమెప్పుడు?
ABN , Publish Date - Oct 01 , 2026 | 09:40 PM
‘మా’ ఎన్నికల సమయంలో ఏర్పడిన చేదు జ్ఞాపకాలు ఇంకా మరవకముందే.. ఇప్పుడు టాలీవుడ్‌లో ‘ఫిల్మ్ ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్ భార్య సుమలత’ వివాదం తారస్థాయికి చేరింది.
గతంలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల సమయంలో నెలకొన్న పరస్పర ఆరోపణలు, రచ్చ టాలీవుడ్ పరువును బజారున పడేసేలా చేశాయి. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా మరవకముందే.. ఇప్పుడు టాలీవుడ్‌లో ‘ఫిల్మ్ ఫెడరేషన్ వర్సెస్ జానీ మాస్టర్ భార్య సుమలత’ వివాదం తారస్థాయికి చేరింది. పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ కార్మికులకు అండగా ఉండాల్సిన ఫెడరేషన్, డ్యాన్సర్స్ యూనియన్ మధ్య విభేదాలు రోజురోజుకూ ముదిరి రోడ్డుకెక్కడం ఇండస్ట్రీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ‘మరోసారి టాలీవుడ్‌లో ఇలాంటి రచ్చేంటి?’ అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మెదడులో మెదులుతోంది. ఈ వివాదానికి అసలు ముగింపు ఎప్పుడు?
ఫిలిం ఛాంబర్ వద్ద హైటెన్షన్..
బుధవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వద్ద సుమలత వర్గం మెమోరాండం సమర్పించగా, గురువారం ఫెడరేషన్ నేతలు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ మీడియా సమావేశానికి డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలి హోదాలో హాజరయ్యేందుకు వచ్చిన సుమలత, ఆమె మద్దతుదారులను ఫెడరేషన్ ప్రతినిధులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఛాంబర్ బయట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘‘డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్షురాలినే సమావేశంలోకి రానివ్వరా? ఏం దాస్తున్నారు?’’ అంటూ సుమలత వర్గం తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఇరు వర్గాలు పరస్పరం నినాదాలు, వాదనలకు దిగడంతో ఫిలిం ఛాంబర్ ప్రాంగణం రణరంగంగా మారింది. ఉద్రిక్తతల నడుమే ఫెడరేషన్ ముఖ్య నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో సుమలత తీరుపై, జానీ మాస్టర్ వ్యవహారశైలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మా నాయకుడి జోలికి వస్తే ఊరుకోం: కృష్ణ
‘‘ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేనిపై కొందరు ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తూ మొత్తం సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారు. సుమలత వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే సామరస్యంగా పరిష్కరించుకునే ధోరణి ఆమెలో లేదు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న పరిశ్రమలో వ్యక్తుల పెత్తనం సాగదు. అనవసరంగా ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే ఇక్కడ యూనియన్లు కలిసి పనిచేస్తున్నాయి, ఇండస్ట్రీలో తెలంగాణ-ఆంధ్ర భేదాలు లేవు. సుమలత తన అధ్యక్ష బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించలేకే ఈ రోజు పరిస్థితి ఇంతవరకు వచ్చింది. సుమలత చేస్తున్న చేష్టల వల్లే జానీ మాస్టర్ గౌరవం పోతోంది. గతంలో జానీ మాస్టర్‌కు సమస్య వస్తే ఇదే ఇండస్ట్రీ అండగా నిలబడింది. సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు నిధులు కేటాయిస్తూ, సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్ కట్టిస్తామన్న సమయంలో ఇలాంటి ఆరోపణలు చేయడం దారుణం’’.
ముంబై ఫెడరేషనే మొదట బ్యాన్ చేసింది: లంక రాజేంద్ర ప్రసాద్
‘‘నిన్న ఫిలిం ఛాంబర్ వద్ద కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఫెడరేషన్ ఏనాడూ కార్మికులకు వ్యతిరేకం కాదు. అనిల్ ఏడేళ్లుగా అధ్యక్షుడిగా ఉన్నారు, ఇప్పుడే ఎందుకు వివాదాలు వస్తున్నాయో సభ్యులు ఆలోచించాలి. సీఎం రేవంత్ రెడ్డి కార్మికుల పక్షపాతి. మా నాయకత్వాన్ని ఆదరించి జీవో నెం. 88 ద్వారా సపోర్ట్ ఇవ్వడమే కాకుండా, జీవో నెం. 77 ద్వారా కోటి రూపాయల నిధులను అందించేలా నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 11న సీఎం రేవంత్ రెడ్డితో కార్మికుల భారీ సమావేశం ఉంది. దానికి కార్మికులు రాకుండా చేయాలనే కుట్రతోనే కొందరు పనిగట్టుకుని ఈ వివాదాన్ని రేపుతున్నారు. డ్యాన్సర్స్ యూనియన్‌లో మెజారిటీ సభ్యులదే అంతిమ నిర్ణయం. వాళ్లే స్వచ్ఛందంగా ఎన్నికలు కావాలని కోరారు. అక్టోబర్ 18న ఎన్నికలు జరగాల్సి ఉండగా.. సుమలత అనుచరులతో కేసులు వేయించి స్టేలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చిత్రపురి ప్రాజెక్ట్ మొత్తం విలువే రూ. 750 కోట్లు అయితే.. రూ. 3 వేల కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది? గతంలో ఫెడరేషన్‌కు వచ్చి పెద్దల సమక్షంలో సారీ చెప్పిన జానీ మాస్టర్.. మళ్లీ పాత వివాదాలనే కొనసాగించారు. AIFECలోని ముంబై ఫెడరేషన్ వారు డ్యాన్సర్స్ ఫండ్స్ దుర్వినియోగం చేస్తున్నారనే కారణంతోనే జానీ మాస్టర్‌పై తొలిసారిగా బ్యాన్ విధించారు. AIFECలో అనిల్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు’’.
ఏడుపులు మామూలే.. వివాదాలతో టాలెంట్ నాశనం: అలెక్స్
‘‘హైవేలో వెళ్లే లారీల వెనుక ‘నన్ను చూసి ఏడవకరా.. నీ ఏడుపే నా ఎదుగుదల’ అని రాసి ఉంటుంది. ప్రతి యూనియన్‌లో ఇలాంటి ఈర్ష్యలు, ఏడుపులు ఉంటాయి. జీరో స్థాయి నుంచి కష్టపడి అందరం ఎదిగాం. జానీ మాస్టర్‌కి ఉన్న టాలెంట్‌ను ఎవరూ కాదనలేరు.. కానీ అనవసర వివాదాల వల్ల తన పేరును తానే పాడుచేసుకుంటున్నారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ సమస్య చాలా చిన్నది, దాన్ని కావాలనే పెద్దది చేశారు. నిర్మాతల మద్దతుతో కార్మికులు సజావుగా పనిచేసుకోవాలి’’.
తప్పు జరిగితే కోర్టులకు వెళ్లొచ్చు: వెల్లంకి శ్రీనివాస్ (ఫెడరేషన్ ట్రెజరర్)
‘‘సుమలత ఏకపక్షంగా, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. ఆమెకు నిజంగా అన్యాయం జరిగితే న్యాయస్థానాలకు వెళ్లొచ్చు. డ్యాన్సర్స్ యూనియన్‌లో మెజారిటీ సభ్యులంతా ఎన్నికలు కోరుకుంటున్నారు. పదవులు కోల్పోయిన కొందరు నిరుద్యోగ నాయకులే ఇలాంటి గొడవలకు ఆజ్యం పోస్తున్నారు’’.
తెగని పంచాయితీ.. నష్టపోతున్నది ఎవరు?
ఒకవైపు ‘‘30 ఏళ్ల తర్వాత మహిళా ప్రెసిడెంట్ అయితే తట్టుకోలేకపోతున్నారు, ఫెడరేషన్‌లో అవినీతిని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు, జానీ మాస్టర్‌పై కక్షపూరితంగా సస్పెన్షన్ విధించారు’’ అంటూ సుమలత వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు ‘‘ఎన్నికలు ఎదుర్కోలేక, వ్యవస్థపై అసత్య ఆరోపణలు చేస్తూ కార్మిక ఐక్యతను దెబ్బతీస్తున్నారు’’ అని ఫెడరేషన్ తిప్పికొడుతోంది. సినీ కార్మికుల సంక్షేమం, చిత్రపురి కాలనీ సమస్యలు, కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధుల కేటాయింపులు జరుగుతున్న తరుణంలో.. ఈ అంతర్గత కుమ్ములాటలు పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. ఇరువర్గాల పంతాలు, పట్టింపుల వల్ల రోజువారీ రెక్కాడితే గానీ డొక్కాడని సామాన్య సినీ కార్మికుడు తీవ్ర అయోమయానికి గురవుతున్నాడు. ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు, ఇండస్ట్రీ సీనియర్లు తక్షణమే రంగంలోకి దిగి ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలకకపోతే.. టాలీవుడ్ వర్గపోరు మరింత ముదిరే ప్రమాదముంది.
ఇవి కూడా చదవండి:
Jangaa: ‘జంగా’లో మధునందన్ క్యారెక్టర్ పోస్టర్ వైరల్
పవన్ ‘తీన్‌మార్’ హిట్ కాదని ముందే తెలుసు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
అమల అక్కినేని ఆవిష్కరించిన ‘శివ రూపాయ విష్ణవే’!