‘AA23’ హీరోయిన్ ఫిక్స్? వద్దు బాబోయ్ అంటోన్న ఫ్యాన్స్!
ABN, Publish Date - Jul 22 , 2026 | 03:41 PM
ఒకవైపు ‘రాకా’ సినిమాపై రోజురోజుకూ క్రేజ్ పెరుగుతుండగా, మరోవైపు అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ‘AA23’ చిత్రంపై కూడా మంచి అంచనాలున్నాయి. ఇందులో హీరోయిన్ ఫిక్స్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ (Raaka) అనే భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసిన ‘పుష్ప 2’ (Pushpa 2) వంటి సంచలన విజయం తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో, ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో అత్యంత ఆసక్తి నెలకొంది. మాస్ ఎలిమెంట్స్‌ను తెరపై అద్భుతంగా ఆవిష్కరించే అట్లీ, అల్లు అర్జున్ ఎనర్జీని ఏ స్థాయిలో చూపిస్తారోనని ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 2’ సాధించిన బాక్సాఫీస్ రికార్డులను కూడా ఈ సినిమా అధిగమించి, కొత్త మైలురాళ్లను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.
ఒకవైపు ‘రాకా’ సినిమాపై రోజురోజుకూ క్రేజ్ పెరుగుతుండగా, మరోవైపు అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న ‘AA23’ చిత్రంపై కూడా మంచి అంచనాలున్నాయి. తన మార్క్ డార్క్ థ్రిల్లర్స్, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తీసిన ‘కూలీ’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయినప్పటికీ, ఆయనలోని ప్రతిభను, టేకింగ్‌ను నమ్మిన అల్లు అర్జున్ ఆయనకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. దాంతో ఈ ఇద్దరి కలయికలో రాబోయే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం వస్తున్న ఒక వార్త అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కొంతవరకు ఆందోళనకు గురిచేస్తోంది. ‘AA23’ చిత్రంలో పూజా హెగ్డే (Pooja Hegde)ను కథానాయికగా ఎంపిక చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెకు మిలియన్ల సంఖ్యలో ఫాలోయర్స్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆమె ఇటీవలి చిత్రాల రికార్డు మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయిన పూజాకు, 2022 నుంచి ఇప్పటివరకు సరైన విజయం దక్కలేదు. సక్సెస్ ట్రాక్‌లో ఉన్న కథానాయకుల సరసన నటిస్తూ, వారి ఖాతాలో కూడా ప్లాప్‌లు చేర్చుతోందంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇక 2020లో అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం విదితమే. అయినప్పటికీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్లీ అలాంటి మ్యాజిక్ పునరావృతం కావడం సాధ్యం కాదని, ఆమె ఎంపిక సినిమా క్రేజ్‌ను తగ్గిస్తుందేమోనని బన్నీ అభిమానులు భయపడుతున్నారు. అయితే, మరొక వర్గం మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తూ వేరే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. థియేటర్లకు జనాలు వచ్చేది కేవలం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్‌డమ్, మేనియా కోసమేనని.. కాబట్టి కథానాయిక ఎవరైనా సరే బాక్సాఫీస్ ఫలితంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని వారు స్పష్టం చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ ప్రాజెక్ట్ కోసం పూజా హెగ్డేనే ఎంపిక చేస్తారా? లేక మేకర్స్ మరో హీరోయిన్‌ను ఎంచుకుంటారా అనేది వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి:
ప్రాథమిక పరీక్షల్లో తేలిందిదే.. నందమూరి బాలకృష్ణ హెల్త్ బులిటెన్
దర్శకుడు మెహెర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం
స్పిరిట్ లో కత్రీనా కైఫ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీపూ!