దర్శకుడు మెహెర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం
ABN , Publish Date - Jul 22 , 2026 | 02:08 PM
దర్శకుడు మెహెర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి మెహెర్ జ్యోతి సుంకర మంగళవారం రాత్రి కన్నుమూశారు
దర్శకుడు మెహెర్ రమేష్ (Meher Ramesh) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరి మెహెర్ జ్యోతి సుంకర (Meher Jyothi Sunkara) మంగళవారం (జూలై 21) రాత్రి 9.45కు కన్నుమూశారు. గత 14 రోజులుగా వైరల్ న్యూమోనియాతో బాధపడుతూ విజయవాడలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో అనంత లోకాలకు వెళ్ళిపోయారు. ఈ విషాదకర వార్తను మెహెర్ రమేష్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నప్పటి నుంచి తనకు కొండంత అండగా నిలిచిన అక్క, ఇటీవల తన కూతురి పెళ్లిని కూడా దగ్గరుండి జరిపించారని ఆయన గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల దర్శనం చేసుకుని ఎంతో సంతోషపడిన తన సోదరి, అంతలోనే ఇంత తొందరగా దేవుడి దగ్గరకు వెళ్ళిపోవడం తమ కుటుంబానికి తీరని లోటని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు మెహెర్ రమేష్‌కు తమ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యాన్ని చెప్తున్నారు.
ఇక మెహెర్ రమేష్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన టాలీవుడ్‌లో పలు భారీ చిత్రాలను తెరకెక్కించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘కంత్రి’, ‘శక్తి’.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘బిల్లా’, విక్టరీ వెంకటేష్‌తో ‘షాడో’ వంటి సినిమాలు రూపొందించారు. వీటిలో ప్రభాస్ నటించిన ‘బిల్లా’ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని, గుర్తింపును సాధించింది. చివరిగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సభ్యుడిగా విధులు నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా కుమార్తె వివాహం గ్రాండ్‌గా జరిపించారు. ఈ సమయంలో ఆయన ఇంట్లో ఇలాంటి విషాదం జరగడం ఇండస్ట్రీ వర్గాలను ఎంతగానో కలిచివేస్తోంది.
ఇవి కూడా చదవండి:
స్పిరిట్ లో కత్రీనా కైఫ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీపూ!
బాలయ్యకు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే...
పెళ్లి తరువాత అక్కినేని కోడలు రీఎంట్రీ.. ఆ హీరోతో రొమాన్స్