ప్రాథమిక పరీక్షల్లో తేలిందిదే.. నందమూరి బాలకృష్ణ హెల్త్ బులిటెన్

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:03 PM

నటసింహం నందమూరి బాలకృష్ణకు షూటింగ్‌లో గాయమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్‌లోని Aig ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది.

Balakrishna Nandamuri

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు షూటింగ్‌లో గాయమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్‌లోని Aig ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. రాజమండ్రిలో జరుగుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. వెంటనే ఆయనకు స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక వైద్య చికిత్స అందించారు. మెరుగైన వైద్య పరీక్షలు, ప్రత్యేక చికిత్స కోసం ఆయన్ను ఎయిర్‌లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. తాజాగా బాలయ్య ఆరోగ్యానికి సంబంధించి Aig ఆసుపత్రి హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. కంగారు పడాల్సిన పనేం లేదని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఈ బులిటెన్‌లో డాక్టర్స్ తెలిపారు. Aig ఆసుపత్రి హెల్త్ బులిటెన్‌లో ఏం చెప్పారంటే..


బాలకృష్ణ ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాలలో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలింది. ఇది ఆ ప్రాంతంలో (మజిల్ టేర్) సూచిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం పర్యవేక్షణలో ఆయన విస్తృతమైన క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు చేయించుకుంటున్నారు.

AIG-Hospitals.jpg


నిలకడగా ఆరోగ్య పరిస్థితి...

ఆయన గత వైద్య చరిత్రను దృష్టిలో ఉంచుకుని, తగిన సురక్షితమైన చికిత్సను నిర్ణయించేందుకు వివిధ విభాగాల నిపుణులతో కూడిన మల్టీడిసిప్లినరీ బృందం ఆయన ఆరోగ్యాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత తుది చికిత్స ప్రణాళికను ఖరారు చేయనున్నారు. తదుపరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన NBK111 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్‌లోనే బాలయ్యకు ప్రమాదం సంభవించింది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో NBK112 చిత్రాన్ని బాలయ్య చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

దర్శకుడు మెహెర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం

స్పిరిట్ లో కత్రీనా కైఫ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీపూ!

బాలయ్యకు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే...

Updated Date - Jul 22 , 2026 | 04:03 PM