Makutam: సూర్య - నయనతార మధ్యలో విశాల్!
ABN, Publish Date - Jul 22 , 2026 | 06:07 PM
ఆగస్ట్ రెండోవారంలో ఇప్పటికే ఐదు చిత్రాలు విడుదలకు సిద్థం కాగా ఇప్పుడు విశాల్ స్వీయ దర్శకత్వంలో నటించిన 'మకుటం' కూడా వాటి సరసన చేరబోతోంది. ఈ సినిమాను ఆగస్ట్ 14న విశాల్ విడుదల చేయబోతున్నాడట.
ఈ యేడాది స్వాతంత్ర దినోత్సవ కానుకగా చాలానే సినిమాలు తెలుగులో విడుదల కాబోతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సూర్య, మమిత బైజు జంటగా తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది. సరిగ్గా అదే రోజున నయనతార నటించిన 'హాయ్' సినిమా సైతం తెలుగు, తమిళ భాషల్లో వస్తోంది. ఇదే రోజున ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ మూవీ 'అగథ' వస్తోంది. అలానే తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన 'పళ్ళ బురుసు' విడుదల కానుంది. కేవలం టైటిల్ పోస్టర్ తోనే ఈ సినిమా సోషల్ మీడియా ద్వారా విశేషమైన ప్రచారం జరుపుకుంది. ఎంతో కాలంగా సెన్సార్ ఇక్కట్లును భరించి, ఎట్టకేలకు రివైజింగ్ కమిటీ ద్వారా సర్టిఫికెట్ ను అందుకున్న 'హుషార్ పిట్టలు' సినిమా ఆగస్ట్ 15న విడుదల కాబోతోంది. ఇన్ని సినిమాలు ఇప్పటికే బరిలో ఉండగా... ఇప్పుడు విశాల్ సైతం వాటి మధ్యలో చోటు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ లో ఆర్.బి. చౌదరి నిర్మించిన 99వ చిత్రం 'మకుటం'. ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను ప్రారంభించిన ఆర్.బి. చౌదరి షూటింగ్ పూర్తి కాకముందే రోడ్ యాక్సిడెంట్‌లో కన్నుమూశారు. రవి అరుసు దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాను అనివార్య పరిస్థితుల్లో విశాల్ భుజానికి ఎత్తుకోవాల్సి వచ్చింది. తనే ఈ సినిమాకు దర్శకత్వం వహించి, షూటింగ్ పూర్తి చేశాడు. ఇప్పుడు నిర్మాత ఆర్.బి. చౌదరి కన్నుమూయడంతో... దీనిని విడుదల చేసే బాధ్యతనూ తన భుజానికే ఎత్తుకున్నాడు విశాల్. నటుడిగా ఇది అతనికి 35వ చిత్రం. దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, ఆర్జై కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఆగస్ట్ 14న విడుదల చేయబోతున్నాడట విశాల్. మరి ఇన్ని సినిమాల మధ్యలో 'మకుటం' ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
దర్శకుడు మెహెర్ రమేష్ ఇంట తీవ్ర విషాదం
స్పిరిట్ లో కత్రీనా కైఫ్.. ఏం ప్లాన్ చేశావయ్యా సందీపూ!
బాలయ్యకు ప్రమాదం.. పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే...