Khaidi: కార్తీ కంటే ముందు ‘ఖైదీ’ కథ విన్న హీరో ఎవరో తెలుసా?
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:51 PM
కార్తీ కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఖైదీ’ సినిమాకు తొలుత విజయ్ సేతుపతిని అనుకున్నారట దర్శకుడు లోకేశ్ కనగరాజ్.
కొన్ని సినిమాలు హీరోల కెరీర్‌ను మలుపు తిప్పడమే కాకుండా.. దర్శకులకు కూడా ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తాయి. అలాంటి చిత్రాల్లో తమిళ హీరో కార్తీ నటించిన ‘ఖైదీ’ (khaidi) ఒకటి. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు, లోకేశ్‌ను స్టార్ డైరెక్టర్‌గా మార్చింది. కార్తీ కెరీర్లోనూ ఢిల్లీ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచిపోయింది. అయితే ఈ సినిమాలో తొలుత కార్తీని(Karthi) కథానాయకుడిగా అనుకోలేదట. ఆ అవకాశం మొదట మరో స్టార్ హీరో వద్దకు వెళ్లిందనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
‘ఖైదీ’ కథను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తొలుత విజయ్ సేతుపతికి వినిపించారట. ఈ సినిమాను ఆయనతోనే తెరకెక్కించాలని భావించి చర్చలు కూడా జరిపారట. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ విజయ్ సేతుపతితో పట్టాలెక్కలేదు. ఆ తర్వాత కార్తీ ఈ కథలోకి వచ్చారు. ఈ క్రమంలో కార్తీ స్వయంగా విజయ్ సేతుపతికి ఫోన్ చేసి, ఆ సినిమాలో నటించాలనే తన ఆసక్తిని వ్యక్తం చేశారట. దీంతో విజయ్ సేతుపతి ఏమాత్రం ఆలోచించకుండా ఆ అవకాశాన్ని కార్తీకి ఇచ్చేశారట. అంతేకాదు.. సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారట.
ఈ విషయాన్ని వెల్లడించిన విజయ్ సేతుపతి.. ‘ఖైదీ’ సినిమా తన చేజారిపోయిందని ఎప్పుడూ బాధపడలేదని స్పష్టం చేశారు. “కార్తీ అంటే నాకు ఎంతో గౌరవం. దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తోనూ నాకు మంచి అనుబంధం ఉంది. ‘ఖైదీ’ కథ విన్నప్పుడే ఇదొక అద్భుతమైన సినిమా అవుతుందని అనిపించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం మంచి ఆదరణ పొందుతుందని అప్పుడే ఊహించాను. ఇలాంటి గొప్ప అవకాశాన్ని వదులుకున్నాననే భావన నాకు ఎప్పుడూ కలగలేదు” అని విజయ్ సేతుపతి తెలిపారు.
‘ఖైదీ’లో ఢిల్లీ పాత్రకు కార్తీ తన నటనతో ప్రాణం పోశారు. పాటలు, కథానాయిక, అనవసరమైన కమర్షియల్ హంగులు లేకుండా కేవలం కథ, కథనాలతోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ సినిమా.. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. అయితే విజయ్ సేతుపతి ఈ పాత్రలో నటించి ఉంటే ఎలా ఉండేదన్న ఆసక్తి అభిమానుల్లో కలగడం సహజం. తన సహజమైన నటనతో ఆయన ఢిల్లీ పాత్రకు మరో రకమైన ప్రత్యేకత తీసుకొచ్చేవారేమో!
ALSO READ:
విశాల్‌తో.. ఇక సినిమాలు చేయను! మిష్కిన్ సంచలన వ్యాఖ్యలు!
దర్శకుడిగా మారుతున్న గీత రచయిత కళ్యాణ చక్రవర్తి
ఒకరు శ్రీకాళహస్తిలో.. మరొకరు తిరుమలలో.. ఆలయాల బాట పట్టిన స్టార్స్!