ఒకరు శ్రీకాళహస్తిలో.. మరొకరు తిరుమలలో.. ఆలయాల బాట పట్టిన స్టార్స్!

ABN , Publish Date - Nov 27 , 2026 | 07:12 AM

అక్కినేని నాగచైతన్య శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోగా, హీరోయిన్ మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు.

Naga Chaitanya, Meenakshi Chaudhary

ప్రముఖ సినీ తారలు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఆలయాలను సందర్శిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya Akkineni) శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకోగా.. హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) తిరుమల శ్రీవారి (Tirumala) సేవలో పాల్గొన్నారు. గురువారం ఇద్దరు సినీ ప్రముఖులు వేర్వేరు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామిని గురువారం సినీ హీరో అక్కినేని నాగచైతన్య దర్శించుకున్నారు. ఆలయం వద్ద అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేదపండితులు ఆశీర్వదించి.. స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి

హీరోయిన్ మీనాక్షి చౌదరి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆమె ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీనాక్షి చౌదరి మీడియాతో మాట్లాడుతూ, డిసెంబరు 4వ తేదీన 'వృషకర్మ' సినిమా విడుదల కానుందని, ఈ క్రమంలో శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చానన్నారు. రాబోయే ఏడాది కూడా మంచి ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. అలాగే నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - Nov 27 , 2026 | 07:38 AM