అయ్యో.. అన్వేషణ హీరో ఏంటి ఇలా మారిపోయాడు
ABN, Publish Date - Jun 10 , 2026 | 09:45 PM
'కీరవాణి...చిలకలా కొలికిరో పాడవేమే', 'అదే నువ్వు అదే నేను', 'ఎదుట నీవే.. ఎదలో నీవే' లాంటి సాంగ్స్ వినగానే కళ్ళముందు సీనియర్ హీరో కార్తీక్ (Karthik)ప్రత్యక్షమవుతారు.
'కీరవాణి...చిలకలా కొలికిరో పాడవేమే', 'అదే నువ్వు అదే నేను', 'ఎదుట నీవే.. ఎదలో నీవే' లాంటి సాంగ్స్ వినగానే కళ్ళముందు సీనియర్ హీరో కార్తీక్ (Karthik)ప్రత్యక్షమవుతారు. సీతాకోక చిలుక సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కార్తీక్.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని.. తెలుగు, తమిళ్ భాషలలో ఎన్నో మంచి చిత్రాలలో నటించారు. ముఖ్యంగా వంశీ దర్శకత్వంలో ఆయన నటించిన అన్వేషణ మంచి గుర్తింపు తీసుకొచ్చిపెట్టింది. అదొక్కటే కాకుండా అభినందన, ఘర్షణ ఇలా చెప్పుకుంటూ పోతే కార్తీక్ కెరీర్ లో చాలా సినిమాలు ఉన్నాయి. ఒకప్పుడు లవర్ బాయ్‌గా, స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్... ప్రస్తుతం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
తాజాగా భారతీరాజా భౌతికకాయనికి నివాళులు అర్పించడానికి కార్తీక్ వచ్చారు. తనను ఎంతో ఆదరించిన దర్శకుడి మరణాన్ని తట్టుకోలేక కార్తీక్ ఆయన భౌతికకాయాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ ఆయనను చూసి చాలామంది షాక్ కి గురయ్యారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చాలా కాలం తర్వాత ఇలా మీడియా ముందుకు వచ్చారు. వయసు పైబడటం, ఆరోగ్యం క్షీణించడంతో కార్తీక్ ని చూసి గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది. భారతీరాజా భౌతికకాయాన్ని దర్శించుకోవడానికి కార్తీక్ ఎంతో కష్టపడుతూ, కుంటుతూ నడుచుకుంటూ రావడంతో ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కార్తీక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ప్రస్తుతం కార్తీక్ సినిమాలు పక్కన పెట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. కార్తీక్ కుమారుడు గౌతమ్ కార్తీక్ కూడా హీరోగా కొనసాగుతోన్నాడు. ఇక కార్తీక్ కోడలు, గౌతమ్ భార్య హీరోయిన్ మంజిమా మోహన్ అన్న విషయం తెల్సిందే. అక్కినేని నాగచైతన్య నటించిన సాహసమే శ్వాసగా సాగిపో సినిమాలో మంజిమా హీరోయిన్ గా నటించింది.