Ravi Mohan: భార్యకు నెలకు రూ.40 లక్షల భరణం.. హీరో రవి మోహన్‌కు కోర్టులో చుక్కెదురు
ABN , Publish Date - Jun 10 , 2026 | 07:32 PM
హీరో రవి మోహన్, ఆర్తి దంపతుల విడాకుల కేసు విచారణ చెన్నై ఫ్యామిలీ కోర్టులో సాగుతోంది.
తన భార్య ఆర్తి రవి (Aarthi Ravi) దాఖలు చేసిన కేసు విచారణ పూర్తి చేసేందుకు కింది కోర్టు విధించిన రెండు వారాల గడువు పొడగించాలని కోరుతూ హీరో రవి మోహన్ (Ravi Mohan) దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని చెన్నై కుటుంబ సంక్షేమ న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించలేమని, నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించింది.
హీరో రవి మోహన్, ఆర్తి దంపతుల విడాకుల కేసు విచారణ చెన్నై ఫ్యామిలీ కోర్టులో సాగుతోంది. అయితే, తన పిల్లల చదువులు, కుటుంబ పోషణ నిమిత్తం ప్రతి నెలా రూ.40 లక్షలు భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి గతేడాది జూన్‌లో కోర్టులో పిటిషన్ వేశారు. ఈ భరణం కేసు విచారణ రెండు వారాల్లో పూర్తి చేయాలని కింది కోర్టు గతంలో ఆదేశించింది. ఈ కోర్టు విధించిన గడువును పొడిగించాలని కోరుతూ రవి మోహన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఇది న్యాయమూర్తి అబ్దుల్ ఖుద్దూస్ ముందు విచారణకు రాగా, ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత రవి మోహన్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.
హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన.. రవి మోహన్ విచారం
మద్రాస్ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన వైవాహిక జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను బహిర్గతం చేసినందుకు ప్రముఖ నటుడు రవి మోహన్ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన హైకో ర్టుకు కూడా తెలియజేశారు. రవి మోహన్ - ఆర్తి దంపతుల విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది.
ఈ నేపథ్యంలో రవి మోహన్ గత నెల 16న నగరంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన పిల్లల భద్రత దృష్ట్యా అనేక విషయాలను వెల్లడించారు. దీంతో ఆర్తి హైకోర్టులో కోర్టు ఆదేశాల ఉల్లంఘన పిటిషన్ వేశారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అనేక విషయాలను బహిర్గతం చేశారంటూ ఆమె తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్ గత వారం విచారణకు రాగా రవి మోహన్ కౌంటర్ దాఖలు చేశారు. తన చర్యకు గాను ఆయన కోర్టుకు క్షమాపణలు చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నేను వైవాహిక వివాదం గురించి మీడియాతో మాట్లాడాను. ఇందుకు నేను విచారం వ్యక్తం చేస్తూ, బాధితులందరికీ క్షమాపణలు చెబుతున్నాను' అని పేర్కొన్నారు. దీంతో ఆర్తి పిటిషన్ పై విచారణను హైకోర్టు పూర్తి చేసింది.