Krishnam Raju: ఆరు పదుల.. రెబల్ స్టార్!
ABN , Publish Date - Jun 10 , 2026 | 08:29 PM
ఆ రోజుల్లో ఆరడుగుల హీరో అంటే రెబల్ స్టార్ కృష్ణంరాజు మాత్రమే కనిపించేవారు.
ఆ రోజుల్లో ఆరడుగుల హీరో అంటే రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) మాత్రమే కనిపించేవారు. రెబల్ స్టార్ గా జనం మదిలో నిలచిన కృష్ణంరాజు నటజీవితం నల్లేరుమీద బండినడకలా సాగలేదు. అయితేనేం ఎదురైన అడ్డంకులను చిరునవ్వుతో ఛేదిస్తూ ఆ నాటి అగ్రకథానాయకుల్లో ఒకరిగా రాజ్యమేలారు కృష్ణంరాజు. ఆయన నటజీవితం నిస్సందేహంగా భావితరాలకు స్ఫూర్తిదాయకం అని చెప్పక తప్పదు. నేడు కృష్ణంరాజు భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు. కానీ, ఆయన నటనావైభవం ఈ నాటికీ తెలుగువారి మదిలో చిరస్థాయిగా నిలచే ఉంది. కృష్ణంరాజు నటించిన తొలి చిత్రం చిలకా-గోరింకా (Chilaka Gorinka) విడుదలై అరవై ఏళ్ళు పూర్తయింది. అంటే రెబల్ స్టార్ నటునిగా అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. కృష్ణంరాజు ప్రస్తుతం లేరు కదా అనుకుంటే తెలుగువారి మది నుండి ఆయనను వేరు చేయగలవారెవరు?
తొలి సినిమా 'చిలకా-గోరింకా'లోనే హీరోగా నటించారు కృష్ణంరాజు. ఆయనకు జోడీగా నటించిన వారు ఆ నాటి మేటి నటి కృష్ణకుమారి. యన్టీఆర్, ఏయన్నార్, కాంతారావు, జగ్గయ్య వంటి మేటి నటులకు హిట్ పెయిర్ గా రాణించిన కృష్ణకుమారి సరసన నాయకునిగా నటిస్తూ చిత్రసీమలో అడుగు పెట్టిన కృష్ణంరాజును చూసి నాటి వర్ధమాన కథానాయకులు ఈర్ష్య పడ్డారు. ప్రముఖ దర్శకనిర్మాత కె.ప్రత్యగాత్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'చిలకా - గోరింకా' 1966 జూన్ 10న విడుదలయింది. ఈ చిత్రంతోనే రమాప్రభ కూడా నటిగా పరిచయం అయ్యారు. ఇందులో అంజలీదేవి, ఎస్వీ రంగారావు, వాసంతి, రమణారెడ్డి, పద్మనాభం, నిర్మలమ్మ, చదలవాడ వంటి పేరున్న నటీనటులు నటించారు. ఈ చిత్రానికి యస్.రాజేశ్వరరావు సంగీతం సమకూర్చగా, శ్రీశ్రీ పాటలు రాశారు. ఘంటసాల, పి.సుశీల నేపథ్యగానం చేశారు. వీరితో పాటు జానకి, జయదేవ్ కూడా పాలు పంచుకున్నారు. ఎన్ని సొబగులు అద్దినా 'చిలకా గోరింకా' ఆకట్టుకోలేకపోయింది.
తొలి చిత్రంలోనే కథానాయకునిగా అవకాశం రావడం అదృష్టంగా భావించిన కృష్ణంరాజుకు 'చిలకా-గోరింకా' పరాజయం పెద్ద దెబ్బ వేసింది. సక్సెస్ చుట్టూ పరిభ్రమించే చిత్రసీమలో కృష్ణంరాజును చాలామంది జాలిగాచూశారు. ఆ జాలిచూపులను తట్టుకొని తానేమిటో చిత్రసీమలో చాటుకోవాలని నిర్ణయించుకున్నారు కృష్ణంరాజు. అందుకు ఆయన తండ్రి వీరవెంకట సత్యనారాయణ రాజు, తమ్ముడు సూర్యనారాయణరాజు దన్నుగా నిలిచారు. తాను ఊరికి రాజయిన వారింట పుట్టిన బిడ్డనని, చిత్రసీమలోనూ అలాగే సాగాలని కృష్ణంరాజు భావించలేదు. ఓ నటునిగా రాణించాలన్న తపనతోనే ముందుకు సాగారు. లభించిన చిన్నాచితకా వేషాలు కూడా వేశారు. ప్రతినాయకునిగా, ఉపనాయకునిగా, గుణచిత్ర పాత్రల్లోనూ నటించి మెప్పించారు రాజు. ఆ క్రమంలో మళ్ళీ కృష్ణంరాజును హీరోగా పెట్టి కొందరు నిర్మాతలు సాహసం చేశారు. కానీ, అవేవీ కలసి రాలేదు.
ఆ సమయంలో మిత్రుల సహాయసహకారాలతో గోపీకృష్ణా మూవీస్ నెలకొల్పారు. తరువాతి రోజుల్లో ప్రముఖ నిర్మాతగా నిలచిన చలసాని గోపి నిర్మాతగా, కృష్ణంరాజు సమర్పకునిగా 'కృష్ణవేణి' చిత్రం నిర్మించారు. కన్నడలో విజయం సాధించిన 'శరపంజర' రీమేక్ ఇది. ఈ చిత్రానికి రీమేక్స్ లో కింగ్ అనిపించుకున్న వి.మధుసూదనరావును దర్శకునిగా ఎంచుకున్నారు. ఆ రోజుల్లో టాప్ హీరోయిన్ గా సాగుతోన్న వాణిశ్రీని నాయికగా ఎంపిక చేసుకున్నారు. రంగుల్లో చిత్రాన్ని నిర్మించడం అప్పట్లో సాహసమే. అయినా కృష్ణంరాజు, చలసాని గోపి ముందుకే సాగారు. విజయవంతంగా 'కృష్ణవేణి' చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో హీరోగా కృష్ణంరాజుకు గుర్తింపు లభించింది.
ఆ పై తమ్ముడు సూర్యనారాయణ రాజు నిర్మాతగా గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ పైనే 'భక్త కన్నప్ప' నిర్మించి నటించారు కృష్ణంరాజు. అందులోనూ వాణిశ్రీయే నాయిక. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలచింది. దాంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగారు కృష్ణంరాజు. తరువాత కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'అమరదీపం' చిత్రం నిర్మించి నటించారు. ఈ సినిమా సైతం హిట్ గా నిలచింది. ఈ సినిమాతో ఉత్తమ నటునిగా నంది అవార్డు అందుకున్న తొలి హీరోగా నిలిచారు కృష్ణంరాజు. ఆ తరువాత దాసరి నారాయణరావు కృష్ణంరాజుకు అంతకు ముందు ఉన్న నెగటివ్ షేడ్స్ తోనే కేరెక్టర్స్ క్రియేట్ చేసి "కటకటాల రుద్రయ్య, రంగూన్ రౌడీ" చిత్రాలు రూపొందించారు. ఈ సినిమాల ఘనవిజయంతో కృష్ణంరాజు 'రెబల్ స్టార్'గా జనం మదిలో నిలిచారు.

'రెబల్ స్టార్' కృష్ణంరాజుకు జనాల్లో విశేషాదరణ లభించసాగింది. ఆయనతో సినిమాలు తీసి ఎంతోమంది నిర్మాతలు విజయాలను చూశారు. సొంత చిత్రం 'బొబ్బిలి బ్రహ్మన్న'తో మరోమారు ఉత్తమ నటునిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు రాజు. నటునిగా ఎన్నెన్నో అరుదైన విజయాలు చవిచూసిన కృష్ణంరాజు తరువాత రాజకీయాల్లోనూ అడుగు పెట్టారు. 1992లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ పై నరసాపురం లోక్ సభ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1998లో భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా కాకినాడ లోక్ సభ స్థానం నుండి విజయం సాధించారు. 1999లో బీజేపీ అభ్యర్థిగానే నరసాపురం లోక్ సభ నియోజక వర్గం నుండి విజయం సాధించి, ఎక్స్ టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా పనిచేశారు. 2004లో అదే నియోజకవర్గం నుండి ఓటమి పాలయ్యారు. చిరంజీవి నెలకొల్పిన 'ప్రజారాజ్యం' పార్టీ అభ్యర్థిగా 2009లో రాజమండ్రి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి చేదు అనుభవాన్నే చవిచూశారు.
రాజకీయాల్లో ఉంటూనే తనదరికి చేరిన పాత్రలను పోషించారు కృష్ణంరాజు. అదే సమయంలో ఆయన నటవారసునిగా తమ్ముని తనయుడు ప్రభాస్ ను 'ఈశ్వర్' చిత్రంతో పరిచయం చేశారు. తన నటవారసుడు ప్రభాస్ తో కలసి "బిల్లా, రెబల్, రాధేశ్యామ్" చిత్రాల్లో నటించారు కృష్ణంరాజు. ప్రస్తుతం మన మధ్య లేకపోయినా నటునిగా, నిర్మాతగా తెలుగువారికి ఆయన అందించిన చిత్రాలు ఇప్పటికీ జనం మదిలో నిలచే ఉన్నాయి. ఈ నాటికీ 'రెబల్ స్టార్' అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కృష్ణంరాజే !