రజనీతో రజనీకే పోటీ.. టాప్-3లో ఒకడే కింగ్
ABN, Publish Date - Oct 26 , 2026 | 11:19 AM
హుకుమ్.. టైగర్ కా హుకుమ్ అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ముత్తువేల్ పాండియన్, ఇప్పుడు మరింత పవర్ఫుల్ అవతారంలో వచ్చి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు
బాక్సాఫీస్ వద్ద రికార్డులు రాయాలన్నా.. ఆ రికార్డులను తిరగరాయాలన్నా అది కేవలం ఒక్క సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth)కు మాత్రమే సాధ్యం. హుకుమ్.. టైగర్ కా హుకుమ్ అంటూ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ముత్తువేల్ పాండియన్, ఇప్పుడు మరింత పవర్ఫుల్ అవతారంలో వచ్చి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ (Jailer 2). అనౌన్స్మెంట్ నుంచే ఆకాశాన్నంటిన అంచనాలు.. రిలీజ్ తర్వాత ఒక్కసారిగా సునామీలా మారాయి. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
కోలీవుడ్ (Kollywood) హిస్టరీలోనే అత్యంత వేగంగా భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘జైలర్ 2’, తాజాగా మరో చరిత్ర సృష్టించింది. తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, కోలీవుడ్ సినీ చరిత్రలోనే ఆల్ టైమ్ టాప్ 2 గ్రాసర్‌గా ‘జైలర్ 2’ నిలిచింది. ఇప్పటివరకు ఉన్న ట్రేడ్ లెక్కలను పరిశీలిస్తే, దాదాపు 700 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను అత్యంత వేగంగా దాటేసి సరికొత్త మైలురాయిని అందుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో, సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోందీ చిత్రం. ఇక తెలుగులోనూ ‘జైలర్-2’ చిత్రం రూ. 100 కోట్ల కలెక్షన్స్‌ను బీట్ చేసి సరికొత్త రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఇక్కడ అసలైన విశేషం ఏంటంటే.. కోలీవుడ్ ఆల్ టైమ్ టాప్ 3 సినిమాల లిస్ట్ తీస్తే, అక్కడ కనిపించేది కేవలం రజనీకాంత్ పేరు మాత్రమే. శంకర్ దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ 2.0 ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. సుమారు 800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్‌తో అగ్రపీఠాన ఆ చిత్రం కొనసాగుతోంది. ఇప్పుడు సరికొత్తగా ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న ‘జైలర్ 2’.. దాదాపు 700 కోట్ల మార్కుతో అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఇక దీని తర్వాత స్థానంలో అంతకుముందు సంచలనం సృష్టించిన ‘జైలర్’ పార్ట్ 1 సుమారు 650 కోట్ల గ్రాస్‌తో నిలిచింది.
దీన్నిబట్టి చూస్తే తమిళ చిత్ర పరిశ్రమలో రికార్డుల వేట అంటే ఇతరులతో పోటీ కాదు.. పూర్తిగా రజనీకాంత్ వర్సెస్ రజనీకాంత్ మాత్రమే అని స్పష్టంగా అర్థమవుతోంది. తన రికార్డులను తనే బద్దలు కొట్టుకుంటూ, తనతో తనే పోటీ పడుతూ బాక్సాఫీస్ రారాజుగా నిలిచారు. ‘జైలర్’ మొదటి భాగంలో రజనీకాంత్‌లోని వింటేజ్ స్వాగ్‌ను బయటకు తీసి.. సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు నెల్సన్, ఈ సీక్వెల్లో మరింత బలమైన ఎమోషన్, అదిరిపోయే ఎలివేషన్లతో కథను నడిపించారు. అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. సూపర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, నెల్సన్ మార్క్ డార్క్ హ్యూమర్, పక్కా మాస్ అంశాలు తోడవడంతో అన్ని వర్గాల ప్రేక్షకులూ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, జైలర్ 2 జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. రానున్న రోజుల్లో ‘2.0’ సాధించిన 800 కోట్ల రికార్డును కూడా బీట్ చేసి నంబర్ వన్ స్థానాన్ని చేరుకుంటుందనేలా ట్రేడ్ వర్గాల్లో సైతం టాక్ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి:
సూర్యకు ఈ ఏడాది త్రిపుల్ ధమాకా.. అదే జరిగితే హిస్టరీనే
అలరిస్తున్న ‘తోట తరణి - ఒక పునరావలోకనం’ ప్రదర్శన
ఐదేళ్ల తర్వాత మళ్లీ.. రజనీకాంత్ ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్