సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సుహాస్ రంగుపై కామెంట్స్‌తో వివాదం.. ‘మండాడి’ డైరెక్టర్ వివరణ ఇదే!

ABN, Publish Date - Sep 18 , 2026 | 07:05 PM

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ సమర్పణలో మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మండాడి’. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో దర్శకుడి వ్యాఖ్యలు కాంట్రవర్సీ అవడంతో.. వెంటనే ఆయన వివరణ ఇచ్చారు.

Mathimaran Pugazhendhi on Controversy

ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ సమర్పణలో మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మండాడి’ (Mandaadi). టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ (Suhas), కోలీవుడ్ స్టార్ సూరి (Soori) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలోకి వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, సినిమా సక్సెస్ మీట్ వేదికగా దర్శకుడు మదిమారన్ పుగళేంది చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీశాయి.

అసలేం జరిగింది?

చెన్నైలో జరిగిన ‘మండాడి’ సక్సెస్ మీట్‌లో దర్శకుడు మదిమారన్ (Mathimaran Pugazhendhi) మాట్లాడుతూ.. ‘‘సుహాస్ తమిళ పరిశ్రమలోకి రాకముందు, తన సొంత ఇండస్ట్రీలో (టాలీవుడ్‌లో) స్కిన్ టోన్ (రంగు) పరంగా కొన్ని జాతి వివక్ష వ్యాఖ్యలను ఎదుర్కొని చాలా బాధపడ్డాడు. కానీ తమిళనాడులో అలాంటివి ఉండవు.. తమిళ ప్రేక్షకులు అతడి రంగును ఎంతగానో ప్రేమించారు. ఇక్కడ సుహాస్ పోషించిన పాత్రను అందరూ నెత్తిన పెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమా హిట్టయితే ఆ కామెంట్లకు సమాధానం ఇస్తానని అప్పుడే సుహాస్‌కు ప్రామిస్ చేశాను’’ అని వ్యాఖ్యానించారు.


ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతోనే తెలుగు సినీ అభిమానులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ స్థాయి నుంచి సొంత టాలెంట్‌తో హీరోగా ఎదిగిన సుహాస్‌ను తెలుగు ప్రేక్షకులు ఎల్లప్పుడూ గుండెల్లో పెట్టుకున్నారని, ‘కలర్ ఫోటో’, ‘రైటర్ పద్మభూషణ్’, ‘ప్రసన్నవదనం’ వంటి ఎన్నో చిత్రాల ద్వారా అతడిని అక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు. తమిళంలో సినిమాను హైప్ చేసుకోవడానికి తెలుగు ఇండస్ట్రీని, తెలుగు ప్రేక్షకులను కించపరిచేలా ఇలా మాట్లాడటం సిగ్గుచేటంటూ దర్శకుడిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. మరోవైపు, సుహాస్ కూడా ఎప్పుడూ తన సొంత పరిశ్రమ గురించి ఇలాంటి మాటలు మాట్లాడలేదని, ఆయన పేరును ఉపయోగించుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు కౌంటర్లు ఇచ్చారు.


క్షమాపణలు చెబుతూ డైరెక్టర్ పోస్ట్

ఈ వివాదం పెను దుమారంగా మారడంతో దర్శకుడు మదిమారన్ పుగళేంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వివరణాత్మక పోస్ట్ పెట్టారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తెలుగు పరిశ్రమను లేదా అక్కడి ప్రేక్షకులను కించపరచడం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ‘‘నేను మాట్లాడిన మాటలు ఎవరి మనోభావాలనైనా గాయపరిచి ఉంటే క్షమించండి. నా మాటలు ఎప్పుడూ తెలుగు సినిమాను కానీ, తెలుగు ప్రేక్షకులను కానీ ఉద్దేశించినవి కావు. సుహాస్ అనే ఒక ప్రతిభావంతుడైన నటుడి ఎదుగుదల గురించి, ఆయన తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న వ్యక్తిగత విమర్శల గురించి మాత్రమే నేను ప్రస్తావించాను. ప్రతిభకు భాషా, ప్రాంతీయ భేదాలు ఉండవని.. నటనను అభిమానించే విషయంలో తమిళ, తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారని చెప్పడమే నా ఆంతర్యం. నన్ను, మా చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఆదరిస్తున్నారు. దయచేసి నా మాటలను సందర్భానికి తగినట్లుగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను’’ అంటూ ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

ఇక ఈ వివాదంపై టాలీవుడ్ ప్రేక్షకులు శాంతిస్తూనే, పరభాషా దర్శకులు ప్రమోషన్స్ కోసం వేరే పరిశ్రమను కించపరిచే ధోరణిని మానుకోవాలని హితవు పలుకుతున్నారు. సుహాస్ వంటి నేచురల్ యాక్టర్‌కు టాలీవుడ్ ఎప్పుడూ బలమైన పునాదిగానే నిలిచిందని మరోసారి గుర్తుచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

టైర్ 2 హీరోస్ థియేట్రికల్ బిజినెస్.. ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్!

‘జాంబీ రెడ్డి 2’లో రియల్ స్టార్ ఉపేంద్ర.. ఫస్ట్ లుక్ చూస్తే వణకాల్సిందే

ఈ పాట కోరిన వారు... మూవీ రివ్యూ

Updated Date - Sep 18 , 2026 | 07:05 PM