ఈ పాట కోరిన వారు... మూవీ రివ్యూ

ABN , Publish Date - Sep 18 , 2026 | 03:57 PM

తెలుగులో వచ్చిన లాంగెస్ట్ టైటిల్ మూవీ 'ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి...'. చంద్రసిద్ధార్థ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సీపీఐ నాయకుడు రామకృష్ణ కుమారుడు హర్ష హీరోగా నటించారు.

Ee Pata Korinavaaru Nemalipalem Nundi Movie

ప్రముఖ దర్శకుడు చంద్రసిద్ధార్థ్‌ తెరకెక్కించినవి కొన్ని సినిమాలే అయినా... అందులో 'ఆ నలుగురు, అందరి బంధువయా, మధుమాసం' వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఎనిమిదేళ్ళ క్రితం 'ఆట గదరా శివ' తీసిన చంద్రసిద్దార్థ్‌ మళ్ళీ ఇప్పుడు తెలుగులో అతిపెద్ద టైటిల్‌ ఉన్న మూవీతో జనం ముందుకొచ్చారు. ఆ సినిమానే 'ఈ పాట కోరిన వారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళీ, కబీర్, డోల్ రవి మొదలగువారు'. 'ఎ ఫర్ బిడెన్ రాగ ఫ్రమ్ ఎ ఫర్ బిడెన్ సాగా' అనేది ట్యాగ్‌ లైన్‌. ఈ టైటిల్‌, ట్యాగ్ లైన్ చదివిన తర్వాత ఎవరైనా గట్టిగా ఊపిరి పీల్చి వదలాల్సిందే! ఈ సినిమాను చంద్రసిద్ధార్థ్‌ తో కలిసి వై.వి. సత్యనారాయణ రాజు, అగస్త్య మంజు, సాగర్‌, మహి ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీతో ప్రముఖ సీపీఐ నాయకుడు కె. రామకృష్ణ కుమారుడు హర్ష హీరోగా పరిచయం అయ్యారు. మరి ఈ లాంగెస్ట్ టైటిల్‌ మూవీ ఎలా ఉందో తెలుసుకుందామా...


ఇది 1995 నాటి కథ. మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్న సాగర్ (హర్ష) అమెరికాలో ఉండే తన డాక్టర్ అన్నయ్య (రవివర్మ) సలహా మేరకు రాజమండ్రి ఔట్ కట్స్ లోని గెస్ట్ హౌస్‌లో నివసిస్తుంటాడు. అతని బాగోగుల్ని నీలి (రేఖా నిరోషా), దాము (అశోక్‌ వర్థన్‌) చూసుకుంటూ ఉంటారు. అర్థరాత్రి నిద్రలో ఉలిక్కిపడి లేచే సాగర్ ను ఓ పాట నిరంతరం హంట్‌ చేస్తుంటుంది. అతని దగ్గర ఉన్న రేడియోలో ప్రతి రోజు రాత్రి పది తర్వాత ఆ పాటను 'నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళీ, కబీర్‌, డోల్‌ రవి మొదలగువారు' కోరినట్టుగా ప్రసారం అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఓ యువతి తనను వెంటాడుతూ, వేటాడటానికి వస్తున్నట్టు సాగర్ కల కంటూ ఉంటాడు. కొద్ది రోజులకు నీలి, దాము పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవడంతో సాగర్... ఈ పాటను ఆ బృందం ఎందుకు కోరుకుంటోంది? రేడియోలో అదే సమయంలో ఆ పాటను ఎందుకు ప్లే చేస్తున్నారు? ఆ పాట కారణంగా తానెందుకు డిస్ట్రబ్‌ అవుతున్నాడో తెలుసుకోవాలని అనుకుంటాడు. రేడియో స్టేషన్ కు వెళ్ళి తెలుసుకుంటే.. నెమలిపాలెం అనే గ్రామం నుంచి తమకు రెగ్యులర్ గా పోస్ట్ కార్డ్స్ వస్తున్నాయని, అందుకే ఆ పాటను ప్లే చేస్తున్నామని ఆర్.జె. కావేరి (ఇనయా సుల్తానా) చెబుతుంది. దాంతో తిమ్మాపురం సమీపంలోని నెమలిపాలెం గ్రామానికి సాగర్‌ బయలుదేరతాడు. అక్కడ సాగర్‌ కు ఎదురైన అనుభవం ఏమిటీ? అసలు మనుషులే లేని నెమలిపాలెం నుంచి రేడియో స్టేషన్ కు ఉత్తరాలు ఎలా వస్తున్నాయి? ఈ ప్రైవేట్ సాంగ్ ను స్వరపర్చిన మ్యూజిక్‌ బ్యాండ్‌ సభ్యులు ఏమయిపోయారు? వారి వెనుక ఉన్న మిస్టరీ ఏమిటీ అనేది మిగతా కథ.


దర్శకుడిగా చంద్రసిద్ధార్థ్‌కు గొప్ప పేరు తీసుకొచ్చిన చిత్రం 'ఆ నలుగురు'. ఆ సినిమా కథను మదన్ సమకూర్చారు. స్వర్గీయ మదన్ అప్పట్లో రాసిన కథను ఆధారంగా చేసుకుని చంద్రసిద్ధార్థ్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. దీనికి 'పాత్రికేయ' కథాసహకారం అందించారు. ఈ సినిమా రెండు రకాలుగా ఉంది. ప్రథమార్ధం సాగర్‌ ను వెంటాడే గతం, దానికి తాలుకూ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. దాన్ని సాల్వ్ చేయడానికి సాగర్ నడుం కట్టడంతో ఫస్ట్ హాఫ్‌ పూర్తవుతుంది. ఈ భాగమంతా ఓ స్పెషల్ టోన్‌లో ఉంది. సీనియర్ డైరెక్టర్ వంశీ తీసిన 'అన్వేషణ, ఆలాపన' చిత్రాలను చూస్తున్న భావన కలుగుతుంది. ద్వితీయార్థం ఆరుగురు సభ్యులున్న ఓ మ్యూజిక్‌ బ్యాండ్‌లో స్నేహం, ప్రేమ, ఈష్య, ద్వేషం చోటు చేసుకోవడంతో ఏర్పడే స్పర్థలు ప్రధానంగా కథ సాగుతుంది. ఈ క్రమంలో రాజమండ్రిలో వచ్చిన వరదలు, అందులో బ్యాండ్‌ మెంబర్స్ మిస్ కావడం.. బ్రతికి ఉన్న నందు గతాన్ని మర్చిపోవడం... తిరిగి అతనికి గతాన్ని గుర్తు చేయడానికి రమ (అమైరా గోస్వామి) ప్రయత్నించడం జరుగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో ఉండే థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ సెకండ్‌ హాఫ్‌ లో ఉండవు. అసలుకథను ద్వితీయార్థంలో ప్రారంభించడంతో ప్రధానమైన పాత్రల్నీ ఒక్కసారిగా తెరమీద ప్రత్యక్షమై, ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వారి మధ్య ఉండే ప్రేమానుబంధం, తద్వారా ఏర్పడే అసూయలను ఎస్టాబ్లిష్‌ చేయడానికి దర్శకుడికి టైమ్‌ సరిపోలేదు. ప్రథమార్థంలోని సన్నివేశాలను కాస్తంత ట్రిమ్ చేసి, అసలు కథను అక్కడే మొదలు పెట్టి, ద్వితీయార్థాన్ని మరింత రిలవెంట్‌గా, కన్వెన్సింగ్‌గా తీసి ఉంటే బాగుండేది. సాగర్ పట్ల నీలికి ఎందుకంత అబ్సెషనో అర్థం కాదు. రమ తన గతాన్ని చెప్పగానే సాగర్ ఆమెను ఠక్కున పెళ్ళి చేసుకుంటానని అనేయడానికి రీజనూ కనిపించదు. ఇలాంటి లూప్ హోల్స్ చాలానే ఉన్నాయి. చివరిలో కూడా కథను సుఖాంతం చేయాలని దర్శకుడు అనుకోకపోవడం చిత్రం.


నటీనటుల విషయానికి వస్తే హర్షకు ఇదే మొదటి సినిమా నటన విషయాన్ని పక్కన పెడితే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హీరో అని కాదుగానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రయత్నం చేయొచ్చు. ప్రథమార్ధంలో కీలకమైన పాత్రల్లో రేఖా నిరోషా, అశోక్‌ వర్థన్‌ కనిపిస్తారు. వారి నుంచి చక్కని నటనే దర్శకుడు రాబట్టాడు. ముందు అనుకున్నట్టుగా ఇందులో కీలకమైన పాత్రలన్నీ ద్వితీయార్థంలో ఎంట్రీ ఇస్తాయి. వీటిని అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, అనిరుధ్‌ శ్రీవాస్తవ, సన్నీ, గిరి పోషించారు. అమైరా గోస్వామి తన పాత్ర పరిధి మేరకు నటించి, మెప్పించింది. సుజనా రెడ్డి కొన్ని సన్నివేశాలలో బాగుంది. వీరిద్దరికీ ఇదే మొదటి సినిమా. డాక్టర్ పాత్రలో రవివర్మ చక్కగా సెట్‌ అయ్యాడు. ఇనయా సుల్తానా అతిథి పాత్రలో కనిపిస్తుంది. అంతే! సాంకేతిక నిపుణులలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జే రెక్స్ మ్యూజిక్‌ గురించి. స్వర రచన, నేపథ్య సంగీతం సినిమాకు ఆయువు పట్టు. ఇందులోని పాటలను దర్శకుడు చంద్ర సిద్ధార్థ్‌ రాశారు. సామ్ సుప్రీత్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. సన్నివేశాల మూడ్‌ ను ఎలివేట్ చేసేలా ఉంది. సీనియర్‌ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ రాసిన సంభాషణలు సహజంగా ఉన్నాయి. తెలుగు సినిమా చరిత్రలో అత్యంత పొడవైన టైటిల్‌ అనేది ప్రచారానికి ఉపయోగపడే అంశం తప్పితే, కథకు అవసరమైనది కాదు. రొటీన్ చిత్రాలకు ఇది భిన్నమైంది. కాకపోతే థియేటర్లకు జనాలను రప్పించే ఆర్టిస్టులు, ఎలిమెంట్స్ పెద్దగా లేవు. భిన్నమైన కథాంశాలను ఇష్టపడే వారు ఒకసారి ట్రై చేయొచ్చు. లేదంటే కొద్ది రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయినప్పుడూ చూడొచ్చు.

ట్యాగ్‌లైన్: రొటీన్‌కు భిన్నంగా...

రేటింగ్‌: 2.5/5

ఇవి కూడా చదవండి:

Missing Meghana Review: 'మిస్సింగ్ మేఘన' మూవీ ఎలా ఉందంటే

'పిఠాపురంలో అలా మొదలైంది' మూవీ రివ్యూ

విడిపోయిన.. నటి ఆకృతి, క్రికెటర్ పృథ్వీ షా

Updated Date - Sep 18 , 2026 | 04:07 PM