టాక్సిక్ సినిమా విడుదల అవుతుందా!?
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:24 PM
'టాక్సిక్' చిత్ర నిర్మాత వెంకట్ కె నారాయణ చిక్కుల్లో పడ్డారు. అనుమతికి మించి అటవీ భూమిని వాడుకున్నారని, అక్కడి చెట్లను నరికివేశారని ఆ శాఖ మంత్రి ఆరోపణ చేస్తున్నారు. ఈ విషయమై ఆయనపై కేసు కూడా పెట్టారు.
'కేజీఎఫ్' (KGF) ఫ్రాంచైజ్ మూవీస్ తర్వాత కన్నడ స్టార్ హీరో యశ్ (Yash) నటిస్తున్న సినిమా 'టాక్సిక్' (Toxic). ఈ చిత్రాన్ని కేవియన్ ప్రొడక్షన్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ప్రముఖ మలయాళ నటి గీతూ మోహన్ దాస్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తోంది. మార్చి 19న 'టాక్సిక్' మూవీని కన్నడతో పాటు ఇతర ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయాలని నిర్మాత వెంకట్ కె నారాయణ సంకల్పించారు. దానికి తగ్గట్టుగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సమయంలో ఊహించిన అవాంతరాలు ఆ చిత్ర బృందానికి ఎదురవుతున్నాయి. తాజాగా 'టాక్సిక్' నిర్మాతపై కర్ణాటక అటవీశాఖ కేసు పెట్టింది. పోలీసులు సైతం దీనిని రిజిస్టర్ చేసుకుని ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు.
ఇంతకూ విషయం ఏమిటంటే... 'టాక్సిక్' సినిమా నిర్మాణ సమయంలో అటవీ శాఖ నుండి అనుమతులు తీసుకుని షూటింగ్ జరిపారు. అయితే... చెప్పిన ప్రాంతాన్ని మించి షూటింగ్‌కు వాడారని, ఆ సందర్భంలో అక్కడి చెట్లను కొట్టివేశారని తెలిసింది. ఈ విషయమై గతంలోనే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా... దానిపై అప్పట్లో అటవీ శాఖ స్పందించలేదు. కానీ ఇప్పుడు స్వయంగా అటవీశాఖ మంత్రి షూటింగ్ ప్రాంతాన్ని పర్యటించి, అక్కడ తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ఇది వాస్తవమేనంటూ పోలీసు కేసు పెట్టడంతో చిత్ర యూనిట్ ఇబ్బందుల్లో పడింది. 'టాక్సిక్' మూవీ విడుదలపై కూడా దీని ప్రభావం పడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే 'టాక్సిక్' చిత్రాన్ని తీసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థే విజయ్‌తోనూ 'జన నాయగన్' తమిళ సినిమాను నిర్మించింది. ఆ మూవీ కూడా సెన్సార్ చిక్కుల్లో ఇరుక్కుని విడుదలకు నోచుకోలేదు. దానికి సంబంధించిన సమస్యలను నిదానంగా పరిష్కరించుకుని మార్చిలో మూవీని విడుదల చేయాలని నిర్మాత వెంకట్ నారాయణ చూస్తున్నారు. ఇప్పుడు కన్నడ సినిమా 'టాక్సిక్' కూడా ఇలా ఇబ్బందుల పాలు కావడం ఆయనను చికాకుకు గురిచేస్తోందని సన్నిహితులు చెబుతున్నారు. అంతే కాకుండా 'టాక్సిక్' టీజర్ విడుదలైప్పుడు అందులోని కొన్ని అసభ్యకర సన్నివేశాల పట్ల మహిళా కమీషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెన్సార్ అధికారుల దృష్టికీ దానిని తీసుకెళ్ళింది. దాంతో సి.బి.ఎఫ్.సి. అధికారులూ 'టాక్సిక్'పై ఓ కన్నేసి ఉంచారు. మరి ఈ సమస్యల నుండి వెంకట్ నారాయణ ఎలా బయటపడతారో చూడాలి.