మలయాళ బాక్సాఫీస్.. ‘స్టార్ పవర్’ కాదు.. కంటెంటే కింగ్!
ABN, Publish Date - Aug 31 , 2026 | 05:51 PM
సాధారణంగా ఏ సినీ పరిశ్రమలోనైనా అగ్ర హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్, రికార్డు కలెక్షన్లు ఖాయం. కానీ మలయాళ చిత్ర పరిశ్రమ ట్రెండ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.
సాధారణంగా ఏ సినీ పరిశ్రమలోనైనా అగ్ర హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్, రికార్డు కలెక్షన్లు ఖాయం. కానీ మలయాళ చిత్ర పరిశ్రమ (Malayalam Cinema Industry) ట్రెండ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అక్కడ స్టార్ ఇమేజ్ థియేటర్ల వద్దకు ప్రేక్షకులని తీసుకొస్తుందేమో కానీ, సినిమాను బ్లాక్‌బస్టర్ చేయాలంటే మాత్రం బలమైన కథ, కథనాలు ఉండాల్సిందేనని మలయాళ ఆడియన్స్ పదే పదే నిరూపిస్తున్నారు.
స్టార్స్ ఉన్నా నిలవని భారీ చిత్రాలు
భారీ బజ్, భారీ తారాగణంతో వచ్చిన పలు పెద్ద సినిమాలు కథలో బలం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయి ప్రభావం చూపలేకపోయాయి. ‘పేట్రియాట్, వృషభ, బరోజ్, కింగ్ ఆఫ్ కొత్త, టర్బో, నడికర్’ వంటి చిత్రాలు విడుదలకు ముందు విపరీతమైన హైప్ క్రియేట్ చేసినప్పటికీ, థియేటర్లలో పూర్తిస్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. ఇటీవల భారీ అంచనాలతో వచ్చిన ‘ఖలీఫా’ వంటి భారీ బడ్జెట్ సినిమా సైతం, ఆ తర్వాత వచ్చిన చిన్న చిత్రాల పోటీ ముందు ఆశించిన మేర నిలబడలేకపోయింది.
కోట్లు కొల్లగొట్టిన చిన్న చిత్రాలు
మరోవైపు, పెద్దగా పేరు లేని నటీనటులు లేదా మీడియం బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘రోమాంచం’ అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. మమితా బైజు ప్రధాన పాత్రలో వచ్చిన ‘ప్రేమలు’ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. బలమైన కథనంతో వచ్చిన ‘కుంబళంగి నైట్స్’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. ఇక సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మెల్ బాయ్స్’ మలయాళ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచి చరిత్ర సృష్టించింది.
ఓనం విన్నర్‌గా ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’
కంటెంట్ (Content)కే పెద్దపీట వేసే ఈ ట్రెండ్‌కు తాజా ఉదాహరణగా నిలిచింది ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’. నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని, పండుగ సీజన్‌లో ఏకంగా ఓనం బ్లాక్‌బస్టర్‌గా అవతరించింది. పెద్ద సినిమాలతో పోటీ పడుతూనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. దీనిని మలయాళ బాక్సాఫీస్, ఆడియన్స్ ఇచ్చే సందేశం ఏమిటంటే.. ‘‘స్టార్స్ థియేటర్‌కి దారి చూపిస్తారు.. కానీ సినిమాను బ్లాక్‌బస్టర్ చేసేది మాత్రం కేవలం కంటెంట్ మాత్రమే!’’. అందుకే ఇండియన్ సినిమాలో మాలీవుడ్ బాక్సాఫీస్ ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
విడదీయాలని చూస్తే రోడ్డుపైనే కొడతాం..: జానీ మాస్టర్ వైఫ్
సందీప్ పిలిస్తే రాకపోతే బతికి దండగ..: విజయ్ దేవరకొండ
ఆ క్లాసిక్ సాంగ్‌ను రీమిక్స్ చేస్తున్న త్రివిక్రమ్.. ఇక దండాలే